శనివారం 04 ఏప్రిల్ 2020
Science-technology - Mar 22, 2020 , 23:10:42

విజ్ఞాన విపంచి

విజ్ఞాన విపంచి

ఈమె కోడిజాతి అమ్మమ్మ

నేటి ఆధునిక కాలంలో కాస్త తగ్గింది కానీ  మన గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటిలోనూ ఒకప్పుడు కోళ్లను పెంచుకోవటం తప్పనిసరిగా ఉండేది. ఆర్థికంగా కూడా కుటుంబానికి ఈ కోళ్లు కొంత చేయూతగా ఉండేవి. అయితే, ఈ కోళ్లు భూమిమీద మొదటిసారి ఆవిర్భవించినప్పుడు ఎలా ఉండేవి అనే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా? అయితే ఇదిగో పై చిత్రంలో చూపినట్లుగా ఉండేవని తాజాగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. బెల్జియంలో ఇటీవల కొందరు శాస్త్రవేత్తలు ఒక శిలాజ ముక్కుభాగాన్ని గుర్తించారు. దానికి పూర్తి రూపం ఇస్తే ఇదిగో ఇలా ఉండేదని తేలింది. ముందుభాగం కోడిలాగా, వెనుకభాగం బాతులాగా ఉండేదట. ఆరున్నర కోట్ల ఏండ్లక్రితం ఇది మన భూమి మీద జీవించిందని, ఇదే నేటి కోళ్లకు బాతులకు పూర్వీకురాలని బలంగా నమ్ముతున్నారు. ఈ జీవులు ఎక్కువగా సముద్ర తీరాల్లో తిరుగాడేవట. 


విశ్వదర్శనం


పాతాళ లోకానికి దారి

భారతీయ పురాణాలు, ఇతిహాసాల్లో 14 లోకాలు. అందులో భూలోకంతోపాటు పాతాళ లోకం అనే మాట విరివిగా వాడుతుంటాం. నిజానికి అది ఉందోలేదో తెలియదు కానీ, భూమి మీద ఓ సరస్సులో అలాంటి ప్రదేశమే ఉంది. దీని పేరు సిల్‌ఫ్రా. ఐస్‌లాండ్‌ వెళితే దాన్ని చూడొచ్చు. అక్కడి పింగ్‌విల్లర్‌ నేషనల్‌ పార్క్‌లో నీటి అడుగున సన్నని లోతైన లోయ ఒకటుంది. భూగోళం పైపొర మొత్తం కొన్ని ముక్కలుగా ఉంటుందని, వాటిని టెక్టానిక్‌ ప్లేట్స్‌ అంటారని అందరికీ తెలిసిందే కదా. అలాంటి రెండు ప్లేట్లు ఒకదాని నుంచి మరొకటి దూరం జరగటంతో ఈ పాతాళ లోయ ఏర్పడింది. ఉత్తర అమెరికా, యూరేషియా ప్లేట్లు ఇక్కడ నిరంతరం ఢీకొంటూ దూరం జరుగుతూ ఉంటాయట. అందుకే ఇక్కడ భూకంపాలు కూడా నిత్యకృత్యం. ఈ లోయను చూడాలంటే కాస్త సాహసం తప్పదుమరి. మహానుభావులు


శస్త్రచికిత్సకు ఆద్యుడు శుశ్రుత

నేడు వైద్యశాస్త్రం అసాధారణ స్థాయిలో అభివృద్ధి చెందింది. ఎంతటి కఠినమైన శస్త్రచికిత్సలైనా నేడు చాలా సులువు అయ్యాయి. కానీ వైద్యశాస్త్రంలో అత్యున్నత స్థాయి అయిన ఈ శస్త్రచికిత్సలకు ఆద్యుడు ఒక భారతీయుడు అనే విషయం చాలామందికి తెలియదు. దాదాపు 2800 ఏండ్ల క్రితమే శుశ్రుతుడు శస్త్రచికిత్సలు చేశాడు. అంతేకాదు నేడు చాలామంది తమ బాహ్య ఆకృతి మార్పుకోసం చేసుకుంటున్న ప్లాస్టిక్‌ సర్జరీకి కూడా ఈయనే మూలపురుషుడు ప్రాచీన కాశిలో నివసించిన శుశ్రుతుడు సాధారణంగా మనిషికి సంక్రమించే 1100 రకాల వ్యాధులను గుర్తించి వాటి నివారణోపాయాలతో శుశ్రుత సంహిత గ్రంథాన్ని రాశాడు. 26 రకాల జ్వరాలు, 8 రకాల పసిరికలు, 20 రకాల మూత్రసంబంధ వ్యాధులను వర్గీకరించాడు. ఈ వ్యాధుల నివారణలో ఔషధాలుగా ఉపయోగపడే 760 రకాల ఔషధ మొక్కల వివరాలను భవిష్కత్‌ తరాలకు అందించారు. పరిశోధనలకోసం మానవ దేహాన్ని పాడవకుండా ఎలా నిల్వ చేయవచ్చు అనే మార్గాన్ని కూడా ఈయన సులువుగా సూచించారు. శస్త్రచికిత్సలో వాడదగిన 101 వస్తువులను ఆయన రూపొందించటం విశేషం. logo