మంగళవారం 01 డిసెంబర్ 2020
Science-technology - Oct 29, 2020 , 16:10:03

పురుషులకు మాత్రమే వచ్చే కొత్త వ్యాధి..తాజా అధ్యయనంలో వెల్లడి!

పురుషులకు మాత్రమే వచ్చే కొత్త వ్యాధి..తాజా అధ్యయనంలో వెల్లడి!

వాషింగ్టన్‌‌: ప్రపంచమంతా కొవిడ్‌-19తో సతమతమవుతోంది. దీనికి టీకా కనిపెట్టేందుకు నిపుణులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఇదే తరుణంలో పరిశోధకులు మరో చేదు వార్త వినిపించారు. కేవలం మగవారిని మాత్రమే ప్రభావితం చేస్తున్న కొత్త ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ను పరిశోధకులు కనుగొన్నారు. దీన్ని ‘వెక్సాస్‌ సిండ్రోమ్‌’గా పిలుస్తున్నారు.    

అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌(ఎన్‌ఐహెచ్‌)లో భాగమైన నేషనల్‌ హ్యుమన్‌ జీనోమ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్ ‌(ఎన్‌హెచ్‌జీఆర్‌ఐ), ఎన్‌ఐహెచ్ ఇతర ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు ఈ కొత్త సిండ్రోమ్‌ను కనుగొన్నారు. దీన్ని గుర్తించేందుకు వీరు ఒక ప్రత్యేకమైన పద్ధతిని పాటించారు. 2,500 మంది జన్యుశ్రేణులపై అధ్యయనం నిర్వహించారు. కొందరిలో వారు యూబీఏ1 అనే జన్యువును గుర్తించారు. ఇది వాక్యూల్స్, ఈ1 ఎంజైమ్, ఎక్స్-లింక్డ్, ఆటో ఇన్‌ఫ్లమేటరీ, సోమాటిక్ సిండ్రోమ్ (వెక్సాస్‌) అనే ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌కు కారణమవుతుందని తేల్చారు. ఇది అరుదైన, హానికలిగించే జన్యువని కనుగొన్నారు. అన్ని జన్యువులు రెండు కాపీలుంటే ఇది మాత్రం ఒకటే ఉందని, అది కూడా ఎక్స్‌ క్రోమోజోమ్‌లో ఉంటోందని అధ్యయనానికి నేతృత్వం వహించిన డేనియల్‌ కాస్ట్నర్‌ తెలిపారు. మగవారిలో ఒక ఎక్స్‌ క్రోమోజోమ్‌, ఒక వై క్రోమోజోమ్‌ ఉంటుందని, అందుకే ఇది కేవలం ఎక్స్‌ క్రోమోజోమ్‌ కలిగి ఉన్న పురుషుల్లోనే కన్పిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ జన్యువు మ్యుటేషన్‌ అతి ప్రమాదకర ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌కు దారితీస్తుందని తెలిపారు. 

వెక్సాస్‌ సిండ్రోమ్‌ లక్షణాలు.. 

  • సిరల్లో రక్తం గడ్డకట్టడం
  • తరుచుగా జ్వరం రావడం..
  • ఊపరితిత్తుల సంబంధిత రుగ్మతలు
  • మైలోయిడ్ కణాల్లో వాక్యూల్స్

ఈ కొత్త వ్యాధిపై నేషనల్ హ్యూమన్ జీనోమ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ బెక్ మాట్లాడుతూ, ‘మేము దీనిని చూసి ఆశ్చర్యపోయాం..అది ఎలా జరుగుతుందో ఆలోచిస్తున్నాం. పురుషుల్లో మొజాయిజం (రక్తకణాల్లో జన్యుపరమైన వైవిధ్యత) ఉంటేనే ఇది సాధ్యమవుతుంది.’అని పేర్కొన్నారు. రోగుల శరీరాల్లోని నిర్దిష్ట కణాలు యూబీఏ1 జన్యువును దాని సాధారణ రూపంలో తీసుకువెళుతాయని, ఇతర కణాలు జన్యువును దాని పరివర్తన రూపంలో తీసుకువెళుతాయని పరిశోధకుల బృందం అంచనా వేసింది. ఈ పరిశోధన ఫలితాలు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమయ్యాయి. ఇన్‌ఫ్లమేటరీ డిజార్డర్స్‌ మెరుగైన రోగ నిర్ధారణ, చికిత్స కోసం వైద్య నిపుణులకు ఈ అధ్యయనం సహాయపడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.