సోమవారం 28 సెప్టెంబర్ 2020
Science-technology - Aug 13, 2020 , 15:48:10

బిన్నూ ఆస్టరాయిడ్‌ వద్దకు వెళ్లొచ్చిన నాసా శాటిలైట్‌

బిన్నూ ఆస్టరాయిడ్‌ వద్దకు వెళ్లొచ్చిన నాసా శాటిలైట్‌

వాషింగ్టన్‌ : విశ్వం ఆవిర్భావం నాటి రహస్యాలను తెలుసుకునేందుకు బిన్నూ ఆస్టరాయిడ్‌పై నమూనాలను సేకరించేందుకు నాసా ప్రయోగించిన ఓస్రిస్‌ రెక్స్‌ ఉపగ్రహం ఈ నెల 11న ఉత్తరార్ధగోళంలో ఉన్న ఆ గ్రహశకలానికి అత్యంత దగ్గర వరకూ వెళ్లి వచ్చింది. ఈ మేరకు అమెరికాలోని గోడార్డ్‌ స్పేస్‌ ఫ్లయింట్‌ సెంటర్‌లోని నాసా శాస్త్రవేత్తలు వివరాలు వెల్లడించారు. వచ్చే అక్టోబర్‌లో ఓస్రిస్‌ రెక్స్‌ ఉపగ్రహం బిన్నూ ఆస్టరాయిడ్‌పై దిగకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రోబోటిక్‌ ఆర్మ్‌తో శాంపిళ్లను సేకరిస్తుంది. ఇది కిష్టమైన ప్రక్రియ. బిన్నూ సెకనకు 28 కిలోమీటర్ల వేగంతో తన చుట్టూ తాను తిరుగుతూ ముందుకు ప్రయాణిస్తూ ఉంటుంది. దీంతో స్పేస్‌క్రాఫ్ట్‌ ఎంత వేగంతో తిరుగుతుందో అంతే వేగంతో తిరుగుతూ దానికి అతి దగ్గరగా వెళ్లి నమూనాలు సేకరించే వరకు రోబోటిక్‌ ఆర్మ్‌ గ్రహశకలం ఉపరితలాన్ని అంటిపెట్టుకొని ఉండాల్సి వస్తుంది. కాబట్టి బిన్నూ వేగాన్ని అందుకోవడంలో విఫలమైతే మొత్తం మిషన్‌ నాశనం కావడంతో పాటు విశ్వ ఆవిర్భావం గురించి తెలుసుకోవాలన్న ఆశలు కూడా సన్నగిల్లినట్లే.

దీంతో శాంపిల్‌ను సేకరించే ముందు పలుసార్లు ఈ ఆస్టరాయిడ్‌ ఉపరితలానికి దగ్గరగా వెళ్లి, దాన్ని వేగాన్ని అందుకొని చుట్టూ తిరిగి వస్తుంది. ఇలా పలుసార్లు సాధన చేసి చివరకు నమూనాలు సేకరిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఒకసారి బిన్నూ ఉపరితలం వరకు వెళ్లి వచ్చిన ఓస్రిస్‌ రెక్స్‌ అంతరిక్ష నౌక తాజాగా 11న మరోసారి వెళ్లి వచ్చింది. స్పేస్‌క్రాఫ్ట్‌ కక్ష నుంచి బిన్నూ గ్రహశలం వద్దకు వెళ్లి తిరిగి వచ్చేందుకు నాలుగు గంటల సమయం పట్టిందని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. బిన్నూ ఉపరితలం నుంచి సమారు 410 అడుగులు (125 మీటర్లు) ఎత్తులో ఓస్రిస్‌ రెక్స్‌ అంతరిక్ష నౌక విహరించింది. అక్కడి నుంచి మరోసారి ఇంధనం మండించుకొని అత్యంత సమీపానికి విజయవంతంగా 131 అడుగుల (40 మీటర్ల) వరకు వెళ్లి వచ్చింది. ఇందుకు సంబంధించిన చిత్రాలు, వీడియోను స్పేస్‌ సెంటర్‌కు పంపింది.

వ్యోమనౌకతో పాటు బెన్నూ గ్రహశకలం ప్రస్తుతం భూమి నుంచి 179 మిలియన్‌ మైళ్ల (288 మిలియన్‌ కిలోమీటర్లు) దూరంలో ఉందని, అంతరిక్ష నౌకకు ఆదేశాలు ఇచ్చేందుకు ఉపయోగించే రేడియో సిగ్నల్స్‌ అందుకునేందుకు 16 నిమిషాలు పడుతుందని శాస్త్రవేత్తలు వివరించారు. వ్యోమనౌక ఇమేజింగ్‌, నావిగేషన్‌, ఇతర వ్యవస్థలన్నీ ఊహించిన విధంగానే పని చేస్తున్నాయని తెలిపారు. ఈ రిహార్సల్స్‌ సమయంలో కమ్యూనికేషన్‌, స్పేస్‌క్రాఫ్ట్‌ థ్రస్టర్లు, ముఖ్యంగా ఆన్‌బోర్డ్‌ నేచురల్‌ ఫీచర్‌ ట్రాకింగ్‌ మార్గదర్శక వ్యవస్థ, ప్రమాద పటం తదితర ముఖ్యమైన వ్యవస్థలన్నీ ఉపయోగించినట్లు టాక్సన్‌లోని అరిజోనా విశ్వవిద్యాలయానికి చెందిన ఓస్రిస్‌ రెక్స్‌ ప్రిన్సిపాల్‌ ఇన్వెస్టిగేటర్‌ డాంటే లారెట్టా చెప్పారు.

‘మేం ఇప్పుడు ఈ మైలు రాయిని పూర్తి చేస్తాం. టాగ్‌ ఈవెంట్‌ కోసం విధానాలను ఖరారు చేయడంలో మాకు నమ్మకం ఉంది. ఈ రిహార్సల్ బృందం, అన్ని అంతరిక్ష నౌక వ్యవస్థలు అక్టోబర్‌లో నమూనాలు సేకరించేందుకు సిద్ధంగా ఉన్నాయని నిర్ధారించాయి’ అని వివరించారు.  కాగా, షెడ్యూల్‌ మేరకు ఓస్రిస్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ వచ్చే అక్టోబర్‌ 20న గ్రహశకలం ఉపరితలం వరకు వెళ్లి.. కొద్ది సెకన్ల పాటు బిన్నూ ఉపరితలాన్ని తాకి అవసరమైన నమూనాలు సేకరిస్తుంది. విజయవంతంగా నమూనాలను సేకరిస్తే తిరిగి 2023 సెప్టెంబర్ 24న భూమికి తిరిగి రానుంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo