ముక్కు ద్వారా మెదడులోకి కరోనా వైరస్!

నావెల్ కరోనా వైరస్ ముక్కు ద్వారా మెదడులోకి వెళ్లవచ్చని సోమవారం ప్రచురితమైన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఇప్పటి వరకు కొవిడ్-19 పేషెంట్లలో కనిపించిన కొన్ని న్యూరోలాజికల్ లక్షణాలు, చికిత్స, ఇన్ఫెక్షన్ బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ అధ్యయనం వివరించింది. ఈ రీసెర్చ్‌ను నేచర్ న్యూరోసైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. కరోనా వైరస్ కేవలం శ్వాసకోశ వ్యవస్థపైనే కాకుండా కేంద్ర నాఢీ వ్యవస్థపైనా ప్రభావం చూపుతున్నట్లు తేలింది. దీని ఫలితంగానే రుచి, వాసన కోల్పోవడం, తలనొప్పి, అలసట, కడుపులో తిప్పడంలాంటి లక్షణాలు కనిపిస్తున్నట్లు ఈ అధ్యయనం తేల్చింది.
ఈ మధ్య వచ్చిన ఓ అధ్యయనం కూడా మెదడు, సెరెబ్రోస్పైనల్ ఫ్లుయిడ్లో వైరల్ ఆర్ఎన్ఏ ఉన్నట్లు తేల్చినా.. అది మెదడుకు ఎలా చేరింది, ఎలా వ్యాపించింది అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. ఈ తాజా అధ్యయనంలో భాగంగా జర్మనీలోని బెర్లిన్‌లో ఉన్న చారైట్-యూనివర్సిటాట్స్మెడిజిన్ పరిశోధకులు రెండు అంశాలను పరీక్షించారు. కొవిడ్ కారణంగా మరణించిన 33 మంది బాధితులలో నాసోఫారింక్స్ పిలిచే గొంతు పైభాగం, మెదడును పరీక్షించారు. మరణించిన వారి సగటు వయసు 71.6 సంవత్సరాలుగా, కొవిడ్ లక్షణాలు కనిపించిన తర్వాత మరణానికి సగటున 31 రోజులు పట్టినట్లు ఈ అధ్యయనం తేల్చింది. తాము వైరస్‌కు సంబంధించిన ఆర్ఎన్ఏ, ప్రొటీన్‌ను మెదడుతోపాటు నాసోఫారింక్స్‌లో గుర్తించినట్లు అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు వెల్లడించారు.