శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Science-technology - Aug 04, 2020 , 16:44:43

గోరువెచ్చని నీటితో కరోనా ఖతం: రష్యా సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడి

గోరువెచ్చని నీటితో కరోనా ఖతం: రష్యా సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడి

మాస్కో: గతేడాది డిసెంబర్‌లో చైనాలో వ్యాప్తి ప్రారంభమైనప్పటినుంచీ ఇప్పటివరకూ కరోనా ఎంతోమందిని పొట్టనబెట్టుకున్నది. ఈ మహమ్మారి బారినపడి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 6,86,703 మంది ప్రాణాలు కోల్పోయినట్లు డబ్ల్యూహెచ్‌వో తాజా నివేదిక వెల్లడిస్తోంది. మిలియన్ల మందిపై ప్రభావం ఉంది. దీనిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌ కనుగొనేందుకు 160 కి పైగా పరిశోధనా బృందాలు శ్రమిస్తున్నాయి. కాగా, దీనిపై విస్తృతంగా అధ్యయనం చేస్తున్న రష్యన్‌ శాస్త్రవేత్తలు కరోనాను ఖతం చేసే ఓ శుభవార్తను అందించారు. సాధారణ గది ఉష్ణోగ్రత లేదా గోరువెచ్చని నీరు తాగితే కరోనా వైరస్‌ నాశనం అవుతున్నదని తేల్చారు.    

రష్యా వార్తా సంస్థ నివేదిక ప్రకారం.. సైబీరియాలోని నోవోసిబిర్స్క్‌లోని రష్యా వెక్టర్ స్టేట్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ వైరాలజీ అండ్ బయోటెక్నాలజీకి చెందిన ఒక పరిశోధనా బృందం ఈ విషయాన్ని కనుగొంది. గది ఉష్ణోగ్రత కలిగిన నీరు కొవిడ్‌-19 కి కారణమయ్యే సార్స్‌ సీఓవీ-2 వైరస్ పెరుగుదలను ఆపగలదని గుర్తించారు. రూం టెంపరేచర్‌ కలిగిన నీరు 24 గంటల వ్యవధిలో కరోనా వైరస్‌కు చెందిన 90 శాతం కణాలను చంపగలదని, అదే 72 గంటల్లో 99.9 శాతం సెల్స్‌ను నాశనం చేస్తుందని తేల్చారు.  అలాగే, మరుగుతున్న నీరు నావెల్‌ కరోనా వైరస్‌ను పూర్తిగా చంపగలదని గుర్తించారు. దీంతోపాటు కరోనా వైరస్‌ అనేది క్లోరినేటెడ్ నీరు, సముద్రపు నీటిలో జీవించగలిగినప్పటికీ, తన సంతతిని పెంచుకోవడం లేదని గుర్తించారు. మొత్తంమీద కరోనా వైరస్‌ జీవితకాలం నేరుగా నీటి ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుందని పరిశోధకులు నిర్ధారించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo