బుధవారం 03 జూన్ 2020
Science-technology - Apr 02, 2020 , 16:53:07

భూమి భారాన్ని తగ్గించిన కరోనా

భూమి భారాన్ని తగ్గించిన కరోనా

కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నప్పటికీ దాని వల్ల కూడా కొంత మంచి జరుగుతున్నది. ముఖ్యంగా పర్యావరణానికి మేలు జరుగుతున్నదని ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు. తాజాగా భూమి భారాన్ని కూడా కరోనా తగ్గిస్తున్నదని గుర్తించారు. అదెలాగంటారా..

భూగోళం పొరలు పొరలుగా ఉంటుందని తెలుసు కదా. అందులో పైపొర మొత్తం ముక్కలు ముక్కలుగా ఉంటుంది. అవి నిరంతరం ఒకదానితో ఒకటి ఢీకొంటూ ఉంటాయి. అలా ఢీకొన్నప్పుడు పుట్టేదే భూకంపం. తాజాగా ప్రపంచం మొత్తం దాదాపు లాక్‌డౌన్‌ కావటంతో వందలకోట్ల మంది ఎక్కడికక్కడే ఉండిపోయారు. వాహనాల చప్పుళ్లు లేవు. గనుల్లో భారీ పేలుళ్లు లేవు. అన్ని పనులూ ఆగిపోయారు. దాంతో భూమి నుంచి నిరంతరం వెలువడే ధ్వనులు కూడా నెమ్మదించాయని బ్రిటిష్‌ జియోలాజికల్‌ సర్వే ప్రకటించింది.

సాధారణ రోజుల్లో భూమి పొరలలో నిరంతరం జరిగే సర్దుబాట్ల కారణంగా భారీ ఎత్తున ధ్వనులు వెలువడుతుంటాయి. కానీ వాటిని మనుషులు వినలేరు. అత్యాధునిక యంత్రాలు వాటిని గుర్తిస్తాయి. కుక్కలవంటి కొన్ని జంతువులు కూడా ఆ ధ్వనులను గ్రహించగలవు. తాజాగా జరిపిన అధ్యయనంలో ఆ ధ్వనుల తీవ్రత తగ్గిందని గుర్తించారు. కరోనా కారణంగా లండన్‌ నగరాన్ని కూడా లాక్‌డౌన్‌ చేశారు. దాంతో నగరం దాదాపు స్తంభించింది. లాక్‌డౌన్‌ అయిన నాటి నుంచి జరిపిన పరిశోధనలో భూమిలోంచి వచ్చే ధ్వనులతోపాటు నిరంతరం ఉండే వైబ్రేషన్స్‌ కూడా తగ్గాయని జెరోమ్‌ వెర్నే అనే జియాలజిస్టు వెల్లడించారు.

భూమి నుంచి వచ్చే ధ్వనులను పరిశీలించేందుకు రాయల్‌ అబ్జర్వేటరీ ఆఫ్‌ బెల్జియం జియాలజిస్టు థామస్‌ లీకాక్‌ ఓ టూల్‌ను తయారు చేశారు. ప్రపంచంలో ఎక్కువ మంది ఈ టూల్‌నే నేడు ఉపయోగిస్తున్నారు. తాజాగా ఈ టూల్‌ను ఉపయోగించి సీస్మాలజిస్టు స్టీఫెన్‌ హిక్స్‌ ఈ పరిశోధన నిర్వహించారు.   


logo