శనివారం 28 నవంబర్ 2020
Science-technology - Nov 21, 2020 , 14:45:38

మ‌న‌కూ ఓ జీపీఎస్‌.. ఐఆర్ఎన్ఎస్ఎస్ అంటే ఏమిటి?

మ‌న‌కూ ఓ జీపీఎస్‌.. ఐఆర్ఎన్ఎస్ఎస్ అంటే ఏమిటి?

హైద‌రాబాద్‌: ఈ మ‌ధ్యే ఇండియా ఓ అరుదైన జాబితాలో చేరింది. స్వతంత్ర ప్రాంతీయ నావిగేష‌న్ శాటిలైట్ వ్య‌వ‌స్థ క‌లిగిన నాలుగో దేశంగా నిలిచింది. ఇంట‌ర్నేష‌న‌ల్ మారిటైమ్ ఆర్గ‌నైజేష‌న్ (ఐఎంవో) కూడా దీనిని గుర్తించింది. ఈ నావిగేష‌న్ వ్య‌వ‌స్థ‌ను హిందూ మ‌హా స‌ముద్ర జ‌లాల్లో ఓడ‌లు ఉప‌యోగించుకోవ‌చ్చు. భార‌త స‌రిహ‌ద్దు నుంచి 1500 కిలోమీట‌ర్ల మేర ఈ వ్య‌వ‌స్థ ప‌ని చేస్తుంది. ఇంత వ‌ర‌కూ వాడుతున్న జీపీఎస్‌ను ఇప్పుడు ఇండియ‌న్ రీజిన‌ల్ నావిగేష‌న్ సిస్ట‌మ్ (ఐఆర్ఎన్ఎస్ఎస్) భ‌ర్తీ చేయ‌నుంది. భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ ఇస్రో అభివృద్ధి చేసిన ఈ ఐఆర్ఎన్ఎస్ఎస్‌కు గుర్తింపు పొంద‌డానికి రెండేళ్ల స‌మ‌యం ప‌ట్టింది. హిందూ మ‌హా స‌ముద్ర  జ‌లాల్లో ప్ర‌యాణించే వాణిజ్య ఓడ‌లు ఇప్పుడీ మ‌రింత ఆధునిక‌, క‌చ్చిత‌మైన నావిగేష‌న్ వ్య‌వ‌స్థ‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. 

ఐఆర్ఎన్ఎస్ఎస్ అంటే ఏమిటి?

ఐఆర్ఎన్ఎస్ఎస్ ఇండియా స్వ‌తంత్రంగా అభివృద్ధి చేసుకున్న ప్రాంతీయ నావిగేష‌న్ శాటిలైట్ వ్య‌వ‌స్థ‌. హిందూ మ‌హా స‌ముద్ర జలాల్లో ప్ర‌యాణించే ఓడ‌లకు క‌చ్చిత‌మైన నావిగేష‌న్ వ్య‌వ‌స్థ‌ను అందించ‌డానికి దీనిని రూపొందించారు. ఇప్ప‌టి వ‌ర‌కు అమెరికా రూపొందించిన గ్లోబ‌ల్ పొజిష‌నింగ్ సిస్ట‌మ్‌నే వాడుతున్నారు. ఈ వ్య‌వ‌స్థ‌ను రూపొందించ‌డం కోస‌మే ఇస్రో ప్ర‌త్యేకంగా 8 శాటిలైట్ల‌ను లాంచ్ చేసింది.