శనివారం 04 ఏప్రిల్ 2020
Science-technology - Mar 11, 2020 , 22:57:51

అక్షరాలకు నవ‘కాంతి’

అక్షరాలకు నవ‘కాంతి’

అక్షరాలు పేర్చి.. పదాలుగా మార్చి.. పేరాలుగా మలిచి లెక్కలేని భావాల్ని ఒక్కచోట చేరుస్తుంటారు. కథ, కవిత, నవల పేరేదైనా ఆ అక్షరాలు వేల ఏండ్ల చరిత్రను సజీవంగా ఉంచుతాయి. అవే అక్షరాల్ని బొమ్మలుగా మలిచి.. వివిధ ఆకృతుల్లోకి వస్తువుల్లోకి మారిస్తే?కొత్త వెలుగై ఉదయించదా?.. అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడీ యువకుడు.

అది వనపర్తి జిల్లా ఆత్మకూరు. పాఠశాల ప్రారంభమై రెండ్రోజులైంది. అందరూ నోట్‌బుక్‌లు కొన్నారు. అదేరోజు కొత్త పుస్తకాలు ఇచ్చారు. ఫస్ట్‌బెల్‌ మోగడానికి ఇంకా పదినిమిషాలుంది. అప్పటికే కొందరు విద్యార్థులు తరగతి గదికి చేరుకున్నారు. ఓ విద్యార్థి చుట్టూ గుమిగూడారు. నాది.. నాది అంటూ ఒక్కొక్కరూ పుస్తకాల్ని ఓ విద్యార్థికి ఇస్తున్నారు. ఆ అబ్బాయి ఒక్కొక్కరి పుస్తకాల్ని తీసుకొని వాటిపై పేర్లు రాసి ఇచ్చేస్తున్నాడు. ఇలా రెండ్రోజుల్లో సమయం ఉన్నప్పుడల్లా స్కూల్లోని చాలామందికి నోట్‌బుక్‌లు, పుస్తకాలపై పేర్లు రాసిచ్చాడు. ఆ విద్యార్థి ఒక్కరికి రాసిన ైస్టెల్‌లో మరొకరికి రాసిచ్చేవాడు కాదు. అతడే కరిడె నవకాంత్‌. అతడికున్న కళను క్యాలిగ్రఫీ అంటారని అతడికి తెలియడానికి చాలా ఏండ్లు పట్టింది. 


క్యాలీగ్రఫీ అంటే?

అక్షరాలను అందంగా రాసే కళను క్యాలిగ్రఫీ అంటారు. ఇందులో రాణించేవారిని క్యాలిగ్రాఫర్స్‌ అంటారు. భాష ఏదైనా భావం ఉట్టిపడేలా అక్షరాలను వివిధ ఆకృతుల్లో రాయడం క్యాలిగ్రఫీ ప్రత్యేకత. రెండు తెలుగు రాష్ర్టాల్లో ఈ కళలో రాణించేవారు అరుదు. ప్రింటింగ్‌ ప్రెస్‌ ఏర్పడటానికి ముందు ఈ కళకు ఆదరణ ఉండేది. అప్పుడు పుస్తకాల్ని చేత్తో రాసేవారు. అందమైన దస్తూరీ కోసం క్యాలిగ్రాఫర్‌ను ఎంచుకునేవారు. క్యాలిగ్రఫీ అనే పదానికి అందమైన రచన అనే అర్థం ఉంది. కొన్నాళ్లకు ప్రింటింగ్‌ ప్రెస్‌లు, కంప్యూటర్లు రావడంతో క్యాలిగ్రఫీ కళకు ఆదరణ తగ్గింది. కానీ ప్రస్తుతం ఈ కళ రూపాంతరం చెందింది. క్యాలిగ్రాఫర్స్‌ అక్షరాలతో బొమ్మలు వేస్తున్నారు. వివిధ కళాకృతుల్లో అక్షరాల్ని ఇనుమడింపజేస్తున్నారు.


అవకాశాలు ఇలా?

ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సుల్లో క్యాలిగ్రఫీ ఓ సబ్జెక్టు. ఇందులో అక్షరాలను అందంగా రాయడమెలా? ఎన్ని రకాలుగా రాయొచ్చు? చరిత్ర వివరాలుంటాయి. క్యాలిగ్రఫీపై సాధన తదితర అంశాలుంటాయి. ఇందులో పట్టు సాధిస్తే సినిమాల్లో అవకాశాలు అనేకం. సినిమాలు, సీరియళ్ల టైటిళ్లను విభిన్నంగా రాస్తూ ఉపాధి పొందవచ్చు. కవులు, రచయితలు ప్రచురించే పుస్తకాలకు శీర్షికలు విభిన్నంగా రాస్తూ ఉపాధి పొందవచ్చు. 


రెండు రాష్ర్టాల్లో ఒకే ఒక్కడు!

రెండు తెలుగు రాష్ర్టాల్లో క్యాలిగ్రఫీలో రాణిస్తున్న ఒకే ఒక్కడు నవకాంత్‌. చాలామందికి క్యాలిగ్రఫీ అనే కళ ఒకటి ఉందని కూడా తెలియదు. నవకాంత్‌కు కూడా కొన్నేండ్ల క్రితం క్యాలిగ్రఫీ గురించి తెలియదు. ఓ ఆదివారం అబిడ్స్‌ మార్కెట్లో పాత పుస్తకాల్ని కొనేందుకు వెళ్లాడు. ఒక పుస్తకం అట్టపై విభిన్న అక్షరాలు రాసి ఉండటం గమనించాడు. దానిపై క్యాలిగ్రఫీ అని రాసుంది. దాని రచయిత అచ్యుత్‌ పాలవ్‌. ఆ పుస్తకాన్ని తిరగేస్తే తన కళను తాను పునఃశ్చరణ చేసుకున్నట్లు అనిపించిందతడికి. అందులో ఉన్న విభిన్న అక్షరాలు, అతడు రాసిన అక్షరాలు ఒకే మాదిరిగా ఉన్నాయి.  ‘అప్పుడతడికి అర్థమైంది తెలియకుండానే ఓ కళలో రాణిస్తున్నా’ అని.


రచయిత కోసం ముంబాయికి..

బీటెక్‌ పూర్తి చేసిన నవకాంత్‌ అబిడ్స్‌లో చూసిన క్యాలిగ్రఫీ పుస్తకాన్ని మర్చిపోలేకపోయాడు. ఆ పుస్తక రచయిత అడ్రస్‌ తెలుసుకొని ముంబాయి చేరుకున్నాడు. ‘మార్కెట్లో పుస్తకం చూసి ఇంత దూరం వచ్చాను’ అని నవకాంత్‌ చెబితే అచ్యుత్‌పాలవ్‌ నమ్మలేదు. కానీ ఆ తర్వాత నవకాంత్‌ క్యాలిగ్రఫీ చూశాక వారం రోజులు తన ఇంట్లోనే ఉండమన్నారు. క్యాలిగ్రఫీలో మరిన్ని మెళకువలు నేర్పించారు. కళ ఆధునికీకరణ, విభిన్న కోణాల్లో, విభిన్న కళాకృతుల్లో కళను జోడించడం వంటి విషయాలు నేర్పించారు. 


కళను జోడించి..

కెటిల్‌, రోలుబండ, రొట్టెపీట, పిల్లనగ్రోవి, కప్పులు, సాసర్‌లు, గిన్నెలు ఇలా ఎన్నింటిపైనో క్యాలిగ్రఫీని అమర్చే పనిలో పడ్డాడు నవకాంత్‌. ఇంట్లో ఏ వస్తువు కనబడ్డా దానిపై తన కళను పొందుపర్చే పనిలో పడతాడు. ఆయన ఇంటి గోడల నిండా విభిన్న డిజైన్లలో క్యాలిగ్రఫీ ఆర్ట్‌ కనిపిస్తుంది. గతేడాది ముంబాయి, సౌత్‌ కొరియాలో నవకాంత్‌ క్యాలిగ్రఫీ ఆర్ట్స్‌ను ప్రదర్శించారు. ఇటీవల నెదర్లాండ్స్‌లోని ఓ ప్రభుత్వ మ్యూజియంలో సైతం ప్రదర్శించారు. 


ప్రోత్సాహం కల్పించాలె..

తెలిసో తెలియకో ఈ కళకు చిన్నప్పడే దగ్గరయ్యాను. ఓ ప్రయివేటు స్కూల్లో ఆర్ట్‌ టీచర్‌గా పనిచేస్తున్నా. పిల్లలకు క్యాలిగ్రఫీలో శిక్షణ ఇస్తున్నా. తెలంగాణ ప్రభుత్వం క్యాలిగ్రఫీ కళను, కళాకారులను ప్రోత్సహించాలె. ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ఉచితంగా క్యాలిగ్రఫీ నేర్పించాలనే ఆలోచనలో ఉన్నా. పెద్ద పెద్ద ఈవెంట్లు, ప్రదర్శనలు జరిగే సమయంలో నా కళను ప్రదర్శించేందుకు (స్టాల్‌ పెట్టుకునేందుకు) అధికారులు అవకాశం కల్పించాలె.

- కరిడె నవకాంత్‌, క్యాలిగ్రాఫర్‌, మహబూబ్‌నగర్‌


-పడమటింటి రవికుమార్‌

-సీఎం ప్రవీణ్‌కుమార్‌


logo