బుధవారం 08 ఏప్రిల్ 2020
Science-technology - Mar 03, 2020 , 22:47:21

కరోనా.. ఆన్‌లైన్‌లో ఇవి చేయకండి!

కరోనా.. ఆన్‌లైన్‌లో ఇవి చేయకండి!

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్‌(కొవిడ్‌-19) వణికిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో కూడా దీనికి సంబంధించిన కేసు ఒకటి నమోదైంది. అయితే దీనికి సంబంధించి పుకార్లు మాత్రం ఆన్‌లైన్‌లో చాలానే హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆన్‌లైన్‌లో దీనికి సంబంధించి తప్పుడు సమాచారం అందుబాటులో ఉంది. కరోనా వైరస్‌ వ్యాధికి సంబంధించి మీరు ఆన్‌లైన్‌లో చేయకూడని పనులు ఇవే!

కరోనా వైరస్‌ నుంచి మిమ్మల్ని కాపాడేందుకు ప్రత్యేకమైన మాస్క్‌ లేవీ అందుబాటులో లేవు. కాబట్టి ఆన్‌లైన్‌లో కరోనా వైరస్‌ నుంచి కాపాడే మాస్క్‌లు అంటూ ఏవైనా కనిపిస్తే వెంటనే నమ్మేసి కొనేయకండి. 

కరోనా వైరస్‌కు ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి మందునూ కనిపెట్టలేదు. కాబట్టి కరోనాకు మందు కనిపెట్టాం అంటూ ఏవైనా యాడ్స్‌ కనిపించినావాటిని కొనుగోలు చేయకండి. మీ డబ్బును కాజేసేందుకు వారు వేసిన పథకం మాత్రమే.

కరోనా వైరస్‌కు సంబంధించి ఇంటర్నెట్లో కనిపించే సమాచారంలో చాలా వరకు అసత్యాలే. కాబట్టి మీరు ఏ వెబ్‌సైట్లో పడితే ఆ వెబ్‌సైట్లో కరోనా వైరస్‌కు సంబంధించిన సమాచారాన్ని వెతక్కండి. అందులో ఉన్న సమాచారం కూడా అసత్యం అయ్యే అవకాశం ఉంది. మీకు దగ్గర్లో ఉండే వైద్యులను సంప్రదించి దీనికి సంబంధించిన సమాచారాన్ని, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకోండి.

కరోనా వైరస్‌కు సంబంధించి ఎటువంటి అధికారిక టెస్ట్‌ కిట్స్‌ కూడా లేవు. కాబట్టి మీకు ఇటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్‌కు వెళ్లండి. అంతే కానీ కిట్‌ కొనుక్కుని ఇంట్లోనే పరీక్షించుకుందాం లాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఎంతోమంది ఆన్‌లైన్‌లో ఫేక్‌ కరోనా వైరస్‌ కిట్లను విక్రయిస్తున్నారు.

కరోనా వైరస్‌కు సంబంధించి వాట్సాప్‌ మెసేజ్‌లు, టిక్‌టాక్‌ వీడియోల ద్వారా నకిలీ సమాచారాన్ని వైరల్‌ చేస్తున్నారు. ఇటువంటి విషయాల్లో జాగ్రత్త.

సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ ఉన్న వారు కరోనాకు సంబంధించి నకిలీ సమాచారాన్ని అందిస్తునారు. వాటిని నమ్మి ఇబ్బందుల పాలుకావద్దు!

ఆన్‌లైన్‌లో మీకు కరోనా వైరస్‌ గురించి ఏవైనా వార్తలు కనిపించినా, లేకపోతే మీకు వాట్సాప్‌లో ఎవరైనా వాటిని పంపించినా వెంటనే వాటిని షేర్‌ చేయకండి. ధ్రువీకరించబడని వార్తలు మిగిలిన వారిలో భయాన్ని పెంచుతాయి. ఫేక్‌ న్యూస్‌ స్ప్రెడ్‌ చేస్తే ప్రభుత్వం శిక్ష విధించేందుకు సిద్ధమైంది జాగ్రత్త.

సైబర్‌ నేరగాళ్లు కరోనాను క్యాష్‌ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర ప్రముఖ సంస్థల పేరిట ఈ-మెయిల్స్‌ పంపించి మీ వద్ద నుంచి డబ్బులు కాజేయాలని ప్రయత్నిస్తారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో కూడా జాగ్రత్త వహించండి.


logo