మీరు ఏ బ్రౌజర్ వాడుతున్నారని ఎవరైనా అడిగితే చాలామంది చెప్పే సమాధానం గూగుల్ క్రోమ్. ఎవరో కొంతమంది మాత్రం మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ లేదా ఫైర్ఫాక్స్ వాడుతున్నామని చెబుతారు. మరి కంప్యూటర్/ లాప్టాప్ కోసం ఇవి కాకుండా వేరే బ్రౌజర్లు లేవా? అంటే చాలానే ఉన్నాయి. కానీ ఫీచర్లు ఎక్కువగా ఉండి.. వెబ్సైట్ పేజీలు స్పీడ్‌గా ఓపెన్ కావడంతో చాలామంది వీటికే పరిమితమయ్యారు. అయితే ఈ బ్రౌజర్లకు సమానమైన ఫీచర్లతో పాటు సెక్యూరిటీని అందించే బ్రౌజర్లు కొన్ని ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం..
ఒపెరా బ్రౌజర్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇందులో వే లెస్ (WAY LESS) కెపాసిటీని ఉపయోగించారు. దీనివల్ల గూగుల్ క్రోమ్, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ (ఎడ్జ్ ) బ్రౌజర్ల కంటే వేగంగా వెబ్‌పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో యాడ్ బ్లాకర్, వీపీఎన్ సదుపాయం కూడా ఉంది. ఈ బ్రౌజర్ పూర్తిగా సేఫ్ అనే చెప్పొచ్చు. ఇందులో వాట్సాప్, ఫేస్బుక్ మెసేంజర్‌ను సైడ్బార్కు జోడించారు. కాబట్టి వీటికోసం ప్రత్యేకంగా వేరే ట్యాబ్ ఓపెన్ చేసుకోవాల్సిన పనిలేదు.
ఒపెరా బ్రౌజర్‌ను రూపొందించిన డెవలపర్స్నే వివాల్డీని రూపొందించారు. ఇందులో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ట్ సౌకర్యం ఉంది. కాబట్టి సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. ఒపెరా, క్రోమ్‌తో పోలిస్తే ఇందులో ఫీచర్లు తక్కువగానే ఉంటాయి. కానీ ఈ బ్రౌజర్ స్పీడ్ మిగిలిన బ్రౌజర్లు అన్నింటికంటే ఎక్కువగానే ఉంటుంది. అంతేకాకుండా ఇందుల్లో కస్టమైజేబుల్ ఆప్షన్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ బ్రౌజర్ కూడా క్రోమియం ఆధారంగానే పనిచేస్తుంది కాబట్టి క్రోమ్ బ్రౌజర్ నుంచి డేటాను ఇందులోకి సింక్ చేసుకోవచ్చు.
ప్రైవసీపరంగా ఆలోచించే వారికి బెస్ట్ ఆప్షన్ టార్. సాధారణంగా మనం ఎలాంటి వెబ్సైట్లు ఓపెన్ చేస్తున్నాం.. మనం ఎలాంటి వాటి గురించి ఎక్కువగా వెతుకుతున్నామని ప్రభుత్వాలతో అడ్వర్టైస్మెంట్ కంపెనీలు మన డేటాపై నిఘా పెడుతుంటాయి. కానీ టార్ బ్రౌజర్ వాడినప్పుడు అలాంటి నిఘాల నుంచి తప్పించుకోవచ్చు. ఎందుకంటే బ్రౌజర్ ఉపయోగించడం అయిపోగానే ఇందులోని కుకీస్, హిస్టరీ ఆటోమేటిగ్గా క్లియర్ అయిపోతుంది. కాబట్టి సైబర్ వలలో పడకుండా జాగ్రత్త పడవచ్చు.
యాపిల్ డివైజ్‌లు వాడేవారికి దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యాపిల్ ఫోన్లు, కంప్యూటర్లలో సఫారీ బ్రౌజర్ డిఫాల్ట్‌గా వస్తుంది. ఇందులో ప్రైవసీ అధికంగానే ఉంటుంది. క్రోమ్ కంటే కూడా ఈ బ్రౌజర్ స్పీడ్ ఉంటుందని వినియోగదారులు చెబుతుంటారు. ఈ బ్రౌజర్లో ఉన్న ట్రాకింగ్ ఫీచర్‌తో ఏయే వెబ్సైట్లు మీ మొబైల్‌ను ట్రాక్ చేస్తున్నాయో సులభంగా తెలుసుకోవచ్చు.
ఏ బ్రౌజర్ ఓపెన్ చేసినా మన హిస్టరీని అడ్వర్టైజ్ కంపెనీలు ట్రాక్ చేస్తుంటాయి. దాని ఆధారంగా యాడ్స్‌ను పుష్ చేస్తుంటాయి. కానీ బ్రేవ్ బ్రౌజర్లోని మన హిస్టరీని ఆధారంగా చేసుకుని యాడ్స్ పుష్ చేయడం అంత సులభం కాదు. ఇందుకోసం యాడ్ ట్రాకర్‌ను బిల్ట్ ఇన్‌గా ఇస్తున్నాయి. ఈ బ్రౌజర్ కూడా క్రోమ్ తరహాలోనే పనిచేస్తుంది. కానీ దానికంటే మూడు రెట్లు వేగంగా పనిచేస్తుంది. అదే మొబైల్ బ్రౌజర్‌ను వాడుతున్నట్లు అయితే 35 శాతం బ్యాటరీ వినియోగం తక్కువగా ఉంటుందని బ్రౌజర్ డెవలపర్లు చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి