ఆదివారం 07 జూన్ 2020
Science-technology - Apr 02, 2020 , 11:15:53

పిల్లులు, ముంగిసలకూ కరోనా

పిల్లులు, ముంగిసలకూ కరోనా

గబ్బిలాల నుంచి మనుషులకు సోకిందని భావిస్తున్న కరోనా వైరస్‌ ఇతర జంతువులకు కూడా సోకుతున్నట్లు తెలుస్తున్నది. చైనాలోని కొన్ని ప్రయోగశాలల్లో కరోనా వైరస్‌ను పరీక్షిస్తున్న సమయంలో అక్కడ ఉన్న కొన్ని పిల్లులు, ముంగసలకు ఈ వ్యాధి సోకినట్లు గుర్తించారు. అంతేకాదు వీటి నుంచి ఇతర జంతువులకు కూడా వ్యాధి వ్యాపిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే కుక్కలకు మాత్రం కరోనా పెద్దగా సోకటంలేదని చైనాలోని హర్బిన్‌లో ఉన్న జంతుప్రయోగశాల అధికారులు వెల్లడించారు. పిల్లులు, కుక్కలు మనుషులకు చాలా సన్నిహితంగా మెలుగుతాయి కాబట్టి వాటితో మనుషులు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరారు.

పిల్లులు, ముంగిసల నుంచి ఈ వ్యాధి కోడిపిల్లలు, బాతులు, పందులకు కూడా సోకే ప్రమాదం ఉందని అమెరికాలోని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ కూడా అనుమానాలు వ్యక్తం చేసింది. ఇటీవల హాంగ్‌కాంగ్‌, బెల్జియంలో కూడా పెంపుడు జంతువులకు కరోనా సోకినట్లు గుర్తించారు. అసలు పెంపుడు జంతువులపై కరోనా ఎలా ప్రభావం చూపుతున్నది అనే అంశాన్ని తెలుసుకొనేందుకు చైనాలోని హర్బిన్‌ ప్రయోగశాలలో కొన్ని పిల్లులు, కుక్కలకు కరోనా వైరస్‌ సోకేటట్లు చేశారు. ఆరు రోజుల తర్వాత వాటి ముక్కు, నోటి నుంచి కారే ద్రవాల్లో కరోనా వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు. వాటికి సన్నిహితంగా ఉన్న మరికొన్ని పెంపుడు జంతువులకు కూడా ఈ వైరస్‌ సోకినట్లు కనుగొన్నారు.  


logo