ఆదివారం 29 మార్చి 2020
Science-technology - Mar 08, 2020 , 23:02:02

లక్షన్నర కొలువులు

లక్షన్నర కొలువులు

నానాటికీ దేశంలో నిరుద్యోగం పెరుగుతుందన్న వార్తల నడుమ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ చల్లని కబురు చెప్పింది. వచ్చే ఏడాది మార్చి నాటికి అక్షరాలా లక్షా నలభై వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు కమిషన్‌ చైర్మన్‌ బ్రజ్‌ రాజ్‌ శర్మ ప్రకటించారు. ఇప్పటికే డిగ్రీ పూర్తిచేసిన వారితో పాటు, ఈ ఏడాది పట్టా పుచ్చుకోనున్న అభ్యర్థులు కూడా ప్రణాళిక ప్రకారం చదివి విజయం సాధించవచ్చు. ఈ ఏడాది మార్చిలో డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాసి, మరుసటి ఏడాది మార్చిలో ఉద్యోగంలో చేరాలంటే ఒకింత కష్టపడక తప్పదు. ఉజ్వలమైన భవితనిచ్చే కేంద్ర ప్రభుత్వ రంగ కొలువులు సిద్ధంగా ఉన్నాయి. అందిపుచ్చుకోవడమే తరువాయి. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ వేర్వేరు డిపార్ట్‌మెంట్లలో ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. అందులో ముఖ్యమైనవి. కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ (డిగ్రీ అభ్యర్థులకు), కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ (ఇంటర్మీడియట్‌ అర్హత) కంబైన్డ్‌ మల్టీ టాస్కింగ్‌ఫోర్స్‌ (పదో తరగతి ఉత్తీర్ణత). ఒక్కో లెవల్‌ పరీక్ష విధానాన్ని పరిశీలిద్దాం..

కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ పరీక్ష: ఇందులో మూడు దశలు ఉంటాయి. అవి  టైర్‌-1, టైర్‌-2, టైర్‌-3 సిలబస్‌ను పరిశీలిస్తే...

టైర్‌-1: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉంటుంది)

టైర్‌-2: మెయిన్‌ (రాతపరీక్ష- ఆబ్జెక్టివ్‌ పద్ధతిలోనే ఉంటుంది)

టైర్‌-3: వ్యక్తిత్వ పరీక్ష /ఇంటర్య్యూ లేదా స్కిల్‌ టెస్ట్‌ (సీపీవోలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాన్ని ఆశించే అభ్యర్థులకు ఫిజికల్‌ పరీక్ష ఉంటుంది (టైర్‌-1 ఫలితాల తర్వాత ఈ పరీక్ష ఉంటుంది).

మొత్తం పరీక్షకు కేటాయించిన సమయం రెండు గంటలు మాత్రమే. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు తీసివేస్తారు. 


ప్రిపరేషన్‌ విధానం: ఈ పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులను రెండు కేటగిరీలుగా విభజించవచ్చు. 2020లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేయనున్న (అంటే ఇదే ఏడాది), ఇదివరకు గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన అభ్యర్థులు. షెడ్యూల్‌ను పరిశీలిస్తే గ్రాడ్యుయేషన్‌ లెవల్‌ పరీక్ష నోటిఫికేషన్‌ సెప్టెంబర్‌ 15న రానుంది. దరఖాస్తుకు చివరితేదీ అక్టోబర్‌ 10. అంటే పరీక్ష నవంబర్‌ లేదా డిసెంబర్‌లో ఉండవచ్చు. నవంబర్‌లో ఉందనుకొని సిద్ధం కావడం వల్ల నష్టమేమీలేదు. దీనికి అనుసరించాల్సిన వ్యూహం..న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌: దీనిలో సాధ్యమైనంత తొందరగా ప్రాథమిక అంశాలు పూర్తిచేయాలి. ఇందులో అర్థమెటిక్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. సమాధానాలు గుర్తించడానికి కనీసం ఒక నిమిషం సమయం కూడా ఉండదు. కాబట్టి వేగంగా సమాధానం గుర్తించేలా ప్రిపరేషన్‌ ఉండాలి. కాన్సెప్ట్‌పై పట్టు పెంచుకుంటేనే అది సాధ్యమవుతుంది. అలాగే క్రమం తప్పకుండా బోడ్‌మాస్‌ ఆధారిత ప్రశ్నలను సాధన చేయాలి. లెక్కలను ఎంతవేగంగా సూక్ష్మీకరిస్తామనే అంశం చాలా కీలకం.అగర్వాల్‌ అర్థమెటిక్‌ లేదా ఇతర ప్రచురణలను చదవాలి. 

జనరల్‌ అవేర్‌నెస్‌: ఇందులో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, కరెంట్‌ అఫైర్స్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. టైర్‌-1కు సంబంధించి కీలక విభాగం. తక్కువ సమయంలో ఎక్కువ స్కోర్‌ చేసుకోవచ్చు. ఈ ఏడాది డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు, తమ డిగ్రీ సబ్జెక్ట్‌లో అంశాలు ఎలాగు వస్తాయి. కాబట్టి, వేరే వాటిపై దృష్టి సారించాలి. 


రీజనింగ్‌: ఈ విభాగంలో ఆల్ఫాబెట్‌ బేస్‌డ్‌ పరీక్ష, ర్యాంకింగ్‌, బ్లడ్‌ రిలేషన్స్‌, డైరెక్షన్స్‌, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, పజిల్స్‌, సిలాజిసం తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌ నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి. వీటికి పెద్దగా ప్రాథమిక అంశాలు సిద్ధం కావాల్సిన అవసరం లేదు. నేరుగా పరీక్ష రాయడం మంచిది. అలాగే సమాధానాలను కూడా పరిశీలించాలి. వీటిని ఎంత ఎక్కువ ప్రాక్టీస్‌ చేస్తే అంత పట్టు వస్తుంది. 


ఇంగ్లిష్‌: పాఠశాల స్థాయి నుంచి ఉన్న అంశమే ఇది. అయితే పోటీ పరీక్షల్లో భిన్నంగా ఉంటుంది. కేవలం గ్రామర్‌ బాగా వచ్చినంత మాత్రాన మార్కులు రావు. ఎక్కువ ప్రశ్నలు యూసేజ్‌పై ఉంటాయి. అంటే వివిధ భాషాభాగాలను, పదాలను ఎలా ఉపయోగిస్తున్నాం అనేది కీలకం. నిత్యం ఆంగ్ల దినపత్రికలు చదువుతూ అందులో వచ్చే కొత్త పదాలకు సందర్భోచితంగా అర్థం తెలుసుకోవాలి. అలాగే ఆయా పదాలతో ఉన్న నుడికారాలు, సామెతలను తెలుసుకోవాలి. 


టైర్‌ 2 పరీక్ష విధానం: టైర్‌-1లో ఉత్తీర్ణత సాధించినవారికే ఈ పరీక్ష ఉంటుంది. ఇది కూడా ఆబ్జెక్టివ్‌ తరహా పరీక్షే. అయితే ఇందులో కేవలం అర్థమెటిక్‌, ఇంగ్లిష్‌ మాత్రమే ఉంటాయి. ప్రతి విభాగం నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. మొత్తం పరీక్ష 400 మార్కులకు ఉంటుంది. నెగెటివ్‌ మార్కింగ్‌ కూడా ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. ఈ విభాగానికి సంబంధించి ప్రాథమిక అంశాలు టైర్‌-1లోనే సిద్ధమై ఉంటారు. ఆ పరీక్ష బాగా రాసినవారు ఫలితాల కోసం ఎదురుచూడకుండా, నేరుగా మాక్‌పరీక్షలు రాయాలి. క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ కాన్సెప్ట్స్‌పై పట్టు ఉంటుంది. కాబట్టి టైర్‌-2 పరీక్షకు షార్ట్‌కట్స్‌ నేర్చుకోవచ్చు. 


టైర్‌ 3: ఇది డిస్క్రిప్టివ్‌ పరీక్ష. ఎస్సే, ప్రిసైస్‌, లెటర్‌ రైటింగ్‌ తదితర అంశాలు ఉంటాయి. పరీక్ష తేదీ నాటికి వార్తల్లో నిలిచిన అంశాలకు సంబంధించి ఎస్సేలు సిద్ధమైతే సరిపోతుంది. ఉదాహరణకు ఇప్పుడు ఈ పరీక్ష నిర్వహిస్తే రాదగ్గ ఎస్సేలు.. 1. కరోనా మూలంగా ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టం 2. దేశంలో ప్రస్తుతం ప్రబలుతున్న నిరుద్యోగ సమస్య 3. పౌరసత్వ సవరణ చట్టం.. అయితే పరీక్ష నాటి రాజకీయ, ఆర్థిక, సాంఘిక సమస్యలను అభ్యర్థులు గుర్తించి, వాటికి సిద్ధమైతే సరిపోతుంది. లెటర్‌ రైటింగ్‌ తదితర అంశాలకు ఫార్మాట్‌ ప్రిపేర్‌ అయి, సాధ్యమైనంత తక్కువ పదాల్లో వ్యక్తం చేయాలి. 


నోట్‌-1: గ్రాడ్యుయేషన్‌ స్థాయి పరీక్షలో స్టాటిస్టికల్‌ ఇన్వెస్టిగేటర్స్‌, కంపైలర్స్‌ పోస్టులకు సిద్ధమయ్యేవాళ్లకు మూడు పేపర్లు ఉంటాయి. అర్థమెటిక్‌ ఎబిలిటీ, ఇంగ్లిష్‌తో పాటు మూడో పేపర్‌లో కామర్స్‌/మ్యాథమెటిక్స్‌/స్టాటిస్టిక్స్‌/ఎకనామిక్స్‌ తదితర పేపర్లు ఉంటాయి.

నోట్‌-2: సెంట్రల్‌ పోలీస్‌ ఆర్గనైజేషన్‌లో సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు కేవలం ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌-కాంప్రహెన్షన్‌ మాత్రమే ఉంటుంది. 200 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. 

నెగెటివ్‌ మార్క్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు తీసివేస్తారు

టైర్‌-2 డిస్క్రిప్టివ్‌ పేపర్‌, కాగా టైర్‌-3 స్కిల్‌ టెస్ట్‌. 

ఎంటీఎస్‌ (మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌ రిక్రూట్‌మెంట్‌): ఇందులో కూడా రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్‌ ఆబ్జెక్టివ్‌ తరహాలో, రెండో పేపర్‌ డిస్క్రిప్టివ్‌ పద్ధతిలో ఉంటుంది. పేపర్‌-2 లో ఎస్సే, ప్రిసైస్‌, లెటర్‌ రైటింగ్‌లు ఉంటాయి. పేపర్‌-1లో ఉండే అంశాలు..ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదివే పద్ధతి

సివిల్‌ సర్వీసెస్‌, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, గ్రూప్‌-1, 2 తదితర అత్యున్నత స్థాయి పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు జనరల్‌ స్టడీస్‌లో పట్టుకోసం తప్పక చదవాల్సిన పుస్తకాలు నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ రిసెర్చ్‌ అండ్‌ ఆర్గనైజేషన్‌ ప్రచురించిన పుస్తకాలు. ఆరో తరగతి నుంచి 10+2 స్థాయి వరకు ఉండే పుస్తకాలను అధ్యయనం చేయాలి. అయితే దీనికి ఒక పద్ధతి ఉంది. మొదట ఆరో తరగతి, తర్వాత ఏడో తరగతి, ఆ తర్వాత ఎనిమిది.. ఇలా చదువుతూ వెళ్లడం సరికాదు. అంశలవారీగా ముందు విభజించుకోవాలి. ఉదాహరణకు భౌతిక శాస్త్రంలో కాంతి (లైట్‌) అన్న అంశాన్ని అన్ని తరగతుల్లో ముందు పూర్తి చేయాలి. అంటే ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు, కాంతి అన్న అంశంపై ఇచ్చిన సమాచారాన్ని అధ్యయనం చేసి సొంతంగా నోట్స్‌ చేసుకోవాలి. దీంతో ఆ అంశంపై పూర్తి పట్టు వస్తుంది. అన్ని సబ్జెక్టులకు ఇది వర్తిస్తుంది. ఈ పద్ధతిలో కాన్సెప్ట్‌పై బాగా పట్టు దొరుకుతుంది. ఎస్సెస్సీ భర్తీ చేసే శాఖలు (సీహెచ్‌ఎస్‌ఎల్‌)

ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ హెడ్‌ క్వార్టర్స్‌

బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌

క్యాంటీన్‌ స్టోర్‌ డిపార్ట్‌మెంట్‌ (రక్షణ మంత్రిత్వ శాఖ)

సీబీఐ

సెంట్రల్‌ హిందీ డైరెక్టరేట్‌ (మానవ వనరుల అభివృద్ధి)

సెంట్రల్‌ పాస్‌పోర్ట్‌ ఆఫీస్‌ (విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ)

సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌

కంప్ట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌

కస్టమ్స్‌, ఎక్సైజ్‌, సర్వీస్‌ ట్యాక్స్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ కో ఆపరేషన్‌ అండ్‌ ఫార్మర్స్‌ వెల్ఫేర్‌

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫుడ్‌ అండ్‌ పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ అఫైర్స్‌ (బడ్జెట్‌ డివిజన్‌, ఆర్థిక మంత్రిత్వ శాఖ)

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ అండ్‌ 

ప్రమోషన్‌ (వాణిజ్య మంత్రిత్వ శాఖ)

వైస్‌ ప్రెసిడెంట్‌ సెక్రటేరియట్‌

నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ

రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా


స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ భర్తీ చేసే వివిధ డిపార్ట్‌మెంట్‌లు (గ్రాడ్యుయేట్‌ లెవల్‌)

అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌

ఇన్‌స్పెక్టర్‌ ఎగ్జామినర్‌ (సీబీఈసీ)

ఇన్‌కంట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ (సీబీడీటీ)

అసిస్టెంట్‌ (విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ)

సెంట్రల్‌ ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ (సీబీఈసీ)

ప్రివెంటివ్‌ ఆఫీసర్‌ (సీబీఈసీ)

అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌

అసిస్టెంట్‌ (సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌)

అసిస్టెంట్‌ (ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ హెడ్‌ క్వార్టర్స్‌)

అసిస్టెంట్‌ (రైల్వే మంత్రిత్వ శాఖ)

అసిస్టెంట్‌ (ఇంటెలిజెన్స్‌ బ్యూరో)

అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (సీఎస్‌ఎస్‌)

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (సీబీఐ)

అసిస్టెంట్‌ (ఇతర మంత్రిత్వ శాఖలు)

డివిజనల్‌ అకౌంటెంట్‌ (కాగ్‌)

ఇన్‌స్పెక్టర్‌ (నార్కోటిక్స్‌)

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (నేషనల్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఏజెన్సీ)

స్టాటిస్టికల్‌ ఇన్వెస్టిగేటర్‌

ఇన్‌స్పెక్టర్‌ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పోస్ట్‌)

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ నార్కోటిక్స్‌)

ఆడిటర్‌ (కాగ్‌)

ఆడిటర్‌ (సీజీడీఏ)

ఆడిటర్‌ (సీజీఏ)

ట్యాక్స్‌ అసిస్టెంట్‌ (సీబీఈసీ)

ట్యాక్స్‌ అసిస్టెంట్‌ (సీబీడీటీ)

అకౌంటెంట్‌/జూనియర్‌ అకౌంటెంట్‌ (కాగ్‌)

అకౌంటెంట్‌/జూనియర్‌ అకౌంటెంట్‌ ఆఫీసెస్‌ (సీజీఏ, ఇతరాలు)

సీనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌

కంపైలర్‌ (రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా)


స్థాయినిబట్టి ప్రశ్నించే తీరు 

ఎంటీఎస్‌ పరీక్షకు పదో తరగతి, సీహెచ్‌ఎస్‌ఎల్‌కు ఇంటర్‌, సీజీఎల్‌కు గ్రాడ్యుయేషన్‌ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

అయితే మూడు స్థాయి పరీక్షలకు ఒకే తరహాలో సిలబస్‌ ఉంది. జనరల్‌ అవేర్‌నెస్‌కు అందరూ చదవాల్సింది ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలే. అయితే పరీక్ష స్థాయిని బట్టి ప్రశ్నించే తీరు మారుతుంది. ఉదాహరణకు ఆర్థిక సంస్కరణలు అనే అంశం తీసుకుంటే వేర్వేరు పరీక్షల్లో ఎలా అడుగుతారో పరిశీలిద్దాం..

ఎంటీఎస్‌: భారతదేశంలో ఆర్థిక సంస్కరణలను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు (1991)దేశంలో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి (పీవీ నరసింహారావు)

ఇలా నేరుగా ఎంటీఎస్‌లో ఉంటాయి. ఇదే అంశం నుంచి సీహెచ్‌ఎస్‌ఎల్‌లో వచ్చే ప్రశ్నలు..

ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టడానికి కారణం (ద్రవ్యోల్బణం పెరగడం, విదేశీ మారక నిల్వలు పూర్తిగా తరిగిపోవడం)

ఇలా కొంచెం విశ్లేషణాత్మకంగా ఉంటాయి. అదే గ్రాడ్యుయేషన్‌ పరీక్షలో ఇదే అంశంపై అడిగే తీరు..

ఆర్థిక సంస్కరణల మూలంగా రాజ్యాంగంలోని ఏ విధానం నుంచి భారత్‌ దూరం వెళుతున్నట్లు కనిపిస్తుంది (సామ్యవాదం)

పైవాటిని పరిశీలిస్తే అందరూ చదవాల్సింది ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలే. అయితే పరీక్ష స్థాయిని బట్టి ప్రశ్న కోణాల్లో మార్పు చేసుకోవాలి. సివిల్‌ సర్వీసెస్‌ (ఐఏఎస్‌, ఐపీఎస్‌)కు సిద్ధమయ్యే అభ్యర్థులు కూడా చదవాల్సిన పుస్తకాలు ఇవే. మరింత విశ్లేషణాత్మకంగా ప్రశ్నలు ఆ పరీక్షలోఉంటాయి. అర్థమెటిక్‌, రీజనింగ్‌, ఇంగ్లిష్‌ భాషలకు ఇదే విధానం వర్తిస్తుంది. logo