ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Science-technology - Jan 23, 2021 , 19:29:12

ఇమ్మిగ్రేషన్‌ రీఫార్మ్స్‌ను స్వాగతించిన గూగుల్‌, ఆపిల్‌

ఇమ్మిగ్రేషన్‌ రీఫార్మ్స్‌ను స్వాగతించిన గూగుల్‌, ఆపిల్‌

వాషింగ్ట‌న్‌: ఇమ్మిగ్రేష‌న్ చ‌ట్టాల‌‌‌కు అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ ప్ర‌తిపాదించిన సంస్క‌ర‌ణ‌ల‌పై టెక్ దిగ్గ‌జాలు గూగుల్‌, ఆపిల్‌తో స‌హా ఆ దేశ ఐటీ రంగం, వ్యాపార సంస్థ‌లు ప్ర‌శంసించాయి. ఇది అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌రిపుష్టికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని, కొత్త ఉద్యోగాల‌ను క‌ల్పించ‌డంతోపాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా మెరిక‌ల్లాంటి ప్ర‌తిభావంతుల‌ను ఆక‌ర్షించ‌డానికి బైడెన్ సంస్క‌ర‌ణ‌లు ఉప‌క‌రిస్తాయ‌ని పేర్కొన్నారు.

అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన తొలిరోజే ఇమ్మగ్రేష‌న్ చ‌ట్టానికి స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ‌లు ప్ర‌తిపాదిస్తూ బిల్లును అమెరికా కాంగ్రెస్‌కు పంపారు. ఇమ్మిగ్రేష‌న్ వ్య‌వ‌స్థ‌లో స‌మూల మార్పుల‌ను ప్ర‌తిపాదించారు. అన‌ధికారికంగా వ‌చ్చి స్థిర ప‌డిన ల‌క్ష‌ల మందికి పౌర‌స‌త్వ హోదా క‌ల్పించ‌డంతోపాటు కుటుంబ స‌భ్యుల‌కు గ్రీన్ కార్డు వ‌స‌తి క‌ల్ప‌న టైం త‌గ్గింపు త‌దిత‌ర చ‌ర్య‌లు ఇందులో ఉన్నాయి. ఇమ్మిగ్రేష‌న్ వ్య‌వ‌స్థ‌ను ఆధునీక‌రించ‌డంతోపాటు ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల జారీ ప్ర‌క్రియ‌పై ప‌రిమితులు ఎత్తివేయాల‌ని ప్ర‌తిపాదించిన బిల్లు.. చ‌ట్టంగా మారితే, చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన శాశ్వ‌త నివాసం కోసం కొన్ని ద‌శాబ్దాలుగా వేచి చూస్తున్న ల‌క్ష‌ల మంది భార‌త ఐటీ నిపుణుల‌కు ల‌బ్ధి చేకూర‌నున్న‌ది. 

బైడెన్ ప్ర‌తిపాదిత ఇమ్మిగ్రేష‌న్ సంస్క‌ర‌ణ‌ల‌ను  సీఈవో టిమ్ కుక్ స్వాగ‌తించారు. స‌మ‌గ్ర ఇమ్మిగ్రేష‌న్ సంస్క‌ర‌ణ‌ల‌ను తేవ‌డానికి బైడెన్ ప్ర‌ద‌ర్శించిన నిబ‌ద్ధ‌త.. న్యాయం, గౌర‌వం, ధ‌ర్మంతో కూడిన‌ అమెరికా విలువ‌ల‌కు ప్ర‌తిబింబంగా ఉంద‌ని ఆపిల్ సీఈవో టిమ్ కుక్ పేర్కొన్నారు. బైడెన్ ప్ర‌య‌త్నం అమెరికా స‌మాజం బ‌లోపేతానికి, ఈ దేశంలో అవ‌కాశాల క‌ల్ప‌న‌కు మార్గం సుగ‌మం చేయ‌డంతోపాటు సుదీర్ఘ‌కాలం వృద్ధిని ప్రోత్స‌హిస్తుంద‌ని బుధ‌వారం పొద్దుపోయిన త‌ర్వాత ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. 

కొవిడ్‌-19 రిలీఫ్‌, పారిస్ ఒప్పందంలో చేరిక‌, ఇమ్మిగ్రేష‌న్ సంస్క‌ర‌ణ‌ల దిశ‌గా అధ్య‌క్షుడు బైడెన్ త్వ‌రిత‌గ‌తిన తీసుకున్న నిర్ణ‌యాలు అభినంద‌నీయం అని గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్ ట్వీట్ చేశారు. ఈ ముఖ్య‌మైన నిర్ణ‌యాల‌కు గూగుల్ మ‌ద్ద‌తుగా ఉంటుంద‌ని పేర్కొన్నారు. క‌రోనా నుంచి దేశం కోలుకోవ‌డానికి, అమెరికా ఎకాన‌మీ తిరిగి ప‌రిపుష్టి సాధించ‌డానికి నూత‌న ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని భావిస్తున్నామ‌ని సుంద‌ర్ పిచాయ్ ట్వీట్ చేశారు. 

ఆపిల్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్ వంటి ఐటీ దిగ్గ‌జాల్లో భార‌త్‌, చైనా నుంచి భారీ సంఖ్య‌లో ఐటీ నిపుణులు అమెరికాలో ప‌ని చేస్తున్నారు.  ఇంత‌కుముందు మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. త‌న హ‌యాంలో ప్ర‌తిభ ఆధారిత వీసాల జారీతోపాటు గ్రీన్ కార్డులు, ఈ-4 త‌దిత‌ర వీసాల జారీపై ఆంక్ష‌లు అమ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo