గురువారం 24 సెప్టెంబర్ 2020
Science-technology - Aug 04, 2020 , 18:34:39

అంగారకుడిపై జీవులు ఉండేవట..!..

అంగారకుడిపై జీవులు ఉండేవట..!..

లండన్‌: అంగారకుడిపై జీవజాల ఉనికిని గుర్తించేందుకు అంతిరిక్ష రంగంలో అనుభవమున్న దేశాలు పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల యూఏఈ, చైనా, అమెరికా తమ ప్రోబ్స్‌ని పంపాయి. అయితే, మార్స్‌ గ్రహం గురించిన సరికొత్త విషయాలను ఓ లండన్‌ పరిశోధన బృందం వెలుగులోకి తీసుకువచ్చింది. ఇంతకుముందు భావిస్తున్నట్లు మార్స్‌ గ్రహం వెచ్చగా, తడిగా ఉండకపోవచ్చని, చల్లగా, ఘనీభవించిన ఉపరితలం ఉంటుందని తేల్చింది. ఇది జీవజాల ఉనికికి ఆధారం అయి ఉంటుందని పేర్కొంది.

గ్లేసియర్సే కారణమా..?

బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు మార్స్‌ గ్రహంపై అధ్యయనం చేశారు. అరుణ గ్రహం చల్లగా, ఘనీభవించిన ఉపరితలం ఉండడానికి గల కారణం అక్కడ గ్లేసియర్స్‌(హిమానీనదాలు) ఉండడం వల్లేనని తేల్చారు. ఇంతకుముందు అంతరిక్ష నౌకలు పంపిన సమాచారాన్ని విశ్లేషించిన పలువురు శాస్త్రవేత్తలు అంగారకుడిపై నీరు ప్రవహించడం వల్లే అక్కడ మచ్చలు ఏర్పడ్డాయని, అంటే నీటి జాడలు ఉండేవని గుర్తించారు. అయితే, అవి నదుల నీరు ప్రవహించడం వల్ల ఏర్పడిన మచ్చలు కావని, హిమనదీయ మంచు ఫలకల కింద నీరు కరగడం వల్ల ఏర్పడ్డాయని బ్రిటన్‌ పరిశోధకులు తేల్చారు. 

మార్స్‌ ఉపరితలంపై విస్తృత అధ్యయనం..

పరిశోధకుల బృందం 10,000 కంటే ఎక్కువ మార్టిన్(మార్స్‌ ఉపరితలంపై ఉన్న) లోయలను పరిశీలించింది. వాటిని మన భూమిపై ఉన్న కెనడియన్ ఆర్కిటిక్ ద్వీపసమూహంలోని సబ్‌గ్లాసియల్ చానెళ్లతో పోల్చినప్పుడు సారూప్యతలు కనిపించాయి. కరిగిన నీటితో ఏర్పడినట్లుగా కనిపించే లోయలు గ్రహం అంతటా వ్యాపించాయని, అయితే నదుల ద్వారా ఏర్పడినవి అరేబియా టెర్రా చుట్టూ మాత్రమే కేంద్రీకృతమై ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రాంతం మార్స్ ఉత్తరాన ఉన్న ఒక పెద్ద ఎత్తైన ప్రాంతం, ఇది భారీగా క్షీణించి, పెద్ద మొత్తంలో లోయలు ఏర్పడ్డాయని నిర్ధారించారు. 

అంగారకుడి వాతావరణ నమూనాలను పరిశీలించారు. 3.8 బిలియన్ సంవత్సరాల క్రితం లోయలు ఏర్పడిన సమయంలో మనం ప్రస్తుతం అంచనా వేసిన దానికంటే చాలా చల్లగా ఉన్నదని కనుగొన్నారు. ఈ ఘనీభవించిన వాతావరణం గతంలో జీవులకు ఆధారమై ఉన్నట్లు గుర్తించారు. అంటే అంగారకుడిపై ఒకప్పుడు జీవం ఉండేదనేదానికి స్పష్టమైన ఆధారాలు కనుగొన్నారు. కాగా, అయస్కాంత క్షేత్రం లేనప్పుడు సూర్యుడి రేడియేషన్‌నుంచి రక్షించే మంచు ఫలకాలను బిలియన్ సంవత్సరాల క్రితం అంగారక గ్రహం కోల్పోయిందని వారు నిర్ధారించారు. ఈ అధ్యయనం నేచర్‌ జియోసైన్స్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo