శుక్రవారం 30 అక్టోబర్ 2020
Science-technology - Oct 13, 2020 , 17:04:33

సామ‌ర్థ్యాల మెరుగుకు అంత‌రిక్ష స‌హ‌కారం: ఇస్రో చైర్మ‌న్‌

సామ‌ర్థ్యాల మెరుగుకు అంత‌రిక్ష స‌హ‌కారం: ఇస్రో చైర్మ‌న్‌

న్యూఢిల్లీ: అంత‌రిక్ష పరిశోధ‌న రంగంలో భార‌త్‌ ఘ‌న విజయాలు సాధిస్తున్న‌ద‌ని ఇస్రో చైర్మ‌న్ శివ‌న్ పేర్కొన్నారు. ప్ర‌పంచంలోని 59 దేశాల‌తో అంత‌రిక్ష స‌హ‌కారం కోసం భార‌త్ మొత్తం 250 డాక్యుమెంట్ల‌పై సంత‌కాలు చేసింద‌ని ఆయ‌న తెలిపారు. భార‌త్ త‌న సామ‌ర్థ్యాల‌ను మెరుగుప‌ర్చుకోవ‌డానికి, అంత‌రిక్షం నుంచి ప్ర‌యోజ‌నం పొంద‌గోరే ఇత‌ర‌ దేశాల‌కు స‌హాయం అందించడానికి ఈ ఒప్పందాలు తోడ్ప‌డుతాయ‌ని ఇస్రో శివ‌న్ చెప్పారు. ప్ర‌స్తుత‌, భ‌విష్య‌త్ ప్రాజెక్టుల‌ను విస్త‌రించ‌డానికి అవ‌స‌ర‌మైన అంత‌రిక్ష సాంకేతిక‌త‌లో భార‌త్‌కు ర‌ష్యా, అమెరికా, ఫ్రాన్స్‌, జ‌పాన్, ఇజ్రాయెల్‌ దేశాల‌తో ప్ర‌ధాన స‌హ‌కారం ఉంద‌ని శివ‌న్ వెల్ల‌డించారు.

అంత‌ర్జాతీయ ఆస్ట్రోనాటిక‌ల్ కాంగ్రెస్ (ఐఏసీ)-2020 స‌మావేశంలో ఇస్రో చైర్మ‌న్ శివ‌న్ ప్ర‌సంగించారు. భార‌త్‌కు గ్ర‌హాల అన్వేష‌ణ కోసం మాన‌వస‌హిత‌ అంత‌రిక్ష‌యాత్ర‌ల నిర్వ‌హ‌ణ మొద‌లు, ఉమ్మ‌డి ప్ర‌యోగాల వ‌ర‌కు విదేశీ అంత‌రిక్ష సంస్థ‌ల‌తో సంబంధం ఉన్న‌ద‌ని శివ‌న్ చెప్పారు. భార‌త్‌కు నాసా-ఇస్రో సింథ‌టిక్ అపెర్చ‌ర్ రాడార్ నిస్సార్ శాటిలైట్ ఉన్న‌ద‌ని, ఈ శాటిలైట్ డాటాను పంచుకోవ‌డం కోసం భార‌త్ యునైటెడ్ స్టేట్ జియోల‌జిక‌ల్ స‌ర్వే (యూఎస్‌జీఎస్‌)తో క‌లిసి పనిచేస్తున్న‌ద‌ని ఇస్రో చైర్మ‌న్ వెల్ల‌డించారు.

అంత‌రిక్ష రంగంలో భార‌త్‌కు ఫ్రాన్స్ ప్ర‌ధాన భాగ‌స్వామిగా ఉన్న‌ద‌ని, ఇప్ప‌టికే భార‌త్‌, ఫ్రాన్స్ క‌లిసి మెగా ట్రోపిక్స్‌, స‌ర‌ళ్ అనే రెండు ఉమ్మ‌డి ఉప‌గ్ర‌హాల‌ను ప్ర‌యోగించాయ‌ని ఇస్రో చైర్మ‌న్ శివ‌న్ చెప్పారు. అదేవిధంగా చంద్రుడి ధ్రువాలపై అన్వేష‌ణ కోసం ఇస్రో జ‌పాన్ అంత‌రిక్ష ప‌రిశోధ‌న జాక్సాతో భాగ‌స్వామ్యం ఉన్న‌ద‌ని శివ‌న్ తెలిపారు. రోబోటిక్స్‌, కృత్రిమ మేధపై పరిశోధ‌న కోసం ఇస్రోకు జ‌ర్మ‌న్ స్పేస్ ఏజెన్సీ డీఎల్ఆర్ తో స‌హ‌కార ఒప్పందం ఉన్న‌ద‌ని ఆయ‌న పేర్కొన్నారు.  ‌  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.