మంగళవారం 04 ఆగస్టు 2020
Science-technology - Jul 09, 2020 , 16:53:51

పేగుల్లోని ఆ బ్యాక్టీరియాతో గుండెకు మేలు!

పేగుల్లోని ఆ బ్యాక్టీరియాతో గుండెకు మేలు!

న్యూయార్క్‌: మన శరీరంలో హానికారక బ్యాక్టీరియాలతోపాటు మంచి బ్యాక్టీరియాలు కూడా ఉంటాయని మనకు తెలుసు. అయితే, పేగుల్లో ఉండే ఓ బ్యాక్టీరియా గుండె జబ్బుల రిస్క్‌ను తగ్గిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాంటి ఉత్తమ లక్షణాలున్న సూక్ష్మజీవిని కొలంబస్, ఒహియో స్టేట్‌ యూనివర్సిటీ సైంటిస్టులు తాజాగా కనుగొన్నారు. యూబాక్టీరియం లిమోసమ్‌ అని పిలిచే ఈ బ్యాక్టీరియా కార్యకలాపాల వల్ల ధమనుల పనితీరును దెబ్బతీసే రసాయనం ఉత్పత్తి తగ్గిపోతున్నట్లు తేల్చారు. పేగుల్లో తయారయ్యే రసాయనం రక్తప్రవాహంలో కలిసిపోయి లివర్‌కు చేరుతుందని, అక్కడినుంచి మరింత హానికరంగా తయారవుతుందని సైంటిస్టులు చెప్పారు. అలాంటి రసాయనం ఉత్పత్తి కాకుండా ఈ గట్‌ బ్యాక్టీరియా నిరోధించగలుగుతుందని తేల్చారు. 

పరిశోధకులు మానవ ఆరోగ్యానికి ఉపయోగపడే  బ్యాక్టీరియాలపై పరిశోధన సాగించారు. పేగుల్లోని పోషకాలను పొందేందుకు చెడు బ్యాక్టీరియాలతో ఈ మంచి బ్యాక్టీరియా పోటీపడుతుందని,  మంచి బ్యాక్టీరియా గెలిస్తే, జీవక్రియ సాఫీగా జరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తవని తేల్చారు. అలాగే, డిమిథలైషన్‌ ప్రక్రియ ద్వారా ఇది ధమనుల్లో అడ్డుపడే గుణమున్న ట్రిమెథైలామైన్‌ అనే రసాయనం విషప్రభావాన్ని తగ్గిస్తున్నట్లు వారు గుర్తించారు. ఈ బ్యాక్టీరియాను భవిష్యత్తులో చికిత్సా ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయితే, ఈ బ్యాక్టీరియా చికిత్సకు ఉపయోగపడుతుందో లేదో ఇప్పుడే చెప్పలేం. కానీ, దానిపై పరిశోధన సాగిస్తాం.’ అని జోసెఫ్‌ క్రుజికి అనే శాస్త్రవేత్త తెలిపాడు.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo