బుధవారం 01 ఏప్రిల్ 2020
Science-technology - Mar 19, 2020 , 22:47:20

మొక్కలకూ నొప్పి తెలుస్తుందా?

మొక్కలకూ నొప్పి తెలుస్తుందా?

నొప్పి అంటే ఏమిటో ఆలోచించారా? ఇందులో ఆలోచించడానికి ఏముంది? తెలిసిన విషయమే కదా అనుకుంటే ఇక అక్కడ సైన్సుకు చోటులేదు. సైన్సు రుచి తెలిసిన వాళ్ళు ఏ ప్రశ్ననూ అంత సులభంగా వదిలిపెట్టరు. ప్రశ్నించడమే సైన్సుకు ప్రాణం. ప్రశ్నలతోనే సైన్సు పెరిగింది.‘నొప్పి అంటే శరీరానికి అనుకూలం కాని ఒక పరిస్థితి’ అని సులభంగా అనుకుంటాం. నొప్పినుంచి తప్పించుకోవడానికి గొప్పవారు కూడా తిప్పలు పడక తప్పదు. నిప్పు దగ్గరికి చెయ్యి వెళ్ళిందనుకొందాం. నాడీమండలం కారణంగా వెంటనే వేడిగురించి మెదడుకు తెలిసిపోతుంది. అది అక్కడినుండి ఆజ్ఞలు జారీ చేసి, చెయ్యి చటుక్కున వెనక్కి వచ్చేట్లు చేస్తుంది. మరి, మొక్కలలో నాడులు లేవు, మెదడు అంతకన్నా లేదు. ‘మొక్కలకు నొప్పి తెలుస్తుందా?’. ఇట్లాంటి ప్రశ్నలు అడిగి, జవాబులు వెతకటంతోనే సైన్స్‌ పెరుగుతుంది. ఇప్పటివరకు అది అలాగే పెరిగింది. మొక్కలకు నొప్పి నిజానికి తెలియదు. జంతువులకు తెలిసిన పద్ధతిలో అసలే తెలియదు. కానీ, వాటికికూడా హాని జరుగుతున్నప్పుడు అసౌకర్యంగా మాత్రం తప్పక ఉంటుంది. అందులోంచి బయటపడటానికి కదలికకు వీలుకాని మొక్కలకు మరేవో మార్గాలు ఉంటాయి.

ప్రకృతిలో ఒక వింత పద్ధతి ఉన్నది. మొక్కలను జంతువులు తింటాయి. మొక్కలు, జంతువులను మరికొన్ని రకాల జంతువులు తింటాయి. అంటే, మొక్కలకు అన్నింటికన్నా పెద్ద ఆపద జంతువులనుంచి వస్తుందని అర్థం. తప్పించుకోవడం చేతకాని మొక్కలు అమాయకంగా జంతువులకు, మనుషులకు తిండిగా మారిపోతాయి. తెలివిగల కొన్ని మొక్కల జాతులు తన ఒంటిమీద తినడానికి అనుకూలంగా లేని నూగు, లేదా ముళ్ళను ఏర్పాటు చేసుకుంటాయి. నిజంగానే ‘పువ్వులు ఉన్నచోటనే ముళ్ళుంటాయి’ అన్నమాట ఈ విషయాన్ని సూచిస్తుంది. మొక్కలలో పరపరాగ సంపర్కం జరిగి వాటి జాతి పెరగడానికి కీటకాలు సాయం చేస్తాయి. పురుగులను ఆకర్షించడానికి మొక్కలకు రకరకాల రంగులు, సువాసనలు హంగుగా గల పువ్వులు ఉన్నాయి. ఆ పనికికాక మరేదైనా పనికోసం, లేదంటే మేతకోసం పువ్వులను తినకూడదని మొక్కలు ముళ్ళను పెంచుకుంటాయి. బ్రహ్మ జెముడు ఆకులమీద ముళ్ళు ఆకులను తినే జంతువులు రాకుండా చేస్తాయన్నది సులభంగానే అర్థమవుతుంది.


కొన్ని రకాల మొక్కలలో తినడానికి అసహ్యంగా ఉండే రసాయనాలు కొన్ని పుడతాయి. కనుకనే మనం అన్ని రకాల మొక్కలను తినలేం. జంతువులుకూడా అన్ని రకాల మొక్కలనూ తినవు. ‘మేక మేయని ఆకు’ అని ఒక రకం చెట్లు ఉన్నాయంటే ఆశ్చర్యం లేదు. ఆ విషయాన్ని మనుషులు పరిశీలించి తెలుసుకున్నారంటే అప్పుడు ఆశ్చర్యం కలగాలి. సైన్స్‌ ఆనందం తెలిసిన వారు అది సైన్స్‌ అని తెలియకుండానే ఇటువంటి సంగతులను తెలుసుకున్నారు. కనుక, చదువురాని పల్లెటూరి పశువుల కాపరినుంచి పిహెచ్‌డి చేసిన పెద్ద మనిషిదాకా అందరూ సైంటిస్ట్‌లే.

‘నైట్‌షేడ్‌' అని ఒక మొక్క ఉంది. దాని పేరులో చేదు, తీపి అనే మాటలనుకూడా కలిపి చెబుతుంటారు. మామూలుగా తీపిగా వుండే ఆ మొక్క అవసరం కొద్దీ కేతనాన్ని కూడా చేర్చి ఉన్నదని అర్థం. మెదడు లేకుండా మొక్కలకు తెలివి మాత్రం ఉంది. పరిణామక్రమంలో అవి రక్షణకోసం కొన్ని పద్ధతులను నేర్చుకున్నాయి. నైట్‌షేడ్‌ మొక్క ఆకును ఏదైనా జంతువు కొరికిన మరుక్షణం ఆ అంచులనుంచి ఒక రకమైన చిక్కని ద్రవం కారడం మొదలవుతుంది. ఆ ద్రవం అసలు సిసలైన చక్కెర పానకం. మనిషికి గాయం తగిలితే రక్తం కారినట్టు ఈ మొక్కకు గాయమైతే చక్కెర వంటి ద్రవం కారుతుంది. చక్కెర అంటే ప్రాణం పెట్టే చీమలు చూస్తూ ఉండగానే అక్కడికి బారులు కడతాయి. తమకు కాకుండా ఒకరికి అందకుండా అడ్డు వచ్చిన పురుగులను లేదా ఇతర ప్రాణులను అవి ఆపుతాయి. సూక్ష్మంగా చెప్పాలంటే, ఒక జీవి ఏదో నైట్‌షేడ్‌ ఆకులు కొరికింది. మొక్క వెంటనే సాయం కోసం చీమలను పిలిచింది. దానికి రక్షణ దొరికింది. ఇది పథకం. శత్రువుల శత్రువులు మిత్రులు అన్నది మనుషులకు కూడా తెలిసిన విషయమే కదా.

అన్ని మొక్కలకు ఇట్లా చక్కెర పానకం అందించి చీమలను పిలిచే వీలు కలగదు. చాలా మొక్కలు తమను కోస్తున్నప్పుడు, లేదా మేస్తున్నప్పుడు ఒక రకమైన రసాయనాన్ని గాలిలోకి వెదజల్లుతాయి. ఆ సంగతి కోస్తున్న, మేస్తున్న జీవులకు తెలియదు. దూరంలో ఉన్న కొన్ని రకాల కీటకాలకు మాత్రం తెలుస్తుంది. అవి ఝుమ్మని మొక్క దగ్గరికి వచ్చేస్తాయి. అపాయం కలిగిస్తున్న ప్రాణులకు అసౌకర్యం కలిగించి దూరంగా తరుముతాయి. మరీ, మొండికేస్తే ఈ పురుగులు గాయం మీద గుడ్లు పెట్టడం మొదలుపెడతాయి. ఇక అప్పుడు మేస్తున్న జీవి తప్పుకోక తప్పదు. ఇంతకూ ఇది ఆసక్తికరంగా ఉన్న మొక్కల గురించిన సమాచారమా? లేక సైన్స్‌ అనే బూచి గురించిన సంగతులా? ఇట్లా చెబుతూ పోతే, జీవితమంతా సరిపోని సమాచారం ఉంటుంది. అది తప్పకుండా సరదాగానూ ఉంటుంది. కనుకనే, సైన్సును మనకు అవసరం లేని సంగతి అనుకోకుండా తెలుసుకుందామన్న దృష్టితో చదవాలి. అప్పుడు రుచి తెలుస్తుంది. అవగాహన పెరుగుతుంది. ఆలోచనలు పుడతాయి. ప్రశ్నలు పుట్టి, జవాబులూ దొరుకుతాయి. 

 డా॥ కె.బి.గోపాలం, సెల్‌: 9849062055


logo
>>>>>>