న్యూఢిల్లీ: ఇండియాలో ఫేస్బుక్ కొత్త టూల్‌ను తీసుకొస్తోంది. వ్యాక్సిన్ ఫైండర్ టూల్‌ను లాంచ్ చేస్తున్నట్లు ఆ సంస్థ శుక్రవారం ప్రకటించింది. మొబైల్ యాప్‌లో ఈ టూల్ అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. ఈ టూల్‌ను భారత ప్రభుత్వ భాగస్వామ్యంతో రూపొందించామని, మొత్తం దేశంలోని 17 స్థానిక భాషల్లో అందుబాటులో ఉంటుందని చెప్పింది.
వ్యాక్సిన్ తీసుకోవాలని అనుకునే వాళ్లు తమ దగ్గరలోని వ్యాక్సిన్ సెంటర్లను ఈ టూల్ ఉపయోగించి కనుక్కోవచ్చు. కేంద్ర ఆరోగ్య శాఖ అందించిన వివరాల ఆధారంగా వ్యాక్సినేషన్ సెంటర్ల లొకేషన్లు, అవి పని చేసే వేళలను ఈ ఫేస్బుక్ టూల్ వెతికి పెడుతుంది. ఇదే టూల్లో కొవిన్ పోర్టల్ లింకు కూడా ఉంటుంది. దీని ద్వారా నేరుగా పోర్టల్‌లోకి వెళ్లి వ్యాక్సినేషన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు.
ఈ టూల్ ఫేస్‌బుక్‌లోని కొవిడ్-19 ఇన్ఫర్మేషన్ సెంటర్లో అందుబాటులో ఉంటుంది. కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ సాధ్యమైనంత ఎక్కువ మంది భారతీయుల దగ్గరికి తీసుకెళ్లడానికి తాము ఎన్జీవోలు, ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలకు మద్దతిస్తున్నట్లు ఫేస్బుక్ చెప్పింది. ఇంట్లోనే కొవిడ్ సంరక్షణ చర్యలు ఎలా తీసుకోవాలి? ఎప్పుడు ఎమర్జెన్సీ కేర్‌కు వెళ్లాలన్న అంశాలపై తాము యూజర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపింది.