బుధవారం 30 సెప్టెంబర్ 2020
Science-technology - Aug 13, 2020 , 17:04:05

వచ్చే నెల 10 న మైక్రోసాఫ్ట్ సర్ఫేస్‌ డుయో ప్రీ బుకింగ్‌

వచ్చే నెల 10 న మైక్రోసాఫ్ట్ సర్ఫేస్‌ డుయో ప్రీ బుకింగ్‌

వాషింగ్టన్‌ : గత కొన్ని నెలలుగా మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెల్ల చేతిలో కనిపించిన స్మార్ట్‌ఫోన్ సర్ఫేస్‌ డుయో త్వరలో సామాన్యులకు అందుబాటులో రానున్నది. చాలాకాలం పాటు ఎదురుచూసిన తరువాత.. మైక్రోసాఫ్ట్ చివరకు ఈ ఫోన్‌ను లాంచ్ చేయడం ద్వారా సస్పెన్స్‌ను నిలిపివేయనున్నది. మైక్రోసాఫ్ట్ మొట్టమొదటి డ్యూయల్ ఫోల్డబుల్ స్క్రీన్ స్మార్ట్‌ఫోన్ సర్ఫేస్ డుయోను సెప్టెంబర్ 10 న ప్రీ బుకింగ్‌ ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది. 

మైక్రోసాఫ్ట్ కంపెనీ స్మార్ట్ఫోన్ విభాగంలోకి 2014 నవంబర్ నెలలో ప్రవేశించింది. తొలుత స్మార్ట్‌ఫోన్‌ లూమియా 535 ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. దీని తరువాత 11 లూమియా స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. కాగా చివరి స్మార్ట్‌ఫోన్ లూమియా 650 ని 2016 ఫిబ్రవరిలో తీసుకొచ్చారు. నాలుగేండ్ల తర్వాత ఇప్పుడు సర్ఫేస్‌ డుయోను మార్కెట్లో తీసుకొచ్చేందుకు మైక్రోసాఫ్ట్‌ సిద్ధంగా ఉన్నది.

సర్ఫేస్‌ డుయో ఫోన్ ధర రూ.1 లక్ష కంటే ఎక్కువగా ఉంటుంది. మైక్రోసాఫ్ట్ గత ఏడాది అక్టోబర్‌లో తన హార్డ్‌వేర్ సమావేశంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ సందర్భంలో కంపెనీ డ్యూయల్ స్క్రీన్ టాబ్లెట్ నియో, సర్ఫేస్ ల్యాప్‌టాప్ 3, సర్ఫేస్ ప్రో 7, సర్ఫేస్ ప్రో ఎక్స్‌లను కూడా ప్రవేశపెట్టింది. ఈ పరికరాలన్నింటినీ 360 డిగ్రీల వరకు తిప్పగలిగే వీలుంటుంది. సర్ఫేస్‌ డుయో స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర 1,399 డాలర్లుగా (సుమారు రూ.1,04,700) ఉంటుందని కంపెనీ తన బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. తొలుత ఈ ఫోన్లను అమెరికాలో విక్రయించాలని కంపెనీ నిర్ణయించింది. సంస్థ తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రీ-బుకింగ్‌ను కూడా ప్రారంభించింది. మైక్రోసాఫ్ట్ యొక్క ఆన్‌లైన్ స్టోర్‌లో 128GB లేదా 256GB లను ఎంచుకోవడం ద్వారా దీన్ని బుక్ చేసుకోవచ్చు.

128GB 1399.99 డాలర్లు (సుమారు రూ. 1,04,700) గా ఉండగా, 256GB ధర 1499.99 డాలర్లు (సుమారు రూ. 1,12,200) గా ఉన్నాయి. 

హార్డ్‌వేర్‌ స్పెసిఫికేషన్స్‌

ఈ డ్యూయల్ స్క్రీన్ స్మార్ట్‌ఫోన్‌కు రెండు 5.6-అంగుళాల ఓఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఉంటాయి. దీని డిస్ప్లే రిజల్యూషన్ 1,350 x 1,800 పిక్సెల్స్. రెండు స్క్రీన్‌లు విప్పిన తరువాత 8.1-అంగుళాల టాబ్లెట్‌గా మారుతుంది. అప్పుడు దాని డిస్ప్లే రిజల్యూషన్ 2,700 x 1,800 పిక్సెల్స్ అవుతుంది. స్క్రీన్‌ను 360 డిగ్రీల వరకు తిప్పవచ్చు. ఇప్పటివరకు మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉపయోగించగా.. ఇప్పుడు ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగివుంటుంది. అలాగే చాలా మైక్రోసాఫ్ట్ యాప్‌లు ముందే ఇన్‌స్టాల్ చేయబడతాయి. 

ఈ స్మార్ట్‌ఫోన్‌కు 11 మెగాపిక్సెల్ కెమెరా లెన్స్ మాత్రమే లభిస్తుంది. ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్,  6 జిబి ర్యామ్‌ను కలిగివుంటుంది. దీనికి 3,577 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన రెండు బ్యాటరీలు ఉంటాయి. వై-ఫై, బ్లూటూత్, యుఎస్‌బీ టైప్-సీ వంటి కనెక్టివిటీ ఎంపికలు అందుతాయి. 

ఒకేసారి రెండు యాప్‌లలో..

సర్ఫేస్ డుయోకు ఉన్న రెండు స్క్రీన్‌లలో వేర్వేరు రెండు యాప్‌లను ఒకేసారి యాక్సెస్ చేయవచ్చు. మొదటి స్క్రీన్‌లో వాట్సాప్, రెండో స్క్రీన్‌లో ఫేస్‌బుక్‌లో ఒకేసారి రన్ చేసుకునే వీలుంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కాంపాక్ట్ ల్యాప్‌టాప్ లాగా ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల టైపింగ్ పని చాలా సులభం అవుతుంది.


logo