శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Science-technology - Aug 09, 2020 , 19:53:14

నివురుగప్పిన నిప్పులా కరోనా..లక్షణాలు లేనివారిలో కూడా పెద్ద మొత్తంలో వైరస్‌..!

నివురుగప్పిన నిప్పులా కరోనా..లక్షణాలు లేనివారిలో కూడా పెద్ద మొత్తంలో వైరస్‌..!

సియోల్‌: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొవిడ్‌-19 గురించి రోజుకో దుర్వార్త తెలుస్తోంది. టీకా వచ్చేలోపు ఎంతమంది ఈ మహమ్మారికి బలవుతారో తెలియక ఆందోళన నెలకొంది. అయితే, తాజాగా, దీని గురించి మరో చేదునిజం తెలిసింది. కరోనా నివురుగప్పిన నిప్పులా వ్యాపిస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. ఎలాంటి వ్యాధి లక్షణాలులేని కరోనా పాజిటివ్‌ వ్యక్తులు ఆరోగ్యంగా కనిపించినప్పటికీ ఇతరులకు వైరస్‌ను వ్యాప్తి చేయగలరని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు తేల్చారు.  

అలాగే, కొందరికి వ్యాధి బాగా ముదిరాక రెండు రోజుల ముందు మాత్రమే లక్షణాలు కనిపిస్తున్నాయని గుర్తించారు. దీన్నే ప్రీసింప్టామెటిక్‌ ఫేస్‌ అంటారని, వారు కూడా ఎలాంటి లక్షణాలు లేకున్నా సింప్టమ్స్‌ ఉన్నవారితో సమానస్థాయిలో వైరస్‌ను కలిగి ఉంటారని నిర్ధారించారు. 

అదేస్థాయిలో వైరల్‌ లోడ్‌..

దక్షిణ కొరియాలోని బుచెయోన్‌ సూన్‌చున్‌హ్యాంగ్ విశ్వవిద్యాలయ దవాఖానకు చెందిన డాక్టర్ యున్‌జంగ్ లీ నేతృత్వంలోని బృందం మార్చి 6-26 మధ్యకాలంలో సార్స్‌ సీఓవీ-2 బారిన పడిన 303 మంది లక్షణాలున్న, లేని రోగులపై అధ్యయనం చేసింది. అయితే, ఇందులో సింప్టమ్స్‌ ఉన్నవారిలో ఎంత వైరస్‌ లోడ్‌ ఉందో లేనివారిలో కూడా అదేస్థాయిలో ఉన్నట్లు వారు నిర్ధారించారు. అధ్యయనం చేసిన 303 మందిలో 110 (36.3%) మంది అసింప్టామెటిక్‌ రోగులు. ఇందులో 21 మందికి మాత్రమే తర్వాత లక్షణాలు బయటపడ్డాయని గుర్తించారు. అంటే  కరోనావైరస్ సంక్రమణతో బాధపడుతున్న చాలా మంది సుదీర్ఘకాలం ఎలాంటి లక్షణాలు లేకుండా ఉండగలరని తేల్చారు. 29% మంది రోగులకు అసలు లక్షణాలే బయటపడలేదని కనుగొన్నారు. 

ఇదిలా ఉండగా, ఎలాంటి లక్షణాలు లేని కరోనా రోగులు దాదాపు 20-45% ఉంటారని  నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అలెర్జీ అడ్‌ ఇన్ఫెక్సియస్‌ డిసీజెస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆంథోనీ ఫౌసీ పేర్కొన్నారు. అలాగే,  దాదాపు 40-45% ఉంటారని అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌ ఓ సమీక్షలో పేర్కొంది. వీరు వైరస్‌ ఇంక్యుబేషన్‌ పీరియడ్‌తో సంబంధం లేకుండా 14 రోజుల తర్వాత కూడా వైరస్‌ను వ్యాప్తిం చెందించగలరని తెలిపింది. 

ఎలాంటి లక్షణాలు లేకుండా అధిక వైరల్ భారాన్ని మోసే వ్యక్తులు ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశాన్ని పెంచుతుండగా, దక్షిణ కొరియా అధ్యయనం దీనిని నిర్ణయించలేదు. ఎందుకంటే ఇది సింప్టామెటిక్‌, అసింప్టామెటిక్‌ లక్షణాల గురించి తెలుసుకునేందుకు మాత్రమే అధ్యయనం చేపట్టారు. అంటే ఇందులో వారిద్దరినీ వేరు చేశారు. దీంతో వైరస్‌ ప్రసారాన్ని గుర్తించేందుకు అవకాశం లేదు. అలాగే, వైరస్ వ్యాప్తి స్వభావాన్ని నిర్ధారించడానికి ల్యాబ్‌లలో లైవ్ వైరస్ కల్చర్ చేయబడలేదు.  అందువల్ల, వైరల్ ఆర్‌ఎన్‌ఏను గుర్తించడం అంటే వైరస్ ఉన్నట్లు, వ్యాప్తి చెందేందుకు అవకాశమున్నట్లు కాదని వారు గమనించారు.  అనేక అధ్యయనాలు కూడా పెద్ద శాతం అసింప్టామాటిక్‌ కేసులను కనుగొన్నప్పటికీ, ఇటువంటి అధ్యయనాలు పరిమితిని కలిగి ఉన్నాయి. ప్రస్తుత అధ్యయనంలా కాకుండా గత అధ్యయనాలు  ప్రిసింప్టామెటిక్‌ రోగులను అసింప్టామెటిక్‌ కేసుల క్లినికల్ కోర్సును గమనించకుండా లక్షణరహితంగా భావించారు. అలాంటివారు స్వేచ్ఛగా ప్రయాణించడం, ఇతరులతో కలవడం వల్ల వారికి వైరస్ వ్యాప్తి చెందుతున్నది.  లక్షణాలు ఉన్నవారు మాత్రం ఇంట్లోనే ఉంటున్నారు.  

అందరినీ ఐసోలేషన్‌ చేయాల్సిందే..

దక్షిణ కొరియా శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం కరోనా పాజిటివ్‌గా తేలి లక్షణాలున్నా.. లేకున్నా అందరినీ ఐసోలేషన్‌ చేయాలి. కచ్చితంగా అందరూ మాస్కులు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించాలని ఈ అధ్యయనం నొక్కి చెబుతోంది. యూనివర్సల్‌ మాస్కింగ్‌ అనేది వైరస్‌ను పీల్చుకునే మొత్తాన్ని తగ్గిస్తుందని ఈ స్టడీ చెబుతోంది. ఈ అధ్యయనం ఫలితాలు జామా ఇంటర్నల్ మెడిసిన్ పత్రికలో ప్రచురితమయ్యాయి. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo