గురువారం 22 అక్టోబర్ 2020
Science-technology - Jul 07, 2020 , 16:45:42

రోజుకో పెగ్గు.. మలిదశలో జ్ఞాపకశక్తి మెరుగు!

రోజుకో పెగ్గు.. మలిదశలో జ్ఞాపకశక్తి మెరుగు!

న్యూయార్క్‌: మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మద్యం తాగితే శరీర అవయవాలన్నీ పాడైపోతాయి. ప్రాణాలకే ముప్పని ఇప్పటిదాకా మనకు తెలుసు. అయితే, ఇప్పుడు కిక్‌ ఇచ్చే ఒక నిజం తాజా అధ్యయనంలో వెలుగుచూసింది. రోజుకు కొంత మద్యం (రెడ్‌ వైన్‌) తాగిన వారిలో మలిదశలో మెదడు పనితీరు పదిలంగానే ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ అధ్యయనాన్ని అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జర్నల్‌ ప్రచురించింది. 

తక్కువ నుంచి మితస్థాయిలో ఆల్కహాల్‌ సేవించేవారిలో మధ్యవయస్సు నుంచి వృద్ధాప్యం వరకు మెదడు పనితీరు ఎలా ఉంటుంది? అనే అంశంపై జార్జియా వర్సిటీకి చెందిన డాక్టోరల్‌ విద్యార్థులు అధ్యయనం చేపట్టారు. 19,887 మందిని 9.1 ఏళ్లపాటు పరిశీలించారు. ఇందులో మొత్తానికి ఆల్కాహాల్‌  తాగనివారు కొందరుంటే, రోజులో స్వల్పంగా, మధ్యస్థంగా సేవించేవారు కొందరున్నారు. వీరందరికీ అధ్యయనం చివరలో మెదడు పనితీరును పరిశీలించేందుకు పరీక్ష పెట్టారు. అయితే, వైన్‌ తాగని వాళ్లతో పోలిస్తే, స్వల్పంగా, మధ్యస్థంగా తాగేవారి మానసిక స్థితి, పదాలను గుర్తుంచుకునే సామర్థ్యం, పదజాలం పదిలంగా ఉన్నట్లు తేలింది.  దీని ఆధారంగా తాగనివారితో పోలిస్తే రోజులో తక్కువ మొత్తంలో ఆల్కహాల్‌ సేవించేవారిలో జ్ఞాపకశక్తి తగ్గకపోగా, నిలకడగానే ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. వారంలో 10 నుంచి 14 పెగ్గులు తాగేవారిలో ఈ ఫలితాలు కనిపిస్తున్నాయని తేల్చారు. అంటే దీనర్థం ఇంతకంటే తక్కువ తాగేవారు పెంచాలనేది తమ ఉద్దేశం కాదని, కేవలం ఆల్కహాల్‌కు మెదడు పనితీరుకు మధ్య ఉన్న సంబంధాన్ని వెల్లడించేందుకే ఈ అధ్యయనాన్ని చేపట్టినట్లు పరిశోధకులు వెల్లడించారు. జ్ఞాపకశక్తి పదిలంగా ఉండాలంటే కచ్చితంగా మద్యం సేవించాలని తాము సూచించడం లేదని ఈ స్టడీకి నేతృత్వం వహించిన జాంగ్‌ పేర్కొన్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo