మీ వాట్సాప్ అకౌంట్‌ను ఇలా కాపాడుకోండి!

వాట్సాప్ ఇప్పుడు మన జీవితాల్లో విడదీయలేని భాగమైపోయింది. స్మార్ట్ఫోన్లు మన జేబుల్లోకి ఎప్పుడైతే వచ్చాయో.. వాటి వెంటే వాట్సాప్ అకౌంట్ కూడా వచ్చేసింది. ముఖ్యంగా ఇండియన్ యూజర్లు వాట్సాప్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి. వాట్సాప్‌లో ఏం మెసేజ్‌లు వచ్చాయి.. ఎవరు ఏం స్టేటస్లు పెట్టుకున్నారో తరచూ చెక్ చేయడం ఒక అలవాటుగా మారింది. అయితే టెక్నాలజీ వినియోగం పెరిగిన కొద్దీ.. హ్యాకింగ్ భయాలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు వాట్సాప్ అకౌంట్లనూ కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. హ్యాకర్లు కొత్త కొత్త పద్ధతుల్లో యూజర్ల అకౌంట్లను హ్యాక్ చేస్తూ వాటిని యాక్సెస్ చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా హ్యాకర్లు మీ స్నేహితులుగానో, బంధువులుగానో నటిస్తూ తమ వాట్సాప్ అకౌంట్‌కు యాక్సెస్ కోల్పోయామని మెసేజ్‌లు పంపిస్తారు. మీకో వెరిఫికేషన్ కోడ్ పంపించామని, అది చెబితే తమ అకౌంట్‌కు తిరిగి యాక్సెస్ పొందుతామన్నది ఆ మెసేజ్ సారాంశం. ఒకవేళ పొరపాటును మీరు ఆ వెరిఫికేషన్ కోడ్ వాళ్లకు చెబితే.. మీరు మీ అకౌంట్‌ను కోల్పోతారు.
ఇక్కడ హ్యాకర్లు మరో ఎత్తుగడ కూడా వేస్తున్నారు. తాము వాట్సాప్ కంపెనీ ప్రతినిధులమని, మీ అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఓ మెసేజ్ మీకు పంపిస్తారు. మీ అకౌంట్ సురక్షితంగా ఉండాలంటే ఎస్సెమ్మెస్ ద్వారా పంపిన ఓటీపీని షేర్ చేయాల్సిందిగా కోరతారు. ఒకవేళ మీరు ఆ ఓటీపీ షేర్ చేస్తే ఇక అంతే సంగతులు. మీ అకౌంట్ యాక్సెస్ వారి చేతికి వెళ్లిపోతుంది.
అకౌంట్ సురక్షితంగా ఉండాలంటే..
ఒకవేళ మీ అకౌంట్ సురక్షితంగా ఉండాలంటే.. ఇలా వచ్చిన వెరిఫికేషన్ కోడ్‌ను ఎవరికీ చెప్పకండి. వెరిఫికేషన్ కోడ్ అనేది మొదట్లో మీ అకౌంట్ యాక్సెస్ కోసం వాట్సాప్ పంపే కోడ్. అంతే తప్ప మరెవరూ ఇలా వెరిఫికేషన్ కోడ్లు పంపడానికి లేదు. ఒకవేళ అలాంటి కోడ్ ఏదైనా వస్తే దానిని ఎవరితోనూ షేర్ చేయకండి.
ఒకవేళ మీరు కోరకుండానే మీ మొబైల్‌కు వెరిఫికేషన్ కోడ్ వచ్చింది అంటే ఎవరైనా పొరపాటున మీ నంబర్ ద్వారా లాగిన్ అవడానికి ప్రయత్నించి ఉండాలి.. లేదంటే ఎవరైనా మీ అకౌంట్‌ను హ్యాక్ చేస్తుండవచ్చు అని వాట్సాప్ అధికారిక వెబ్సైట్ చెబుతోంది.
మీరు మీ నంబర్‌కు యాక్సెస్ కోల్పోయిన సమయంలో మీ నంబర్‌ను ఎవరు యాక్సెస్ చేస్తున్నారన్న విషయం తమకు కూడా తెలియదని వాట్సాప్ చెబుతోంది. అయితే మీ మెసేజ్‌లన్నీ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ట్ అవడం వల్ల వాటిని అవతలి వ్యక్తి చూసే అవకాశం ఉండదని మాత్రం హామీ ఇస్తోంది. ఒకవేళ మీరు వాటిని గూగుల్ అకౌంట్‌కు బ్యాకప్ చేసుకున్నా.. ఆ అకౌంట్ వివరాలు కూడా హ్యాకర్ చేతిలో ఉంటేనే పాత మెసేజ్‌లను వాళ్లు చూసే అవకాశం ఉంటుంది.
మరి మీ అకౌంట్ కోల్పోతే దానిని తిరిగి ఎలా పొందాలి?
దీనికి వాట్సాప్ చెబుతున్న పరిష్కారం ఏంటంటే.. ఒకసారి వెంటనే మీ అకౌంట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి లాగౌట్ అయిందేమో చూడండి. ఒకవేళ లాగౌట్ అయి ఉంటే.. వెంటనే మరోసారి మొబైల్ నంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవడానికి ప్రయత్నించండి. మీకు 6 అంకెల వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే ఆటోమేటిగ్గా అవతలి వ్యక్తి లాగౌట్ అయిపోతారు. అయితే ఈ లోపు హ్యాకర్ 2 స్టెప్ వెరిఫికేషన్ కోడ్ సెటప్ చేస్తే.. వాట్సాప్ మిమ్మల్ని 7 అంకెల కోడ్ అడుగుతుంది. అది మీకు తెలియకపోతే లాగిన్ కాలేరు. ఈ కోడ్ అవసరం లేకుండా లాగిన్ కావాలంటే ఏడు రోజులు ఆగాల్సిందిగా వాట్సాప్ సందేశం పంపిస్తుంది. ఇవన్నీ ఎందుకూ అనుకుంటే.. మీ అకౌంట్ హ్యాకింగ్‌కు గురి కాకుండా చూసుకోండి. మీ ఫోన్‌కు మీరు రిక్వెస్ట్ చేయకుండా వచ్చే వెరిఫికేషన్ కోడ్స్, ఓటీపీలను ఎవరితోనూ షేర్ చేసుకోకండి.