ఆరేండ్ల కిందట ఆవిర్భవించిన తెలంగాణ ఒక రాష్ట్రంగా పరిపూర్ణతను సంతరించుకుంటున్నది. గతకాలపు పాలన విధానాల చిక్కుముడులు, బంధనాలను పటాపంచలు చేస్తూ ముందుకుపో తున్నది. వలస పాలన అవశేషాలను వదలించుకుంటున్నది. ఉద్యోగ నియామకాలకు అవరోధంగా ఉన్న పాతజోన్ల వ్యవస్థ స్థానంలో సరికొత్త ఏడు జోన్ల విధానానికి రాష్ట్రపతి ఆమోద ముద్రవేశారు. దీంతో ఎంతోకాలంగా యువత ఎదురుచూస్తున్న జోనల్ వ్యవస్థ ఉనికి వచ్చింది. స్థానిక యువతకు ఎక్కువ అవకాశాలు దక్కటం కోసం జోనల్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అలుపెరుగని పోరాటం జోన్లపై గెజిట్‌తో సఫలమైంది.
1956లో మన ఇష్టానికి, మన ప్రయోజనాలకు విరుద్ధంగా తెలంగాణను ఆంధ్రతో విలీనం చేసిన తర్వాత ఏ రంగంలో చూసి నా మనదిగాని బతుకైంది. ఒకప్పుడు స్థానికులకు ఉద్యోగాలు లభించేవిధంగా ముల్కీ నిబంధనలుండేవి. వాటిని సుప్రీంకోర్టు కూడా ధ్రువపరిచింది. అయినా ప్రజాస్వామిక విలువలను తుం గలో తొక్కుతూ, పార్లమెంట్ సాక్షిగా ముల్కీ నిబంధనలను పరాయి పాలకులు నిర్వీర్యం చేశారు. ఆ తర్వాత తెచ్చిన జోన్ల వ్యవస్థను కూడా సరిగ్గా అమలుచేయకుండా అపహాస్యం చేశారు. నీటి పారుదల, నిధుల పంపిణీ మొదలుకొని అన్నిరంగాల్లో పరాయి ప్రయోజనాలే ప్రాధాన్యం పొందాయి. సంస్కృతీ సంప్రదాయాలలోనూ అవమానాలపాలై తెలంగాణ జాతి అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడిన కాలమది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మళ్లీ ఒక సమాజంగా కుదుటపడుతున్నాం, ఒక రాష్ట్రంగా స్థిరపడుతున్నాం.
సొంత రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సమాజం అన్ని రం గాల్లో అస్తిత్వాన్ని చాటుకుంటూ, తనదైనరీతిలో వృద్ధి చెందుతున్నది. సొంతంగా రాష్ట్ర చిహ్నాలను ఏర్పాటుచేసుకున్నాం. బతుకమ్మను రాష్ట్రపండుగగా ఘనంగా జరుపుకొంటున్నాం. మన జాతరలను గర్వదాయకమైన రీతిలో నిర్వహించుకుంటున్నాం. సాహిత్య, సంస్కృతీ రంగాలలో మనదైన ముద్ర కనబడుతున్నది. మన నిధులు మన కోసమే వెచ్చించడం సాధ్యమవుతున్నది. భిన్న సామాజిక వర్గాల ఆర్థికస్థితిగతులను అధ్యయనం చేసి వారి అభివృద్ధికి అనుగుణమైన పథకాలను అమలుచేసుకోగలుగుతున్నాం. నీటి పారుదల వ్యవస్థను మన భౌగోళిక స్వరూపానికి, స్వభావానికి, ప్రజల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకున్నాం. కాళేశ్వరం వంటి బృహత్ పథకం ద్వారా మన సత్తాను ప్రపంచానికి చాటుకున్నాం. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా ప్రభుత్వం మరింతగా ప్రజలకు దగ్గరైంది. ఆయా జిల్లాలను మనకు అనుగుణమైన రీతిలో జోన్లుగా విభజించుకోవడం స్వీయ పాలనకు మరింత నిండుదనాన్ని ఇస్తున్నది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ప్రస్థానంలో కొత్త జోన్లు పెద్ద ముందడుగు!