గురువారం 29 అక్టోబర్ 2020
Science-technology - Sep 03, 2020 , 20:34:44

జీవం మూలం గురించి తెలుసుకోవాలంటే ఉల్కలే ఆధారం..!

 జీవం మూలం గురించి తెలుసుకోవాలంటే ఉల్కలే ఆధారం..!

వాషింగ్టన్‌: భూమిపై జీవం మూలం (ఆర్జిన్‌ ఆఫ్‌ లైఫ్‌) అనేది ఇప్పటికీ రహస్యమే. దీనిపై దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నా ఫలితం మాత్రం శూన్యం. ఇందుకు ప్రధాన కారణం భూమిపై దీని తాలూకు ఆధారాలు లేకపోవడమే. కోత, ప్లేట్ టెక్టోనిక్స్, అగ్ని పర్వతాల వల్ల భూమిపై పురాతన శిలలను కోల్పోయాం. దీంతో భూమిపై భూమి ఎక్కడ ఉద్భవించిందో తెలుసుకోవడం సైంటిస్టులకు కష్టసాధ్యమవుతోంది. కానీ, ఇటీవల శాస్త్రవేత్తలు ఉల్కలపై పరిశోధన చేస్తే జీవం మూలం గుట్టు విప్పొచ్చని ఓ అధ్యయనం ద్వారా తెలుసుకున్నారు. భూమిపై కాకుండా అంగారక గ్రహంపై ఉన్న శిలలపై అధ్యయనం సాగిస్తే ఈ రహస్యాన్ని ఛేదించవచ్చని వారు అంచనా వేశారు. 

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా), యురోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ (ఈఎస్ఏ) శాస్త్రవేత్తలు అంగారక గ్రహంపై ఉన్న క్రేటర్స్‌పై దృష్టిసారించాల్సిన అవసరముందని కొత్త అధ్యయనం పేర్కొంటున్నది. అక్కడి శిలలపై అధ్యయనం చేస్తే జీవం మూలం తెలుసుకోవచ్చునని చెబుతోంది. ఈ అధ్యయనం వివరాలు ఆస్ట్రోబయాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. భూమిపై జీవం పుట్టుక కోసం మనం వెతుకుతున్నాం.. కానీ ఉల్కలు, కేట్రర్లను మరిచిపోయామని ఈ అధ్యయనం అంటోంది. ఎడిన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయం, జార్జ్‌టౌన్‌ వర్సిటీ, దక్షిణ కాలిఫోర్నియా వర్సిటీ పరిశోధకుల బృందం ఈ కొత్త అధ్యయనాన్ని చేపట్టింది. ఉల్కలపై పరిశోధన చేస్తున్న వెస్ట్రన్స్ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎర్త్‌ అండ్‌ స్పేస్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ (వెస్ట్రన్‌ స్పేస్‌) డైరెక్టర్‌ ఒసిన్స్కి సలహాలను ఈ అధ్యయనం పరిశీలనలోకి తీసుకుంది. కాగా, పర్సివరెన్స్‌, ఎక్సోమార్స్‌ రోవర్లతో అంగారకుడిపై అన్వేషణ జరిపి జీవం పుట్టుక గుట్టును విప్పవచ్చని ఒసిన్స్కి అంచనావేస్తున్నారు. మార్స్‌పై ఉన్న క్రేటర్స్‌లో ఉల్కలను విశ్లేషించగలిగితే ఎన్నో ఏళ్లుగా కనుగొనలేకపోతున్న రహస్యాన్ని ఛేదించొచ్చని అంటున్నారు.