గురువారం 02 ఏప్రిల్ 2020
Science-technology - Feb 28, 2020 , 11:51:48

జంతుశాస్త్రం : గబ్బిలాల వైరస్‌లు ఎందుకంత ప్రమాదకరం?

జంతుశాస్త్రం : గబ్బిలాల వైరస్‌లు ఎందుకంత ప్రమాదకరం?

ప్రస్తుత ‘కొవిడ్‌-2019’ (మానవ కరోనా వైరస్‌: 2019-nCoV) విజృంభణతో శాస్త్రవేత్తలకు అనేక రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాటిలో భాగంగానే అసలు ‘గబ్బిలాల వైరస్‌లు ఎందుకింత ప్రమాదకరంగా ఉంటున్నాయన్న’ కోణంలో వారు పరిశోధనలు సాగిస్తే, ఆసక్తికరమైన విషయాలు వెల్లడైనాయి.


గత కొన్నేండ్లుగా ప్రపంచవ్యాప్తంగా విజృంభించిన సార్స్‌ (SARS), మెర్స్‌ (MERS), ఎబోలా (Ebola), మార్బర్గ్‌ (Marburg) వంటి కొన్ని అత్యంత ప్రాణాంతక అంటురోగాల విషక్రిములు (viruses) అన్నీ గబ్బిలాలనుంచి పుట్టినవే కావడం గమనార్హం. ‘ఈ జంతువులనుండి సంక్రమించే విషక్రిములు (వైరస్‌లు) ఇంత ఘోరంగా (వేగంగా, తీవ్రస్థాయిలో మానవుల ప్రాణాలు తీసేలా) ఎందుకుంటున్నాయి?’ అన్న దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగాయి. ఫలితంగా, ఈ వైరస్‌ల (విషక్రిముల) పట్ల గబ్బిలాలలో ‘తీవ్రస్థాయిలో ప్రతిస్పందించగల రోగనిరోధక వ్యవస్థ’ ఉన్నట్టు తేలింది. గబ్బిలాలను ఆశ్రయించిన వైరస్‌లు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, దీంతో అవి సగటు (తక్కువస్థాయి) రోగనిరోధక వ్యవస్థతోకూడిన, మానవులు వంటి క్షీరదాలలోకి ప్రవేశించిప్పుడు ‘తీవ్ర ప్రాణాంతక ఉపద్రవాన్ని’ సృష్టిస్తున్నాయని వారు కనుగొన్నారు. 


బర్కిలీ (అమెరికా) నగరంలోని ‘యూనివర్సిటీ ఆఫ్‌ క్యాలిఫోర్నియా’కు చెందిన పరిశోధకులు ఈ తాజా అధ్యయనం నిర్వహించి పై ఫలితాన్ని సాధించారు. ప్రత్యేకించి మనుషులకు సంక్రమించిన కరోనా వైరస్‌లకు మూలమైన గబ్బిలాలలోని ‘రోగనిరోధక వ్యవస్థ’ ఈ తరహా వైరస్‌లకు శాశ్వత ప్రోత్సాహకారిగా ఉంటున్నట్టు వారు గుర్తించారు. ఇవే విషక్రిములు వాటి నుండి మానవులు వంటి క్షీరదాలలోకి వ్యాపించినప్పుడు అంతే వేగంగా నిరోధించగల వ్యవస్థలు ఉండటం లేదు. దాంతో అత్యల్ప సమయంలోనే అవి అసాధారణ రీతిలో పెరిగిపోతున్నట్టు వారు పేర్కొన్నారు. మరోవైపు వివిధ కారణాలవల్ల గబ్బిలాల నివాసాలకు అంతరాయం కలుగుతున్నదని, దీంతో వాటిపై ఒత్తిడి పెరిగి పోతున్నదని వారన్నారు. ఈ కారణంగా మరింత ఎక్కువ స్థాయిలో గబ్బిలాలనుండి లాలాజలం, మలమూత్రాలు విడుదలవుతుండడంతో వాటిద్వారా వైరస్‌లు ఇతర జంతువులకు పాకుతున్నట్టు వారు తెలిపారు. గబ్బిలాల పరిశోధనకే ఏర్పడిన ప్రాజెక్ట్‌ ‘బ్యాట్‌ వన్‌ హెల్త్‌' (Bat One Health Research Network: BOHRN) ఈ జంతువులు నివాసప్రాంతలను నష్టపోవడానికి, వాటి నుండి వ్యాపించే వైరస్‌లు ఇతర జంతువులు, మానవులలోకి వ్యాపించడానికి మధ్యగల లంకెను బహిర్గత పరిచింది. ఈ తాజా పరిశోధన ఈలైఫ్‌ (eLife) ఆన్‌లైన్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.logo
>>>>>>