శుక్రవారం 23 అక్టోబర్ 2020
Science-technology - Sep 17, 2020 , 18:39:43

భవిష్యత్తులో సీజనల్‌ వైరస్‌గా కరోనా..!

భవిష్యత్తులో సీజనల్‌ వైరస్‌గా కరోనా..!

వాషింగ్టన్‌: కొద్ది నెలలుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ గురించి ఎవరికీ అంతుచిక్కడం లేదు. ప్రపంచవ్యాప్తంగా దీనిపై పరిశోధకులు అధ్యయనాలు చేస్తూనే ఉన్నారు. కొవిడ్‌ టీకా కోసం ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. కొందరు నిపుణులైతే మనం కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని కూడా చెప్పారు. ఇప్పుడు వీరి మాటలే నిజమని చెబుతోంది ఓ అధ్యయనం. హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించిన తర్వాత కరోనా వైరస్‌ అనేది సీజనల్‌గా వస్తుందని లెబనాన్‌లోని అమెరికన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ బీరుట్‌ పరిశోధకులు తేల్చారు. వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారిలో ఇది కనిపించదని నిర్ధారించారు. ఈ అధ్యయన ఫలితాలు ఫ్రాంటియర్స్‌ ఇన్‌ పబ్లిక్‌ హెల్త్‌ పత్రికలో ప్రచురితమయ్యాయి. 

ఇతర వైరస్‌ల వ్యాప్తితో పోల్చి.. 

పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు కాలానుగుణ వైరస్లను క్షుణ్నంగా పరిశీలించారు. అలాగే, వాటితో పోల్చి సార్స్‌ సీఓవీ-2 తీవ్రతను అంచానా వేశారు. గాలి, ఉపరితలాలపై వైరస్‌ మనుగడ సాగించగలదని మరోసారి తేల్చారు. ఇండోర్‌లలో ఎక్కువ వ్యాప్తి కలిగి ఉంటుందని నిర్ధారించారు. హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించేదాకా ప్రతి సీజన్‌లోనూ ఇది వ్యాప్తి చెందుతుందని తేల్చారు. దీని వ్యాప్తి అనేది వాతావరణం, ఉష్ణోగ్రత, గాలిలో తేమశాతంపై ఆధారపడి ఉంటుందని నిర్ధారించారు. ఇన్‌ఫ్లుయెంజా, ఫ్లూ వైరస్‌లతో పోలిస్తే కొవిడ్‌-19 ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశముందని గుర్తించారు. వాటిలాగా, కరోనా వ్యాప్తికి కాలంతో సంబంధం లేదని తేల్చారు. అయితే, టీకాల ద్వారా హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చాక కొవిడ్‌ వ్యాప్తి గణనీయంగా పడిపోతుందని గుర్తించారు. అప్పుడు అది కాలనుగుణంగా (సీజనల్‌) మారుతుందని కనుగొన్నారు.  

హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చేదాకా వేగంగా వ్యాప్తి..

హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించేవరకు కరోనా వ్యాప్తి ఏడాది పొడవునా ఉంటుందని అమెరికన్‌ వర్సిటీ పరిశోధకులు తేల్చారు. ఆ లోగా వైరస్‌ మ్యుటేషన్‌ చెందినా ఆశ్చర్యపోనక్కర్లేదని వారు పేర్కొన్నారు. అయితే, వ్యాధి నిరోధక శక్తి ఉన్నవారినుంచి ఇతరులకు కరోనా వైరస్‌ వ్యాపించడంలేదని కూడా తేల్చారు. అంటే కరోనా పాజిటివ్‌ వ్యక్తికి ఇమ్యూనిటీ పవర్‌ ఉంటే అతడితో కలిసి ఉన్నవారికి వైరస్‌ సంక్రమణ జరుగడం లేదని గుర్తించారు. ఏదిఏమైనా ప్రజలంతా కరోనా వైరస్‌తో జీవించడం నేర్చుకోవాలని తమ అధ్యయనం సూచిస్తున్నట్లు అధ్యయనకర్త హసన్‌ జరాకెట్ పేర్కొన్నారు. టీకా వచ్చేంతవరకూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాల్సిందేనని చెప్పారు. అవసరముంటే ఇంటినుంచి బయటకి వెళ్లాలని, చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేసుకోవాలని, ఒకేచోట గుమికూడవద్దని తెలిపారు.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo