ముంబై,జూన్ 16:హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ భారత్ మార్కెట్లో విక్రయిస్తున్న కొన్ని మోడళ్లలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ కారణంగా ఆయా వెహికిల్స్ ను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది హోండా. ఈ వెహికిల్స్ లో హోండా సిబి300ఆర్ ,హోండా హైనెస్ సిబి350 మోడళ్లు కూడా ఉన్నాయి. కంపెనీ వీటిని తమ ప్రీమియం డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయిస్తున్నది. అంతేకాదు హోండా హార్నెట్ 2.0, ఎక్స్-బ్లేడ్, సిబి షైన్, యాక్టివా 5జి , 6జి , యాక్టివా 125 తో సహా అనేక ఇతర మోడళ్లను కూడా కంపెనీ రీకాల్ చేసినట్లు వెల్లడించింది హోండా. 2019 నవంబర్ నుంచి 2021 జనవరి మధ్యలో తయారైన వాహనాల్లో ఈ సమస్యను గుర్తించినట్లు కంపెనీ తెలిపింది.
ఆయా సమయంలో తయారైన హోండా టూవీలర్లలో రిఫ్లెక్టర్ల సమస్యను గుర్తించామని, వాటిని ఉచితంగా రీప్లేస్ చేస్తామని కంపెనీ పేర్కొంది. రీకాల్‌కు వర్తించే తమ వాహనాల్లో పెద్ద సమస్యలు ఏవీ తలెత్తవని హోండా స్పష్టం చేసింది.హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తమ వాహనాల రెగ్యులర్ క్వాలిటీ చెక్‌లో భాగంగా ఈ సమస్యను గుర్తించింది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ వాహనాల్లో ప్రధానంగా రిఫ్లెక్స్ రిఫ్లెక్టర్లను అమర్చిన స్థానంలో లోపం ఉన్నట్లు గుర్తించింది. ఈ సమస్య కారణంగా, రాత్రివేళ్లలో రిఫ్లెక్టర్లు తగినంత కాంతితో ప్రకాశించకపోవచ్చు. ఈ రీకాల్‌ను ముందు జాగ్రత్త చర్యగా నిర్వహిస్తున్నామని హోండా తెలిపింది.