శుక్రవారం 23 అక్టోబర్ 2020
Science-technology - Sep 17, 2020 , 16:47:59

బ్యాడ్‌ న్యూస్‌: గర్భిణులపై తీవ్రస్థాయిలో కరోనా ప్రభావం..!

బ్యాడ్‌ న్యూస్‌: గర్భిణులపై తీవ్రస్థాయిలో కరోనా ప్రభావం..!

న్యూఢిల్లీ: కొవిడ్‌-19తో గర్భిణులకు హైరిస్క్‌ ఉందని గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. వైరస్‌ తల్లి నుంచి బిడ్డకు బదిలీ అయ్యే అవకాశం లేదని పలు పరిశోధనలు తేల్చిచెప్పినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కొన్ని కేసులు నమోదయ్యాయి. ఇంతలోనే కొవిడ్‌తో గర్భధారణ సమస్యలుంటాయని, పుట్టబోయే బిడ్డకు ప్రమాదమని పలు పరిశోధనలు తేల్చాయి. తాజాగా అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనంలోనూ గర్భిణులకు సంబంధించి ఆందోళన కలిగించే నిజం వెలుగుచూసింది.  కరోనా వల్ల గర్భిణులు తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని, వైరల్‌ సంక్రమణ పుట్టుకతోనే పిల్లల్లో అనేక సమస్యలకు దారితీయవచ్చని తేలింది. అలాగే, ప్రిమెచ్యూర్‌ డెలివరీ (నెలలు నిండకుండానే ప్రసవం) అయ్యే ప్రమాదం కూడా ఉందని తేల్చారు. 

అధ్యయనం ఏం చెబుతోంది..?

అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. తీవ్రమైన కొవిడ్‌ లక్షణాలతో ఉన్న గర్భిణులు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారని తేల్చారు. వారిని ఐసీయూలో చేర్చాల్సి వస్తున్నదని, వెంటిలేటర్‌పై ఉంచాల్సిన అవసరం ఏర్పడుతోందని గుర్తించారు.  మార్చి 1 నుంచి ఆగస్టు 22 మధ్య దవాఖానలో చేరిన 600 మంది గర్భిణులను పరిశీలించారు. ఇందులో 55 శాతం మంది లక్షణరహితంగా ఉన్నారని గుర్తించారు. అలాగే, కొవిడ్‌ లక్షణాలున్న 272 మంది గర్భిణుల్లో 16 శాతం మందిని ఐసీయూలో చేర్చాల్సి వచ్చిందని, 8 శాతం మందికి వెంటిలేటర్ అవసరమైందని తేల్చారు. ఇద్దరు గర్భిణులు ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. ఇదిలా ఉండగా, లక్షణాలు లేని మహిళల్లో ఎవరినీ ఐసీయూ చేర్చే అవసరంగానీ, వెంటిలేషన్‌పై ఉంచాల్సిన పరిస్థితి ఎదురుకాలేదని గుర్తించారు. అలాగే, వీరిలో మరణాలు కూడా సంభవించలేదని తేల్చారు.  

అలాగే, 324 మంది మహిళల్లో 75 శాతం మంది ప్రసూతి కారణాల వల్ల దవాఖానలో చేరినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందులో 19 శాతం మంది మాత్రమే కొవిడ్‌-19 సంబంధిత వ్యాధి లేదా లక్షణాలతో దవాఖాన పాలైనట్లు తేల్చారు. 21 శాతం మంది గర్భిణులలో ఆస్తమా లేదా అధిక రక్తపోటు వంటి కనీసం ఒక వైద్య పరిస్థితి ఉందని తేల్చారు. కొవిడ్‌తో బాధపడుతున్న మహిళల్లో 97.8 శాతం మందికి సాధారణంగానే ప్రసవం కాగా,  2.2 శాతం మంది గర్భం కోల్పోయారని గుర్తించారు. 97.8 శాతం లైవ్‌ బర్త్‌లలో 87.4 శాతం టర్మ్‌ బర్త్స్‌(నెలలు నిండాక ప్రసవం) కాగా, దాదాపు 13 శాతం మంది నెలలు నిండకుండానే ప్రసవించినట్లు తేల్చారు. కాగా, ప్రీ టర్మ్‌ బర్త్స్‌లో  23 శాతం ఎక్కువగా కొవిడ్‌ లక్షణాలు ఉన్న గర్భిణులుండగా, లక్షణాలు లేని గర్భిణులు 8 శాతం ఉన్నట్లు కనుగొన్నారు. ఇదిలా ఉండగా, గర్భిణులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని తమ అధ్యయనం చెబుతోందని శాస్త్రవేత్తలు అంటున్నారు.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo