సోమవారం 03 ఆగస్టు 2020
Science-technology - Jul 09, 2020 , 17:26:02

గాలిలో ఉన్న కరోనా వైరస్‌ పనిపట్టే ఫిల్టర్ ఇది!

గాలిలో ఉన్న కరోనా వైరస్‌ పనిపట్టే ఫిల్టర్ ఇది!

వాషింగ్టన్ : కరోనా వైరస్ వ్యాప్తి మనకు కొంతవరకు మంచే నేర్పుతున్నది అనుకోవాలి. తొలుత పరిశుభ్రంగా ఎలా ఉండాలో నేర్పగా.. మన అవసరాలను తీర్చుకొనేందుకు టెక్నాలజీని ఎలా వాడుకోవచ్చునో కూడా చూపిస్తున్నది. కరోనా కాలంలో కొత్తకొత్త ఉత్పత్తులు ఎన్నో సమాజానికి పరిచయమయ్యాయి. వీటిలో ముఖ్యమైనది క్యాచ్ అండ్ కిల్ ఎయిర్ ఫిల్టర్. ప్రస్తుతం గాలి ద్వారా వ్యాప్తిచెందే అవకాశాలు కూడా ఉన్నాయని పరిశోధకులు నమ్ముతున్న తరుణంలో ఇలాంటి ఫిల్టర్ల అవసరం ఎంతో ఉన్నదని చెప్పాలి.

కరోనా వైరస్ను పట్టుకొని చంపే ఎయిర్ ఫిల్టర్ ను హ్యూస్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం తయారుచేసింది. సహచరులతో కలిసి కొవిడ్-19 కు కారణమయ్యే వైరస్ ను ట్రాప్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఈ "క్యాచ్ అండ్ కిల్" ఎయిర్ ఫిల్టర్‌ వైరస్ ను పట్టుకోగానే చంపేస్తుంది. హ్యూస్టన్ యూనివర్సిటీలోని టెక్సాస్ సెంటర్ ఫర్ సూపర్ కండక్టివిటీ డైరెక్టర్ గా ఉన్న జిఫెంగ్ రెన్, హ్యూస్టన్‌కు చెందిన మెడికల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ సంస్థ మెడిస్టార్ సీఈఓ మోంజెర్ హౌరానీ.. ఇతర శాస్త్రవేత్తలతో కలిసి ఈ ఫిల్టర్‌ను అభివృద్ధి చేయడానికి పనిచేశారు. 

గాల్వెస్టన్ నేషనల్ లాబొరేటరీలో నిర్వహించిన వైరస్ పరీక్షల్లో 99.8 శాతం సార్స్-కోవ్-2 ను గుర్తించాయి. కొవిడ్-19 కి కారణమయ్యే వైరస్ ను ఈ ఫిల్టర్ ద్వారా నాశనం చేశారు. టెక్సాస్ విశ్వవిద్యాలయం మెడికల్ బ్రాంచ్ చేత నిర్వహించబడుతున్న జాతీయ ప్రయోగశాలలో నిర్వహించిన పరీక్షల సమయంలో ఇది 99.9 శాతం ఆంత్రాక్స్ బీజాంశాలను చంపినట్లు తేలింది. మూడు గంటల పాటు వైరస్ గాలిలో ఉండటం వలన వేగంగా తొలగించడం ఈ ఫిల్టర్ ద్వారా సాధ్యపడుతుంది. వ్యాపారాలు తిరిగి తెరుస్తున్న తరుణంలో దుకాణాల్లో, మాల్స్, షాపింగ్ కాంప్లెక్సులు,  ఎయిర్ కండిషన్డ్ ప్రదేశాలలో వైరస్ వ్యాప్తిని నియంత్రించడం ఈ ఫిల్టర్ ద్వారా సాధ్యపడుతుంది. కార్యాలయాల్లో ఉద్యోగుల సమీప పరిసరాల్లో గాలిని శుద్ధి పరిచే డెస్క్‌టాప్ మోడల్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. 


logo