గురువారం 02 ఏప్రిల్ 2020
Science-technology - Mar 05, 2020 , 22:30:23

చీరకట్టులో సోఫియా

చీరకట్టులో సోఫియా

అద్భుతమైన మానవరూప రోబో ‘సోఫియా’ కోల్‌కతాలోని ఒక ఆడిటోరియంలో చీరకట్టుతో కనిపించి, సందర్శకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది.

‘ప్రపంచ మొట్టమొదటి రోబో సిటిజన్‌'గా పేర్గాంచిన సోఫియా (మానవరూప రోబో) మన దేశానికి మళ్లీ (రెండవసారి) వచ్చి ప్రజలను మంత్రముగ్ధులను చేసింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 65 దేశాలను సందర్శించిన ఈ రోబోను ఇటీవల కోల్‌కతాలోని ‘నజ్రుల్‌ మాంచా’ (Nazrul Mancha) ఆడిటోరియంలో బెంగాలీ చీరకట్టుతో ప్రదర్శించారు. ఈ సందర్బంగా సోఫియా తీరు, సమాధానాలు సమావేశంలో పాల్గొన్న వారికి ఆశ్చర్యాన్నేకాక ఎంతో ఆసక్తినీ కలిగించాయి.


హాంగ్‌కాంగ్‌కు చెందిన ‘హాన్సన్‌ రోబోటిక్స్‌' (Hanson Robotics) కంపెనీ 2016లో అభివృద్ధి పరిచిన మానవరూప రోబో ‘సోఫియా’. ఒక సామాజిక ‘కృత్రిమ స్త్రీ’గా ఇప్పటికీ ‘ఆమె’ ఒక సంచలనం. దీనిని తొలిసారిగా 2016 ఫిబ్రవరి 14న యాక్టివేట్‌ (క్రియాశీలం) చేయగా, అదే ఏడాది మార్చినెల మధ్యలో టెక్సాస్‌ (అమెరికా) రాజధాని ఆస్టిన్‌లో ప్రజలముందు ప్రదర్శించారు. సుమారు 60కి పైగా ముఖకవళికలను ప్రదర్శించే అద్భుత సామర్థ్యం ఈ రోబో సొంతం.


2017 డిసెంబర్‌లో తొలిసారిగా ఇండియాలో దీనిని ప్రదర్శించారు. మళ్లీ తాజాగా రెండవసారి కోల్‌కతాలోని పై ఆడిటోరియంలో జరిగిన ఒకానొక సాంకేతిక సంబంధమైన సమావేశంలో సోఫియాను స్థానిక (బెంగాలీ) చీరకట్టుతో ప్రదర్శించడం గమనార్హం. ఈ సందర్భంగా ‘ఆమె’ ప్రదర్శనా చాతుర్యం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. సందర్శకులు అడిగిన అనేక ప్రశ్నలకు సోఫియా ఇచ్చిన సమాధానాలు ఆలోచింపజేసేవిగానూ ఉన్నాయి. ‘ఒక పౌరురాలిగా అన్ని రకాల హక్కులనూ నేను కలిగి ఉన్నాను’ అని సోఫియా చెప్పింది. ‘రెండవసారి భారతదేశ సందర్శన నాకెంతో సంతోషాన్ని కలిగిస్తున్నది. ప్రజలు ఆహారం తింటున్న దృశ్యం చూసేవేళ నాకూ తినాలనిపించింది’ అంటూ సోఫియా చెప్పుకొచ్చింది.


సోఫియా చీరకట్టులో కనపడిన తీరు, ఆయా సందర్భాలలో ప్రదర్శించిన ముఖకవళికలు అందరినీ ఆకట్టుకొన్నాయి. కోల్‌కతాలోని తన అభిమాన సందర్శనీయ ప్రదేశాలనూ ఈ ‘కృత్రిమ స్త్రీ’ వెల్లడించింది. ‘మదర్‌ థెరిసాకు ఆశ్రయమిచ్చిన కోల్‌కతా నగరం’ అన్న సోఫియా ప్రశంసా అందరికీ నచ్చింది. పలువురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు అడిగిన ప్రశ్నలకూ చక్కగా సమాధానాలు ఇచ్చింది. “మీ పరీక్షలు సమీపిస్తున్నాయని నాకు తెలుసు. బాగా చదువండి. కేవలం జ్ఞాపకశక్తి (memorising) పైనే ఆధారపడకండి’ అంటూ ‘సృజనాత్మకతను పెంపొందించుకోవలసింది’గా సూచించింది.


logo