సోమవారం 30 మార్చి 2020
Science-technology - Mar 03, 2020 , 22:57:22

అగ్గువకు ‘కంపెనీ’ ఇస్తాం

అగ్గువకు ‘కంపెనీ’ ఇస్తాం

హైదరాబాద్‌లో చిన్న కంపెనీ పెట్టాలను కుంటున్నారా? సొంతంగా స్టార్టప్‌ ప్రారం భించాలనుకుంటున్నారా? ఇంటి అద్దెలు, ఫర్నీచర్‌, కరంట్‌ బిల్‌, ఇలా ఎన్నో వ్యయ ప్రయాసలు భరించలేమని భయపడుతున్నారా?ఇకపై ఆ భయం అవసరమే లేదు. మీకు ఎన్ని సీట్లు కావాలంటే అన్ని సీట్లు, ఎంతంటే అంత స్థలం ఫర్నీచర్‌తో సహా ఇవ్వడానికి కొన్ని కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా అక్కడికెళ్లి పని చేసుకోవడమే! దీన్నే ‘కో-వర్కింగ్‌ ఆఫీస్‌ స్పేస్‌' అంటారు. విదేశాల్లో ఉన్న ఈ కల్చర్‌ ఇప్పుడిప్పుడే హైదరాబాద్‌లోనూ వేళ్లూనుకుంటు న్నది. మీకు స్థలం ఇవ్వడానికి ఎన్నో కంపెనీలు మరెన్నో ఆఫర్లతో రెడీగా ఉన్నాయి.

హరీష్‌ ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. కొన్నేండ్లు ఓ ప్రముఖ కంపెనీలో పనిచేశాడు. ఓ చిన్న కారణం చూపి అతడిని ఉద్యోగంలోంచి తీసేశారు. సొంతగా కంపెనీ పెట్టాలనుకున్నాడు. కొండాపూర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. దానికి ఆరు నెలల అడ్వాన్స్‌, ఏడాదికి 10 శాతం అద్దె పెరుగుదల అని భవన యజమానితో అగ్రిమెంట్‌ రాసుకున్నాడు. ఫర్నీచర్‌ తయారు చేయించాడు. ఆఫీస్‌ మెయింటనెన్స్‌, ఇంటర్నెట్‌ ఇలా అన్నీ సమకూర్చుకునే సరికి తలప్రాణం తోకకు వచ్చింది. కంపెనీ ప్రారంభానికి ముందే చేతిలో చిల్లిగవ్వ లేకుండా అయ్యింది. అప్పు చేసి ఎలాగోలా కంపెనీని నెట్టుకొచ్చాడు. తాను సంపాదించేదాంట్లో సగానికిపైగా అద్దె, ఇతర బిల్లుల చెల్లిం పునకే సరిపోయేది. కొన్నాళ్లకు కంపెనీ నష్టాల్లో పడిపోయింది. ఫర్నీచర్‌, కంప్యూటర్స్‌ సగం ధరకే అమ్మేశాడు. అప్పుల్లో కూరుకుపోయాడు. నగరంలో చిన్న చిన్న కంపెనీలు పెట్టి హరీష్‌లా ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొన్నవారే. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. మీరు కంపెనీ పెట్టాలనుకుంటే గది అద్దెకు తీసుకోవాల్సిన అవసరం లేదు. కరంటు బిల్‌, ఆఫీస్‌బాయ్‌, మెయింటనెన్స్‌ ఇలా ఏ పనీ చేయాల్సిన అవసరం లేదు. సంబంధిత కంపెనీకి ఒక్క ఫోన్‌ చేస్తే చాలు సీటు చొప్పున మీకు స్థలాన్ని లీజుకిస్తారు. ఇందులో ఎన్నో సౌకర్యాలు కూడా ఉన్నాయి.


కో వర్కింగ్‌ స్పేస్‌ 

ఒకే భవనంలో వందలాది కంపెనీలు కార్యకలాపాలు జరుపుతాయి. దీన్నే కో వర్కింగ్‌ స్పేస్‌ అంటారు. కో వర్కింగ్‌ స్పేస్‌లో భాగంగా సీటును రిజర్వ్‌ చేసుకున్నవారు ఇంటర్నెట్‌, కరెంట్‌ బిల్‌, ఏసీ, కాన్ఫరెన్స్‌ రూం, పార్కింగ్‌ ప్లేస్‌, వాటర్‌, వాచ్‌మన్‌, ఆఫీస్‌బాయ్‌ ఇలా అన్నింటినీ పొందవచ్చు. కేవలం సీటుకు కేటాయించిన ధరను కడితే చాలు. అంటే ఆఫీస్‌ను వాళ్లు ఇస్తారు. మనం అక్కడకు వెళ్లి మన పని మనం చేసుకుంటే సరిపోతుందని అర్థం.


ఎవరికి ప్రయోజనం?

ఇప్పుడిప్పుడే కంపెనీలు ప్రారంభించేవారికి, చిన్న చిన్న కంపెనీల నిర్వహణకు కోవర్కింగ్‌ ఆఫీస్‌ స్పేస్‌ చాలా ఉపయోగకరం. ఎందుకంటే ముందుగా పెద్దమొత్తంలో అడ్వాన్స్‌ చెల్లించాల్సిన పని లేదు. మరే ఇతర పెట్టుబడి అవసరం ఉండదు. ఒకవేళ అప్పటికప్పుడు కంపెనీ మూసుకొని వెళ్లాల్సి వచ్చినా పెద్దగా నష్టం ఉండదు. ఈవిధానం వల్ల ఔత్సాహిక కంపెనీస్థాపకులకు లాభం చేకూరుతుంది. అంతేకాకుండా కోవర్కింగ్‌ ఆఫీస్‌ స్పేస్‌ నిర్వాహకులకు సైతం లాభం జరుగుతుంది. ఒక స్థలాన్ని ఓ కంపెనీకి లీజుకు ఇస్తే నెలనెలా కొంత మొత్తం మాత్రమే వస్తుంది. అదే స్థలాన్ని పలుకంపెనీలకు సీట్ల చొప్పున లీజుకిస్తే అధిక లాభం.  ఈ విధానం వల్ల ఔత్సాహిక కంపెనీ ప్రారంభకులకు, కోవర్కింగ్‌ ఆఫీస్‌ స్పేస్‌ యజమానులకు ఇరువురికీ లాభం చేకూరుతుంది.


ఏమేం సౌకర్యాలు?

కోవర్కింగ్‌ ఆఫీస్‌ స్పేస్‌ కోసం ఆధార్‌కార్డు, కంపెనీ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, పాన్‌ కార్డు, జీఎస్టీ సర్టిఫికెట్‌ తప్పనిసరి. చిన్న స్టార్టప్‌లకు ఆధార్‌ ఒక్కటి సరిపోతుంది. కో వర్కింగ్‌ స్పేస్‌లో భాగంగా ఒక సీటు నుంచి వెయ్యి సీట్ల వరకు బుక్‌ చేసుకోవచ్చు. ఏసీ, విద్యుత్‌, ఆఫీస్‌ మెయింటెనెన్స్‌, పార్కింగ్‌, వాటర్‌, ఇంటర్నెట్‌, కేఫ్‌, మీటింగ్‌ రూం, కాన్ఫరెన్స్‌ రూం, వెయిటింగ్‌ రూం సౌకర్యాలుంటాయి. మరికొన్ని కో వర్కింగ్‌ కంపెనీలు పబ్‌, జిమ్‌, ప్లేయింగ్‌, ప్రేయర్‌ రూమ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్‌, రెస్టారెంట్స్‌ ఇలా ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నాయి.


మూడు రకాల ప్యాకేజీలు

హార్డ్‌ డెస్క్‌: హార్డ్‌ డెస్క్‌లో భాగంగా రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేసుకునే వీలుంటుంది. 

డెడికేటెడ్‌ డెస్క్‌: ఇందులో రోజులో ఎన్ని గంటలైనా భవనంలో ఎక్కడైనా పనిచేసుకునే వెసులుబాటు ఉంటుంది. దీనికి గాను ఒక్కో సీటుకు నెలకు రూ.8 వేలు చెల్లించాల్సి ఉంటుంది.

ప్రైవేట్‌ క్యాబిన్‌: ఇందులో నిర్ణీత స్థలంలో క్యాబిన్‌ ఏర్పాటు చేసిస్తారు. సీటుకు నెలకు రూ. 10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే కో వర్కింగ్‌ స్పేస్‌ తీసుకున్న 

వారు సంస్థ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో మీటింగ్‌ రూం, ప్లేయింగ్‌ రూమ్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.


ఎంత చెల్లించాలి?

ఇది వరకు కో వర్కింగ్‌ స్పేస్‌ అనేది విదేశాలకు మాత్రమే పరిమితం. కానీ గత ఏడాది, రెండేళ్లుగా హైదరాబాద్‌లో సైతం ఈవిధానం విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్న గచ్చిబౌలి, కొండాపూర్‌, మాదాపూర్‌, హైటెక్‌ సిటీ ఏరియాల్లో 50కి పైగా కోవర్కింగ్‌ స్పేస్‌ కంపెనీలు ఉన్నాయి. ఇవి విభిన్న ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి.  కో వర్కింగ్‌ స్పేస్‌ విధానంలో కనిష్టంగా ఒక రోజు నుంచి గరిష్టంగా ఏడాది వరకు సీట్‌ను లీజుకు తీసుకోవచ్చు. ఒక సీటుకు రోజుకు రూ.150 చార్జి చేస్తారు. నెలకైతే రూ.4 వేల నుంచి ప్యాకేజీల వారీగా రూ.10 వేల వరకు చార్జి చేస్తారు.  


ఆకట్టుకునే వాతావరణం

ఒక కంపెనీలో పనిచేసేవారికి ఒకేరకమైన యూనిఫాం. రోజూ వాళ్లమొఖాలు వాళ్లు మాత్రమే చూసుకోవాలి. కానీ కో వర్కింగ్‌ ఆఫీస్‌ స్పేస్‌లో స్నేహపూరిత వాతావరణం ఎక్కువ. పలురకాల కంపెనీలు ఒకే దగ్గర ఉండడం వల్ల కొత్త స్నేహితులు పరిచయమయ్యే అవకాశం ఉంది. విభిన్న మనస్కులు ఒకే దగ్గర ఉండడం వల్ల కొత్త ఐడియాలు పుట్టుకొచ్చే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా ఆకట్టుకునే వాతావరణం కూడా ఇక్కడ సిద్ధంగా ఉంటుంది. విభిన్న రకాల ఇంటీరియర్‌తో ఆఫీస్‌లను రెడీ చేసి ఉంచుతారు. పలు కోవర్కింగ్‌ కంపెనీలు ప్రత్యేకమైన ఆఫర్లు కూడా అందిస్తున్నాయి.

...? పడమటింటి రవికుమార్‌


కో వర్కింగ్‌ ఆఫీస్‌ స్పేస్‌కు హైదరాబాద్‌లో చాలా డిమాండ్‌ ఉంది. ఎక్కువ శాతం చిన్న చిన్న కంపెనీలే కో వర్కింగ్‌ స్పేస్‌ కావాలని మమ్మల్ని సంప్రదిస్తున్నాయి. సింగిల్‌ డెస్క్‌ నుంచి వందలాది డెస్క్‌లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. స్టార్టప్స్‌ పెట్టాలనుకునే వారికి కో వర్కింగ్‌ ఆఫీస్‌ స్పేస్‌ మంచి వేదిక. మా దగ్గర 11 నెలల అద్దె చెల్లిస్తే 12 నెలలు ఉండొచ్చు. ఇలాంటి మరెన్నో ఆఫర్లు ఉన్నాయి. కార్యాలయ నిర్వహణ, భవన నిర్వహణ అన్నీ మేం చూసుకుంటాం. కేవలం మీరొచ్చి పనిచేసుకొని వెళ్తే సరిపోతుంది. వివరాలకు 8977597049లో సంప్రదించవచ్చు.

- నిఖిల్‌ దూబే, సీఈవో, ఇన్‌క్లూడ్‌ స్పేస్‌, కొండాపూర్‌


logo