మంగళవారం 26 మే 2020
Science-technology - May 23, 2020 , 19:11:01

మానవులపై ప్రయోగించిన తొలి కరోనా టీకా.. ఆశాజనక ఫలితాలు

మానవులపై ప్రయోగించిన తొలి కరోనా టీకా.. ఆశాజనక ఫలితాలు

న్యూఢిల్లీ: మానవులపై తొలి దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు చేరిన మొదటి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఆశాజనక ఫలితాలిచ్చిందని ప్రముఖ మెడికల్‌ జర్నల్‌ ది ల్యాన్సెట్‌ ప్రచురితమైన అధ్యయనం పేర్కొన్నది. ఈ వ్యాక్సిన్‌ మనుషుల్లో వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోగలిగే తటస్థ ప్రతిరక్షకాలను విడుదల చేసినట్లు ఆ అధ్యయనంలో వెల్లడించారు. అలాగే వైరస్‌ను అడ్డుకోవడంలో కీలకపాత్ర పోషించే రోగనిరోధక వ్యవస్థలోని టీ-సెల్స్‌ సమర్థంగా ప్రతిస్పందించాయని చెప్పారు. తొలిదశలో 108 మందిపై టీకాను ప్రయోగించినట్లు తెలిపారు. టీకా ఇచ్చిన 28 రోజుల తర్వాత వారిలో ఆశాజనక ఫలితాలను గమనించినట్లు చెప్పారు. 

అయితే, ఈ టీకా మనుషులన వైరస్ నుంచి ఏ మేరకు రక్షించగులుగుతుందో నిర్ధారించడానికి ముందు మరింత లోతైన పరిశోధన జరుగాల్సిన అవసరం ఉందని బీజింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అయితే ఈ వ్యాక్సిన్‌వల్ల రోగనిరోధక వ్యవస్థలో వచ్చిన ప్రతిస్పందనలు కచ్చితంగా మనుషులను కొవిడ్‌-19 బారి నుంచి బయటపడేస్తాయని చెప్పలేమని వారు పేర్కొన్నారు. 

ఈ వ్యాక్సిన్‌ను 18 నుంచి 60 ఏండ్ల మధ్య ఉన్న 108 మందిపై ప్రయోగించారు. వివిధ మోతాదుల్లో వారికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. అనంతరం తరచూ వారి రక్త నమూనాలను పరిశీలించారు. వైరస్‌ను అడ్డుకోవడంలో కీలకపాత్ర పోషించే ప్రతిరక్షకాలు, టీ-సెల్స్‌ ప్రతిస్పందన ఎలా ఉందో గమనించారు. అయితే టీకాను తీసుకున్న వారిలో పెద్దగా దుష్స్రభావాలు ఏమీ కనిపించలేదని పరిశోధకులు తెలిపారు. 



logo