e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home Top Slides పెగాసస్‌ ప్రకంపనలు

పెగాసస్‌ ప్రకంపనలు

పెగాసస్‌ ప్రకంపనలు
  • 300 మంది భారతీయ ప్రముఖుల ఫోన్లు హ్యాకింగ్‌!
  • విపక్షాలపై నిఘా పెట్టేందుకే.. కేంద్రంపై కాంగ్రెస్‌ ఫైర్‌
  • స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వానికి డిమాండ్‌
  • బురద జల్లేందుకే ఈ ఆరోపణలు.. కేంద్రం ఎదురుదాడి
  • హ్యాకింగ్‌ అవాస్తమన్న ‘పెగాసస్‌’ తయారీ సంస్థ ఎన్‌ఎస్‌వో
  • గ్రీకు పురాణాల్లో రెక్కల గుర్రాన్ని ‘పెగాసస్‌’గా పిలుస్తారు.
  • జాబితాలో రాహుల్‌, ప్రశాంత్‌ కిశోర్‌, కేంద్రమంత్రులు ప్రహ్లాద్‌ పటేల్‌, అశ్వినీ వైష్ణవ్‌ కూడా..

‘పెగాసస్‌’ హ్యాకింగ్‌ వ్యవహారం దేశ రాజకీయాలను కుదిపేస్తున్నది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌గాంధీ సహా ఇద్దరు కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లను‘పెగాసస్‌’ స్పైవేర్‌ సాయంతో హ్యాక్‌ చేసినట్టు ‘ది వైర్‌’ వార్తాసంస్థ ఓ కథనంలో పేర్కొనడం దుమారం రేపింది. ప్రభుత్వాల వద్దే అందుబాటులో ఉండే ‘పెగాసస్‌’ స్పైవేర్‌ హ్యాకర్ల చేతుల్లోకి ఎలా వెళ్లిందని? విపక్ష నేతలపై నిఘా పెట్టేందుకే ప్రభుత్వం ఈ పని చేయించిందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ఈ అంశంపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశాయి. దీనిపై కేంద్రం ఘాటుగా స్పందించింది. భారత ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు.. కొందరు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి కథనాలు ప్రసారం చేస్తున్నారని మండిపడింది. పార్లమెంటు సమావేశాలకు ముందు ఇలాంటి వార్తలు రావడం యాదృచ్ఛికం కాదని పేర్కొన్నది. కాగా, ‘పెగాసస్‌’ స్పైవేర్‌తో హ్యాకింగ్‌ నిజమేనని వాషింగ్టన్‌ పోస్టు వార్తాసంస్థ సోమవారం ధ్రువీకరించింది.

న్యూఢిల్లీ, జూలై 19

- Advertisement -

ఫోరెన్సిక్‌ విశ్లేషణల్లో రుజువు..
ఇజ్రాయెల్‌లోని ఎన్‌ఎస్‌వో గ్రూప్‌నకు చెందిన ‘పెగాసస్‌’ అనే స్పైవేర్‌ సాయంతో 300 మంది భారతీయ ప్రముఖుల ఫోన్లను హ్యాక్‌ చేశారని ‘ది వైర్‌’ సంచలన కథనాన్ని ప్రచురించింది. కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతలు, న్యాయనిపుణులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, ప్రభుత్వ అధికారులు, శాస్త్రవేత్తలు, హక్కుల కార్యకర్తలు తదితరుల ఫోన్‌ నంబర్లు ఈ జాబితాలో ఉన్నట్టు వెల్లడించింది. 2019 పార్లమెంటు ఎన్నికలకు ముందు.. అంటే 2018-19 సంవత్సరాల మధ్య ఈ ఫోన్లను హ్యాక్‌ చేసినట్టు వివరించింది. నిజంగా ప్రముఖుల ఫోన్లు హ్యాకింగ్‌కి గురయ్యాయా? లేదా? అని తెలుసుకునేందుకు డిజిటల్‌ ఫోరెన్సిక్‌ నిపుణులతో విశ్లేషణలు జరిపించామని, ఆ నివేదికలో హ్యాకింగ్‌ జరిగినట్టు తేలిందని ఆ వార్తా సంస్థ వెల్లడించింది. ఫోన్‌ నంబర్లు హ్యాక్‌ అయిన వారి జాబితాలో పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నారు. దీంతో విపక్షాలు కేంద్రం తీరుపై మండిపడ్డాయి. కాగా, భారత్‌కు చెందిన 300 మంది ప్రముఖుల ఫోన్లు ‘పెగాసస్‌’ సాయంతో హ్యాకింగ్‌కి గురయ్యాయని వాషింగ్టన్‌ పోస్టు పేర్కొంది. ఫోరెన్సిక్‌ విశ్లేషణల్లో ఇది వెల్లడైనట్టు తెలిపింది.

బెడ్‌రూమ్‌ మాటలూ వినండి

‘పెగాసస్‌’ స్పైవేర్‌ వివాదంపై కేంద్రప్రభుత్వం స్వతంత్ర దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వాలకు మాత్రమే అందుబాటులో ఉండే ‘పెగాసస్‌’ స్పైవేర్‌.. హ్యాకర్ల చేతుల్లోకి ఎలా వెళ్లిందని మరో సీనియర్‌ నేత శశి థరూర్‌ ప్రశ్నించారు. రోజుకు 18 గంటలు పనిచేస్తున్నట్టు చెప్పుకునే మీరు (ప్రధాని మోదీ) ఇతర ఫోన్లలోని సంభాషణలు వినేందుకు ఎన్ని గంటలు వెచ్చిస్తున్నారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా ఎద్దేవా చేశారు. బెడ్‌రూమ్‌లో, వాష్‌రూమ్‌లో జరిగే సంభాషణలను కూడా మోదీ ప్రభుత్వం వింటున్నదని ధ్వజమెత్తారు. బీజేపీని భారత జాసూస్‌(గూఢచారి) పార్టీ అని అభివర్ణించారు. హోంమంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలని, ప్రధానిపై విచారణ జరుపాలని డిమాండ్‌ చేశారు. సీపీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌, శివసేన కూడా ఈ అంశంపై ధ్వజమెత్తాయి.

యాదృచ్ఛికం కానేకాదు: కేంద్రం
విపక్షాల విమర్శలను కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సోమవారం లోక్‌సభలో తిప్పికొట్టారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ఒక్కరోజు ముందు ఈ కథనాలు రావడం యాదృచ్ఛికంగా కనిపించడం లేదన్నారు. భారత ప్రజాస్వామ్యంపై బురద జల్లేందుకే కొందరు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాగా ఫోన్లు హ్యాకింగ్‌కు గురైన వారి జాబితాలో అశ్వినీ వైష్ణవ్‌ పేరు కూడా ఉన్నది. 2017లో ఆయన ఫోన్‌ హ్యాకింగ్‌కి గురైనట్టు నివేదిక పేర్కొంది. ఆ సమయంలో వైష్ణవ్‌ బీజేపీలో ఇంకా చేరలేదు.

ఎవరి ఫోన్లు హ్యాకింగ్‌కి గురయ్యాయంటే?

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌, కేంద్రమంత్రులు ప్రహ్లాద్‌ పటేల్‌, అశ్వినీ వైష్ణవ్‌, మాజీ ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ లవాసా, సిట్టింగ్‌ సుప్రీంకోర్టు జడ్జి, హిందుస్థాన్‌ టైవ్‌ ది వైర్‌, ఇండియా టుడే, నెట్‌వర్క్‌ 18, ది హిందూ, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, పయనీర్‌ తదితర సంస్థలకు చెందిన 40 మంది జర్నలిస్టులు, ఎల్గార్‌ పరిషద్‌ కేసులో అరెస్టయిన ఉద్యమకారులు, న్యాయవాదులు, విద్యావేత్తలు, విశ్వవిద్యాలయానికి చెందిన ఓ మాజీ ప్రొఫెసర్‌ హ్యాకింగ్‌కి గురైన జాబితాలో ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి.

దావా వేస్తాం: ఎన్‌ఎస్‌వో
పెగాసస్‌తో హ్యాకింగ్‌ కథనాలను ఆ స్పైవేర్‌ను అభివృద్ధి చేసిన ఎన్‌ఎస్‌వో సంస్థ ఖండించింది. ఆధారల్లేకుండా తప్పుడు కథనాలు ప్రచురితమవుతున్నాయని పేర్కొన్ననది. బాధ్యులపై దావా వేస్తామని తెలిపింది. ‘పెగాసస్‌’ వివాదంలో ఎన్‌ఎస్‌వోపై చర్యలు తీసుకోవాలని వాట్సాప్‌ హెడ్‌ విల్‌ కాత్‌కార్ట్‌ పేర్కొన్నారు.

ఏమిటీ పెగాసస్‌? ఎలా చేరుతుంది?
ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ ‘పెగాసస్‌’ స్పైవేర్‌ని అభివృద్ధి చేసింది. 2016లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన ఈ స్పైవేర్‌ను ప్రాథమికంగా ఉగ్రవాదులను పట్టుకోవడం, నిఘా కార్యకలాపాల కోసం అభివృద్ధి చేశారు. దీనిపై పలు దేశాల ప్రభుత్వాలు ఆసక్తి కనబర్చడంతో ఎన్‌ఎస్‌వో ఆయా సంస్థలకు విక్రయించడం ప్రారంభించింది. అయితే, 2019లో ఈ స్పైవేర్‌పై దేశంలో తొలిసారిగా వివాదం తలెత్తింది. వాట్సాప్‌ ద్వారా కొన్ని అజ్ఞాత సందేశాలు వచ్చాయని, వాటితో తమ ఫోన్లలోకి పెగాసస్‌ను జొప్పించారని కొందరు జర్నలిస్టులు ఆరోపించారు. నకిలీ లింక్‌ల ద్వారా హ్యాకర్లు ఈ స్పైవేర్‌ను ఫోన్లలోకి పంపిస్తారు. ఈ లింక్‌ను క్లిక్‌ చేయడంతో పెగాసస్‌ ఫోన్లో ఇన్‌స్టాల్‌ అవుతుంది. మిస్డ్‌కాల్స్‌ ద్వారా కూడా ఈ స్పైవేర్‌ను ఫోన్‌లో చొప్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాట్సాప్‌ లాంటి ఎన్‌క్రిప్టెడ్‌ యాప్‌లను సైతం ఈ స్పైవేర్‌ సాయంతో హ్యాక్‌ చేయొచ్చు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పెగాసస్‌ ప్రకంపనలు
పెగాసస్‌ ప్రకంపనలు
పెగాసస్‌ ప్రకంపనలు

ట్రెండింగ్‌

Advertisement