బుధవారం 08 ఏప్రిల్ 2020
Science-technology - Mar 05, 2020 , 22:34:51

నదులే పునాదులు

నదులే పునాదులు

ఈ నెల 14న ‘నదుల పరిరక్షణ చర్యలకోసం అంతర్జాతీయ దినోత్సవం’ జరుపుకొంటున్నాం. ఈ సందర్భంగా నదీనదాలపట్ల మన బాధ్యతను గుర్తుచేసే చిన్న ప్రస్తావన.

మన భూమిపై మానవాళితోసహా సమస్త జీవజంతు, పక్షి, వృక్షజాతుల ఉనికి అంతా నీటిపైనే ఆధారపడి ఉంటుందన్నది సుస్పష్టం. వర్షం, భూగర్భజలాల తర్వాత ఉన్నంతలో శక్తిదాయకమైనవిగా నదీజలాలనే పేర్కొం టాం. అటువంటి నదుల పరిరక్షణ చర్యల కోసం అంతర్జాతీయంగా ఒక ప్రత్యేక దినోత్సవమే అమలులో ఉందంటే, అవి ఎంతగా కలుషితమై పోయాయో అర్థమవుతున్నది. ప్రతీ సంవత్సరం మార్చి 14వ తేదీని ‘ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ యాక్షన్‌ ఫర్‌ రివర్స్‌'గా జరుపుకొంటున్నాం. ఈ ఏడాది 22వ దినోత్సవం. మనిషి ప్రకృతి విధ్వంసక చర్యల బారిన పడుతున్న వాటిలో నదులు సైతం బలైపోతున్న తీరు అత్యంత దయనీయం.


చెరువు నీటివలె నదుల జలాలు ఒక్కచోట స్థిరంగా ఉండక ఎల్లవేళలా పలు ప్రదేశాలకు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ ప్రత్యేకత వల్లే నదీజలాలకు ఎప్పటికప్పుడు కొత్తదనంతోకూడిన సారవంతమైన జీవశక్తి సమకూరుతుంది. భూమి ఉపరితలంపైన మట్టిపొరలలోంచి ప్రవహిస్తున్న కారణంగానే నదుల నీరు సహజసిద్ధంగా అలా శుద్ధి అవుతుంటుంది. ప్రపంచవ్యాప్తంగానే గత కొన్ని దశాబ్దాల కిందటి నదుల స్థితికి, నేటి పరిస్థితులకు తీవ్ర వ్యత్యాసం కనిపిస్తున్నది. ఒకవైపు పెద్ద, మధ్యతరహా, చిన్న ఆనకట్టల నిర్మాణం, మరోవైపు నదీ ప్రదేశాలు తగ్గుముఖం పడుతుండటం, ఇదే సమయంలో రకరకాల వ్యర్థాలు, మురుగు, రసాయనిక కాలుష్యాలను నదులలోకే మళ్లిస్తుండటం వంటివి నదుల పరిరక్షణలో ఎదురవుతున్న ప్రధాన సవాళ్లు. కాలానుగుణంగా ప్రవహించే నదులతోపాటు హిమపర్వతాలు, భూమి ధ్రువప్రాంతాల (అర్కిటిక్‌, అంటార్కిటికా)లోని మంచు కరగడం వల్ల ఏర్పడే జీవనదులనూ వివిధరకాల సమస్యలు, సంక్షోభాలనుంచి రక్షించుకోవలసి ఉంది.


ఋతుపవనాలు సవ్యంగా ఉన్నంత కాలం నదులపై ఆనకట్టల అవసరం పెద్దగా కలుగలేదు. వర్షాకాలంలో వానలు పడక, కాలం కాని కాలంలో అతివృష్టి ఏర్పడి, వరదలు సంభవించి నదులు పొంగిపొర్లుతున్న పరిస్థితులను ఈమధ్య చూస్తున్నాం. ఆనకట్టల అవసరం పెద్ద ఎత్తున ఏర్పడుతున్న తరుణంలో నదుల సహజ సౌందర్యం చెడకుండానూ చూడవలసి ఉంటుంది. జీవజాతులకు నీటి అవసరాలు తీర్చే జలచక్రంలో ప్రధానపాత్ర పోషిస్తున్న నదుల పరిరక్షణకు ఈ ప్రత్యేక దినోత్సవాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇందుకు ప్రభుత్వాలు, స్వచ్ఛందసంస్థలతోపాటు ప్రజలంతా దీనిని బాధ్యతగా చేపట్టగలగాలి. దీనికోసం అన్ని రకాల చర్యలకూ ఉపక్రమించి, సాధ్యమైనంత వేగవంగా నదీమతల్లులను కాపాడుకొందాం.


logo