ఫేస్బుక్ నుంచి ఆటోమేటిగ్గా లాగౌట్.. ఎందుకు?

వాషింగ్టన్: ఫేస్బుక్ నుంచి తాము ఆటోమేటిగ్గా లాగౌట్ అయినట్లు గత శుక్రవారం చాలా మంది యూజర్లు ఫిర్యాదు చేశారు. దీనిపై ఫేస్బుక్ స్పందించింది. కాన్ఫిగరేషన్ మార్పు వల్ల అలా జరిగిందని, శనివారం ఉదయం దీనిని ఫిక్స్ చేసినట్లు వెల్లడించింది. ఈ నెల 22న ఈ ఘటన జరిగిందని, దీనిని గుర్తించిన వెంటనే సమస్యను పరిష్కరించినట్లు ఫేస్బుక్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. తాము లాగౌట్ చేయకపోయినా... మళ్లీ సైన్ ఇన్ చేయాలని ఫేస్బుక్ యాప్ అడుగుతున్నట్లు శుక్రవారం పలువురు యూజర్లు ఫిర్యాదు చేశారు. ఈ వార్తను ఫేస్బుక్ కూడా తన అధికారిక ట్విటర్ హ్యాండిల్లో ధృవీకరించింది. ఈ లాగౌట్ సమస్యను ఐఫోన్ యూజర్లు ఎక్కువగా ఎదుర్కొన్నారు. వాళ్లు తర్వాత మళ్లీ లాగిన్ అయినా కూడా... ఈ సమస్య వల్ల అథెంటికేషన్ కోడ్స్ చాలా ఆలస్యంగా యూజర్లకు చేరాయి.