శుక్రవారం 07 ఆగస్టు 2020
Science-technology - Jul 05, 2020 , 18:14:08

అనుకరణల్లేని ఆవిష్కరణలకు ప్రోత్సాహం : వెంకయ్య

అనుకరణల్లేని ఆవిష్కరణలకు ప్రోత్సాహం : వెంకయ్య

న్యూఢిల్లీ : భారతదేశ యువతలో, మన ఐటీ నిపుణుల్లో నిబిడీకృతమై ఉన్న సృజనాత్మకతను మరింత ప్రోత్సహించేందుకు అవసరమైన వాతావరణాన్ని నిర్మించుకోవాలని.. తద్వారా ‘ఆత్మనిర్భర భారత్’ లక్ష్యాలను చేరుకునేందుకు మార్గం సుగమం అవుతుందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రపంచ సమాచార సాంకేతిక రంగంలోని బలమైన శక్తుల్లో ఒకటిగా ఉన్న భారత దేశంలో సాంకేతిక నిపుణులకు కొదువలేదని.. వీరిని ప్రోత్సహిస్తూ మరిన్ని వినూత్న ఆవిష్కరణలు జరిగేందుకు సాంకేతిక రంగంలోని భాగస్వామ్య పక్షాలన్నీ ముందుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.

 ఆదివారం ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సభాప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో స్వదేశీ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎలిమెంట్స్’ యాప్‌ను ఆయన ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘మనం ఇతరులను అనుకరించడాన్ని పక్కనపెట్టి కొత్త ఆవిష్కరణలపై దృష్టిపెట్టాలి. 21వ శతాబ్దంలో సృజనాత్మకతే విజయాలు అందుతాయి’ అని పేర్కొన్నారు.  ప్రతి భారతీయుడు స్థానికంగా తయారయ్యే వస్తువులు, లభించే సేవలను.. అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో కృషిచేయాలని సూచించారు. 

భారత సమాచార సాంకేతిక సామర్థ్యాన్ని మరింత ప్రోత్సహించే లక్ష్యంతో శనివారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ‘ఆత్మనిర్భర భారత్ యాప్ ఇన్నొవేషన్ చాలెంజ్’ను ప్రశంసించిన ఉపరాష్ట్రపతి.. ప్రస్తుత పరిస్థితుల్లో భారత యువ ఐటీ నిపుణులు.. మానవ జీవన ప్రమాణాలను పెంచేందుకు అవసరమైన యాప్‌లను రూపొందించేందుకు ప్రధాని ప్రకటన ప్రేరణగా నిలుస్తుందన్నారు. 

స్వదేశీ రూపకల్పిత ‘ఎలిమెంట్స్’ యాప్‌ ఎనిమిది భారతీయ భాషల్లో అందుబాటులోకి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మరిన్ని భారతీయ భాషల్లో కూడా అందుబాటులోకి రావాలని అభిలషించారు. గురుపౌర్ణమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకుడు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్, ప్రముఖ యోగాగురు బాబా రాందేవ్, సుమేరు సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటడ్ చైర్మన్ ఏఎల్ రావ్, రామోజీ సంస్థల అధినేత రామోజీరావు, వ్యాపారవేత్త గ్రంథి మల్లికార్జునరావు, పారిశ్రామికవేత్త అనంత్ గోయెంకా, విద్యావేత్త టీవీ మోహన్‌దాస్ పాయ్ తోపాటు పలువురు ప్రముఖులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.


logo