బుధవారం 05 ఆగస్టు 2020
Science-technology - Aug 01, 2020 , 18:29:21

మార్స్‌ నివాసయోగ్యమా.. కాదా? త్వరలోనే తేలనున్న గుట్టు!

 మార్స్‌ నివాసయోగ్యమా.. కాదా? త్వరలోనే తేలనున్న గుట్టు!

హైదరాబాద్‌: భూమి తర్వాత అత్యంత నివాసయోగ్య గ్రహంగా భావిస్తున్న అంగారకుడి గుట్టు త్వరలోనే వీడనుంది. మార్స్‌పై జీవజాలం ఉందా? దానిపై నీరు ఎప్పుటి వరకూ ఉంది.? ఎప్పుడు అంతర్థానం అయిపోయింది.? అనే ప్రశ్నలకు సమాధానం లభించనుంది. ఎందుకంటే అరుణగ్రహం రహస్యాలు తెలుసుకునేందుకు అంతరిక్ష రంగంలో ముందున్న దేశాలన్నీ ఇప్పుడు వరుసకట్టి స్పేస్‌క్రాఫ్ట్‌లను పంపిస్తున్నాయి. అవి పంపే సమాచారం ఆధారంగా మార్స్‌ నివాసయోగ్య గ్రహమా? కాదా? తేల్చే పనిలో నిమగ్నమయ్యాయి.

నెల వ్యవధిలో మూడు నౌకలు..

అంగారక గ్రహంపైకి నెలల వ్యవధిలో మూడు స్పేస్‌క్రాఫ్ట్‌లు తమ ప్రయాణం ప్రారంభించాయి. గత రెండు వారాల క్రితం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ అల్‌-అమల్‌, చైనా తియాన్వే- 1 అనే అంతరిక్ష నౌకలను విజయవంతంగా ప్రయోగించాయి. మూడోది నాసాకు చెందిన మార్స్‌ మిషన్‌ 2020. ఇది పెర్సివరెన్స్‌ అనే రోవర్‌ను కలిగి ఉంది. దీనిని జూలై 30న ఫ్లోరిడా నుంచి విజయవంతంగా ప్రయోగించారు. ఇది ఇప్పటివరకూ పంపిన నౌకలకంటే ప్రత్యేకమైనదని నాసా పేర్కొంటోంది. అరుణగ్రహంపై జీవజాల ఉనికిని పక్కాగా తెలుసుకుంటుందని ధీమా వ్యక్తంచేస్తున్నది. కాగా, ఈ మూడు అంతరిక్ష నౌకలు ఇంతుకుముందే మార్స్‌పై దిగిన డజన్‌కంటే ఎక్కువ క్రాఫ్ట్‌లతో జతకట్టనున్నాయి. అంగారకుడి అణువణువునూ శోధించి, భూమిపైకి సమాచారంతోపాటు నమూనాలనూ చేరవేయనున్నాయి.

ఇప్పుడే ఎందుకు..?

మరి అన్ని దేశాలూ ఎందుకు వరుసగా అంగారకుడిపైకి స్పేస్‌క్రాఫ్ట్‌లను ప్రయోగిస్తున్నాయంటే ఇదే అనువైన కాలం. గ్రహగమన వ్యవస్థ ప్రకారం.. ప్రతి రెండు లేదా అంతకంటే ఎక్కువ ఏళ్లకు భూమి, అంగారకుడు అతి దగ్గర కక్ష్యల్లో ప్రయాణిస్తాయి. అంటే రెండు అత్యంత సమీపానికి వస్తాయి. ఈ దృగ్విషయం ఆరు నెలల కంటే తక్కువ సమయం ఉంటుంది. ఇప్పుడు ఇది అలాంటి సమయమే కనుక దేశాలన్నీ తమ క్రాఫ్ట్‌లను అంగారకుడిపైకి పంపుతున్నాయి. మళ్లీ ఇలాంటి సమయం 2022లో వస్తుంది. అందుకే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తన ‘ఎక్సోమార్స్ 2022’ను అప్పుడే ప్రయోగించాలని భావిస్తోంది.

అంగారకుడిపైకి ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఎందుకు ప్రయోగిస్తున్నారు? 

అంగారకుడిపై ఇంతకుముందే నీటిజాడలను రోవర్స్‌ పంపిన చిత్రాల ఆధారంగా గుర్తించారు. కానీ నీరు ఎప్పుడు అదృశ్యమైంది? నీరంతా ఏమైపోయింది? దీనికి గల కారణాలేంటి? తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే, అతి ప్రధానమైనది అంగారకుడిపై జీవజాల ఉనికి.. ఇది తెలుసుకుంటే మార్స్‌ మిషన్‌ విజయవంతమైనట్లే. కాగా, మూడు దేశాలు పంపిన మూడు క్రాఫ్ట్‌లకు విభిన్న లక్ష్యాలున్నాయి. యూఏఈ క్రాఫ్ట్‌ అల్‌-అమన్‌ అంగారకుడిపై రెండేళ్లు ఉంటుంది. భూమి కక్ష్యలో ఉన్న వాతావరణ ఉపగ్రహాల మాదిరిగా ఇది అరుణగ్రహంపై వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుంది. ఇక చైనా తియాన్వే- 1 మార్స్‌ కక్ష్యలో తిరుగుతూ రోవర్‌ను అంగారకుడిపై ఉన్నయుటోపియా ప్లానిటియా వద్ద వదిలిపెడ్తుంది. ఈ రోవర్‌ మార్స్‌పై ఉన్న మట్టి నమూనాలను విశ్లేషిస్తుంది. అలాగే, ఆ గ్రహ ఉపరితల చిత్రాలను తీసి పంపిస్తుంది. 

ఇదిలా ఉండగా, నాసా పెర్సివెరెన్స్‌ రోవర్‌ అంగారకుడిపై ఉన్న  జెజెరో క్రేటర్‌లో దిగుతుంది. ఇది స్కై-క్రేన్ టెక్నాలజీ ద్వారా ఉపరితలంపై నడుస్తుంది. అక్కడి నేల స్వభావాన్ని విశ్లేషించేందుకు ఇందులో అత్యాధునిక శాస్త్రీయ పరికరాలను అమర్చారు.  ఇది అక్కడి శిలలు, నేలలోని ఖనిజాలు, రసాయనాలను విశ్లేషిస్తుంది.  అలాగే, దీనిలో ఒ చిన్న హెలిక్యాప్టర్‌ను కూడా పంపించారు. ఇది పెర్సివెరెన్స్‌ రోవర్‌ ల్యాండ్‌ కాకముందే హెలిక్యాప్టర్‌ గ్రహం ఉపరితలంపైకి చేరుకుంటుంది. ఇది కొద్ది నిమిషాలు మాత్రమే ఎగురగలుగుతుంది. అంగారకుడిపై డ్రోన్లు, హెలిక్యాప్టర్లు ఎగురగలుతాయా? అని తెలుసుకునేందుకే దీన్ని నాసా పంపించింది.  ఇది రోవర్లకు మార్గనిర్దేశం చేయడంలో సహాయపడుతుంది. అలాగే, ఈ పెర్సివెరెన్స్‌ రోవర్‌ మరో ప్రత్యేకత ఏంటంటే ఇది పది సెంటీమీటర్ల పొడవు, ఒక సెంటీమీటర్ వ్యాసం కలిగిన ఒక కోర్‌ను రంధ్రం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వివిధ శిలలను డ్రిల్‌ చేసి, నమూనాలను సేకరించగలదు. 

శాంపిల్స్‌ భూమిపైకి ఎందుకు?

అంగారకుడిపై రోవర్లు సేకరించిన నమూనాలను భూమిపైకి ఎందుకు పంపిస్తారనేది అందరి మదిని తొలిచే ప్రశ్న. రోవర్లు అరుణగ్రహంపై సేకరించిన సమాచారాన్ని విశ్లేషించినప్పటికీ పూర్తిస్థాయిలో చేయలేవు. అంటే ఒక శిలలో గల ఖనిజ లవణాలు, రసాయనాలను గుర్తించినా.. అణువణువునూ అనలైజ్‌ చేయలేవు. రోవర్స్‌ సేకరించిన పదార్థాలు జీవసంబంధమైన మూలాల్ని  కలిగి ఉన్నాయా? అనేది గుర్తించేందుకు చాలా విస్తృతమైన, సంక్లిష్టమైన విభిన్న విశ్లేషణలు చేయాల్సి ఉంటుంది.  ఇది అంగారక గ్రహంపై చేయలేం. అందుకే రోవర్స్‌ సేకరించిన డేటాను భూమిపైకి పంపితే ఇక్కడ ల్యాబ్‌లలో విశ్లేషిస్తారు. శిలల బరువును అణువుణువూ లెక్కించాల్సి ఉంటుంది. అలాగే, అది ఏర్పడడానికి అవసరమైన అణువులన్నింటినీ కనుగొనాల్సి ఉంటుంది. ఇందుకోసమే ఓ బహుళ జాతీయ ప్యానెల్‌ ఏర్పాటు చేయబడింది.

రోవర్స్‌ పంపిన నమూనాలను ఎలా నిల్వ చేయాలి.. క్యూరేట్‌ చేయాలి? శాస్త్రీయ సమాజానికి ఎలా పంపిణీ చేయాలి అనేది బహుళ జాతీయన ప్యానెల్‌ (ఎంఎస్‌పీజీ-2) నిర్ణయిస్తుంది. దీంతోపాటు మార్స్‌ నుంచి నమూనాలను తిరిగి తీసుకురావడానికి గల మరొక ప్రధాన కారణం.. భవిష్యత్తులో చేపట్టనున్న మార్స్‌పైకి మానవసహిత అంతరిక్ష ప్రయోగం. మానవులను అంగారక గ్రహానికి పంపితే, తిరిగి ఎలా తీసుకురావాలో తెలుసుకోవాలి. ఈ నమూనాలను తిరిగి తీసుకురావడమనే కాన్సెప్ట్‌ దీనికి ఎంతో తోడ్పడనుంది.1972 డిసెంబర్‌లో అపోలోలో 17 మంది వ్యోమగాములు చంద్రుడిపై కాలుమోపి వచ్చిన తర్వాత, ఇప్పటిదాకా మరొక గ్రహం నుంచి నేరుగా ఏదీ తీసుకురాలేదు 

‘మేం అంగారకుడిపై చాలాకాలంగా పరిశోధన సాగిస్తున్నాం. 150 ఏళ్లుగా టెలిస్కోప్‌ ద్వారా, 50 ఏళ్లుగా కక్ష్యల ఆధారంగా, 20 ఏళ్ల నుంచి రోవర్ల ద్వారా పరిశీలిస్తున్నాం. మరో 12 ఏళ్లలో మార్స్‌ గ్రహాన్ని మా సొంత ప్రయోగశాలల్లో విశ్లేషించనున్నాం. పెర్సివెరెన్స్‌ ఈ కల సాకారం చేస్తుందని నమ్ముతున్నాం.’ అని ది ఓపెన్‌ వర్సిటీ, ప్లానెటరీ అండ్‌ స్పేస్‌ సైన్సెస్‌ ప్రొఫెసర్‌ మోనికా గ్రేడి పేర్కొన్నారు. ఆమె మాటలను బట్టి చూస్తే మరో కొద్ది ఏళ్లలోనే మార్స్‌ గుట్టు వీడనుందని తెలుస్తున్నది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo