శనివారం 04 జూలై 2020
Science-technology - May 29, 2020 , 21:12:53

ఆకాశంలో విహ‌రించిన తొలి ఎల‌క్ట్రిక్‌ విమానం

ఆకాశంలో విహ‌రించిన తొలి ఎల‌క్ట్రిక్‌ విమానం

వాషింగ్టన్‌: స‌రికొత్త సాంకేతిక ప‌రిజ్ఞానంతో రూపొందించిన ఒక ఎల‌క్ట్రిక్ విమానం తొలిసారిగా ఆకాశంలోకి ఎగిరింది. ప్రపంచంలోనే అతిపెద్దది అయిన ఈ ఎలక్ట్రిక్ విమానాన్ని విజ‌య‌వంతంగా ఆకాశంలో విహ‌రింప‌జేశారు. అమెరికాలోని వాషింగ్టన్ న‌గ‌రంలో ఈ విమానాన్ని న‌డిపి ప‌రిశీలించారు. దాదాపు 30 నిమిషాలపాటు ఈ ఫ్లైట్ విహ‌రించింది. సెస్నా-208 క్యారవాన్‌ అనే పేరుగ‌ల‌ ఈ విమానాన్ని అమెరికాకు చెందిన మాగ్ని ఎక్స్ అనే సంస్థ త‌యారుచేసింది.  

పూర్తిగా ఎలక్ట్రికల్‌ ఇంజిన్‌తో తొమ్మిది మంది ప్రయాణికులు కూర్చొనే విధంగా ఈ విమానాన్ని రూపొందించారు. దీనిలో 750 హెచ్‌పీ సామర్థ్యంగ‌ల‌ మోటార్‌ను అమర్చారు. తాము త‌యారుచేసిన ఎల‌క్ట్రిక్ విమానం 30 నిమిషాల‌పాటు విజ‌య‌వంతంగా ఆకాశంలో విహ‌రించి మోసెస్‌ సరస్సు వద్ద ల్యాండయ్యింద‌ని మాగ్ని ఎక్స్‌ సంస్థ తెలిపింది. అయితే, ఈ ప్రయోగం సమయంలో విమానంలో పైలట్‌ మాత్రమే ఉన్నారు. గంటకు 183 కి.మీల వేగంతో ఆయ‌న విమానాన్ని న‌డిపారు. కాగా, 2021 నాటికి ఈ విమాన కమర్షియల్‌ సర్వీసులను అందుబాటులోకి తేవాలని మాగ్ని ఎక్స్‌ సంస్థ భావిస్తున్న‌ది. 


logo