శుక్రవారం 23 అక్టోబర్ 2020
Science-technology - Jul 17, 2020 , 16:54:25

ఆక్స్‌ఫ‌ర్డ్ టీకాతో డ‌బుల్ ప్రొటెక్ష‌న్‌!

ఆక్స్‌ఫ‌ర్డ్ టీకాతో డ‌బుల్ ప్రొటెక్ష‌న్‌!

హైద‌రాబాద్‌: ‌క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ దేశాల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‌ది. దీంతో ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా న‌మోదైన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1.40 కోట్లు దాటింది. అటు మ‌ర‌ణాల సంఖ్య కూడా 6 ల‌క్ష‌ల‌కు చేరువయ్యింది. అయితే, ఈ కరోనా మ‌హ‌మ్మారి కట్టడికి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయ‌డం కోసం పలు దేశాలు, సంస్థలు నిరంత‌ర పరిశోధనలు జరుపుతున్నాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 155 వ్యాక్సిన్‌లపై ప‌రిశోధ‌న‌లు వివిధ ద‌శ‌ల్లో ఉన్నాయి. అందులో 23 వ్యాక్సిన్‌లు మూడో ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌కు చేరుకున్నాయి. 

కాగా, ఆక్స్‌ఫ‌ర్డ్‌ యూనివర్సిటీకి చెందిన జెన్న‌ర్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్ర‌వేత్త‌లు వ్యాక్సిన్ త‌యారీలో కీలక ముంద‌డుగు వేశారు. మనుషులపై జరిపిన ఫస్ట్‌ఫేజ్‌ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయిన‌ట్లు సైంటిస్టులు వెల్లడించారు. తాము తయారు చేసిన టీకా మనుషుల్లో కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా ప‌నిచేసే యాంటీ బాడీలతోపాటు, కిల్లర్ టీ సెల్స్‌ను కూడా ఉత్పత్తి చేయగలిగింద‌ని చెప్పారు. అందువ‌ల్ల‌ ఈ టీకా కరోనా వైర‌స్ నుంచి డబుల్ ప్రోటెక్షన్ ఇవ్వవచ్చని శాస్త్ర‌వేత్త‌లు భావిస్తున్నారు. 

టీకాల ద్వారా మ‌నిషి శ‌రీరంలో త‌యార‌య్యే యాంటీబాడీలు కొన్ని నెలలు మాత్రమే ఉంటాయని, కిల్ల‌ర్‌ టీ సెల్స్ మాత్రం కొన్నేండ్లవరకూ శ‌రీరంలో ఉంటాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. దీంతో ఆక్స్‌ఫ‌ర్డ్‌ టీకా కరోనా నివారణకు బాగా ఉపయోగపడే అవ‌కాశం ఉందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ టీకా దీర్ఘకాలంపాటు మనుషుల్లో ఎఫెక్టివ్‌గా పని చేస్తుందా? లేదా? అనే విష‌యం మాత్రం తదుపరి ట్రయల్స్‌లోనే తేలుతుందని జెన్న‌ర్ ఇన్‌స్టిట్యూట్‌ సైంటిస్టులు చెబుతున్నారు.

అయితే, రెండో, మూడో ద‌శ ట్రయల్స్‌లో కూడా ఈ వ్యాక్సిన్ మనుషులకు బాగా పని చేస్తున్నట్లు తేలితేనే సక్సెస్ అయినట్లు భావించాలని శాస్త్ర‌వేత్త‌లు అంటున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే ఈ టీకా ట్ర‌య‌ల్స్ సెప్టెంబ‌ర్‌లో పూర్త‌య్యే అవ‌కాశం ఉంద‌న్నారు. ట్ర‌య‌ల్స్ పూర్త‌యితే సెప్టెంబ‌ర్‌లోనే మార్కెట్లోకి వచ్చే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు. ఆక్స్‌ఫ‌ర్డ్‌కు చెందిన జెన్న‌ర్ ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్ అన్ని ద‌శ‌ల ట్ర‌య‌ల్స్ విజ‌య‌వంతంగా పూర్త‌యితే.. ఆస్ట్రాజెనెకా అనే ఫార్మా కంపెనీ దాన్ని ఉత్ప‌త్తి చేసి మార్కెట్‌లోకి తీసుకురానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo