‘సినిమాల ప్రభావం జనాలమీద ఎంతుందో తెల్వదుకానీ.. పంచ్ డైలాగ్‌ల ప్రభావం గట్టిగా ఉన్నది’ ఆగడు సినిమాలో హీరో మహేశ్‌బాబు పంచ్ డైలాగ్లపై వేసే పంచ్ ఇది. అందుకే జనాలను ప్రభావితం చేసే ఈ మార్గాన్నే ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఎంచుకున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనల ఫొటోలు, ఆన్లైన్ మోసాలపై వార్తలకు పంచ్ డైలాగ్‌లను జతపరుస్తూ సోషల్‌మీడియా వేదికగా చురకలంటిస్తున్నారు. ఇవి అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ముఖ్యంగా సైబరాబాద్ పోలీసులు ఈ తరహా ప్రయోగాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు.
నంబర్ ప్లేట్‌ను కవర్ చేసేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కినవారి ఫొటోలకు నర సిం హ సినిమాలో రజినీకాంత్ చెప్పే డైలాగ్‌ను.. ‘అతిగా ఉల్లంఘనలు చేసే వాహనదారులు, చలాన్లు పడకుండా నంబర్ ప్లేట్ దాచేవాళ్లు తప్పించుకున్నట్టు చరిత్రలో లేదు’ అని జతచేశారు.
గిఫ్ట్‌లు, లాటరీల పేరుతో వలవేస్తున్న సైబర్ నేరగాళ్లకు సంబంధించిన వార్తకు బ్రహ్మా నందం, నాజర్‌ల మధ్య ఫేమస్ డైలాగ్‌ను ‘పద్మ నాభ సింహా.. నీకు ఎన్నిసార్లు చెప్పాలి. ఇలాంటి ఫ్రాడ్ మెసేజ్‌లు వచ్చినప్పుడు రెస్పాండ్ కావొద్దని, ఇప్పుడు చూడు డబ్బు మొత్తం పోగొట్టుకున్నావ్’ అని పెట్టారు.
నంబర్ ప్లేట్‌కు కాలు అడ్డు పెట్టి చలాన్ పడకుండా చూద్దామనుకున్న ఓ వాహనదారుడి ఫొటోను పెట్టి..‘నువ్వేమో 1300 రూపాయలు కాపాడదాం అని కాలుపెట్టావ్.. కానీ నువ్వు చేసిన ఈ పనికి ఇంకో 1500 ఎక్కువ పడ్డాయ్’ అంటూ ‘అత్తారింటికి దారేది’ సినిమా డైలాగ్ పంచ్‌ను జత చేశారు.
బైక్‌పై వ్యక్తి అడ్డగోలు ఫీట్లు చేస్తూ పట్టుబడిన ఫొటోకు ‘హాయ్.. వీడి ఫెర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చితే ఫొటో లేదా వీడియో తీసి టైం.. లొకేషన్ సహా వాట్సాప్ చేయండి’ అని బ్రహ్మానందం డైలాగ్ పెట్టారు.
సినిమాల్లోని పంచ్ డైలాగ్‌లు మనసులో ఎప్పటికీ ఉంటాయి. వాటిని వాడుకుని సైబర్ మోసాలు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల వంటివాటిపై ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నాం. సైబరాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో సోషల్ మీడియా పోస్టుల ద్వారా ప్రచారం చేస్తున్నాం. ప్రజలకు సమాచారాన్ని సూటిగా, మరింత ఆకర్షణీయంగా చెప్పాలన్నదే మా ప్రయత్నం. – సజ్జనార్, సైబరాబాద్ సీపీ