శనివారం 29 ఫిబ్రవరి 2020
మన మెట్రో.. ఘనకీర్తి

మన మెట్రో.. ఘనకీర్తి

Feb 13, 2020 , 23:02:22
PRINT
మన మెట్రో.. ఘనకీర్తి

‘మన మెట్రో-మన ఆత్మగౌరవం’గా ప్రజల హృదయాలలో ఆత్మీయస్థానం సంపాదించుకొన్న ‘హైదరాబాద్‌ మెట్రో’ ఇటీవలె తొలిదశను దాదాపు పూర్తి చేసుకొంది. జంటనగరాల ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేలా, మరిన్ని కారిడార్‌లతో విస్తరింపజేయడానికి మలిదశ నిర్మాణం వైపు మన ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఈ నేపథ్యంలోనే ‘మన మెట్రో’పై ప్రత్యేక కథనం చదువండి.

  • ప్రపంచస్థాయికి ప్రజారవాణా వ్యవస్థ
  • పలు జాతీయ, అంతర్జాతీయ రికార్డులు
  • విశ్వనగరానికి మరపురాని మణిహారం

రెండు రాష్ర్టాల తెలుగువారు తమ ఇష్ట ప్రదేశమైన హైదరాబాద్‌లో మునుపెన్నడూ లేని హైటెక్‌/ ఇంటెలిజెన్స్‌ (మేధో) సాంకేతికతతో కూడిన ‘మెట్రో రైలు యానాన్ని’ గత కొన్నాళ్లు (2017 డిసెంబర్‌ 29నుంచి)గా సాగిస్తున్నారు. ఇవాళ ఇది ఎంత సౌలభ్యమందంటే, చాలామందిలో ఎవరిని అడిగినా ‘దానినే’ తొలి ప్రాధాన్యంగా ఎంచుకొంటున్నారు. కారణం, అందరికీ తెలిసిందే. సిగ్నళ్లు, ట్రాఫిక్‌, దూరభారాల బాధలు లేకుండా ఎంతో వేగవంతంగా గమ్యస్థానానికి చేరుకోగలగడమే. కాగా, ఇటీవలె (7వ తేదిన) రెండవ కారిడార్‌ (జేబీఎస్‌-ఎంజీబీఎస్‌) ప్రారంభంతో ఈ ప్రాజెక్టు తొలిదశ (ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు కొద్దిదూరం మినహా) దాదాపు పూర్తయినట్లే. ‘నాగోల్‌-రాయదుర్గం, ఎల్బీనగర్‌-మియాపూర్‌, జేబీఎస్‌-ఎంజీబీఎస్‌' (మూడు) మార్గాల్లో కలిపి మొత్తం 69 కి.మీ. దూరం అందుబాటులోకి వచ్చింది. సాంకేతిక పరిజ్ఞానంలో ‘హైదరాబాద్‌ మెట్రో’ ఢిల్లీ మెట్రోకంటే కూడా ఎంతో గొప్పదన్న ప్రశంసలూ వచ్చాయి. 


ఆధునిక ప్రపంచం అభివృద్ధిలోను, మానవాళి అవసరాలను తీర్చడంలోనూ అత్యంత ముఖ్యపాత్రను పోషిస్తున్నది రవాణా రంగం. ‘ఎక్కడివాళ్లు అక్కడే’ ఉంటే అంతా గప్‌చుప్‌గా ఉండొచ్చు. కానీ, ప్రగతి వేగం పుంజుకోదు. అందుకే, పొద్దున లేచింది మొదలు ప్రతీ ఒక్కరికీ ‘ఎక్కడికో ఒక దగ్గరకు, ఎంతో కొంత సమయం పాటు’ ప్రయాణం తప్పనిసరైంది. కొన్ని దశాబ్దాల కిందటివరకు మన హైదరాబాద్‌ మహానగరంలోనూ ఎడ్లబండ్ల ప్రయాణాలు జరిగినట్లు చరిత్ర చెబుతున్నది. ఎద్దులు, గుర్రాలు తదితర పెంపుడు జంతువులతో నడిచే బండ్లనుండి మనిషియానం గత కొన్ని దశాబ్దాలుగా యాంత్రిక వాహనాలపైకి చేరింది. ప్రపంచంలో ఇప్పటికే ఎంతో ముందున్న న్యూయార్క్‌, హాంగ్‌కాంగ్‌, లండన్‌, టోక్యో, మాస్కో, సియోల్‌, సింగపూర్‌, ప్యారిస్‌, స్టాక్‌హోమ్‌, ఏథెన్స్‌ వంటి మహానగరాలలో వేగవంతమైన, అత్యధికులను చేరవేసే రవాణా (Rapid transit or mass rapid transit) విధానాలు (హెవీ రైల్‌, మెట్రో, సబ్‌వే, ట్యూబ్‌, యు-బాహ్న్‌ లేదా భూగర్భం) అందుబాటులోకి వచ్చాయి. మన జంటనగరాలలో మెట్రో ప్రాజెక్ట్‌వల్ల ‘పర్యావరణానుకూలమైన, ఆధునాతన స్వయంచలన విద్యుత్‌ వాహనాలు’గా రైల్‌కార్లు అందుబాటులోకి వచ్చాయి. 


ప్రజారవాణాగా ప్రారంభమైన ‘హైదరాబాద్‌ మెట్రో’ సుమారు 26 నెలల్లోనే కేవలం మూడు మార్గాలలోనే రోజుకు 4 లక్షలకు పైగా ప్రయాణీకులను చేరవేస్తున్నది. దీన్నిబట్టి, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించుకొంటూ, ఎంతోమంది విలువైన సమయాన్ని ఆదాచేసుగలుగుతున్నాం. అతిత్వరలోనే తెలంగాణ రాష్ట్ర కిరీటంలోని అద్భుత మణులలో ఒకటిగా ఒదిగిపోయిన ‘హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు’ ప్రస్తుత తొలిదశ నాటికే పలు ప్రతిష్ఠాత్మక ఘనతలను సొంతం చేసుకోవడం విశేషం. తెలుగువారికి అందుబాటులోకి వచ్చిన ఈ తెలివైన (ఇంటెలిజెంట్‌) రవాణా దేశంలోనే (‘ఢిల్లీ మెట్రో’ తర్వాత) రెండో అతిపెద్దది (69.2 కి.మీ.పొడవు)గా రికార్డును సృష్టించింది. అలాగే, ప్రపంచంలోనే అతిపెద్ద ‘పీపీపీ’ (publicprivate partnership) ప్రాజెక్టు’గానూ దీనికి గుర్తింపు లభించింది. దీనితోపాటు మొత్తం 2,599 మెట్రో పిల్లర్లను నిర్మించిన మొట్టమొదటి కంపెనీగానూ ‘ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైల్‌' (హైదరాబాద్‌) అరుదైన మరొక ప్రపంచ రికార్డునూ సొంతం చేసుకొన్నట్టు సంబంధిత అధికారులు ప్రకటించారు. 


మొత్తం ప్రాజెక్టులోనే ‘అత్యంత ఎత్తయిన మెట్రో స్టేషన్‌'గా ‘జేబీఎస్‌-పెరేడ్‌ గ్రౌండ్‌' రికార్డు స్థాయిలో అయిదంతస్థులతో రూపొందింది. 3 లక్షల చదరపు అడుగుల మేర విస్తరించిన ‘ఎంజీబీఎస్‌ ఇంటర్‌చేంజ్‌ మెట్రోస్టేషన్‌' వివిధ ప్రత్యేకతలతో ‘దేశంలోనే అతిపెద్దది’గానూ అధికారులు తెలిపారు. ఒక రైలుమార్గం మీదుగా మరొకటి వెళ్లేలా మూడు స్థాయిలలో, మూడు కారిడార్‌ ల్యాండ్‌లు ఏర్పడ్డాయి. వీటి నడుమ అంతరమార్పుల కోసం (interline exchange) స్టేషన్‌హౌజ్‌లను అరుదైన పద్ధతిలో నిర్మించారు. ప్రస్తుతం రోజుకు కనీసం 4 లక్షలమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్న మన ఈ ‘స్వయంచలిత మెట్రో వ్యవస్థ’ (automated metro network) రానున్న కొద్దికాలంలోనే 10 లక్షలమందిని చేరవేయవచ్చునని అంచనా. ఢిల్లీ మెట్రోకంటే కూడా మెరుగైన, ఆధునాతనమైన ఆటోమేటిక్‌ వ్యవస్థలు ‘హైదరాబాద్‌ మెట్రో’ సొంతమని వారంటున్నారు. కియోలిస్‌ (Keolis Hyderabad Mass Rapid Transit System Pvt Ltd: KHMRTS) సాంకేతిక పనితనంతో రానున్న కాలంలో ప్రపంచస్థాయి (world-class) మెట్రోగా దీనిని తీర్చిదిద్దనున్నట్టు ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎడ్వర్డ్‌ థామస్‌ పేర్కొన్నారు. 


‘క్యూఆర్‌' సంకేతాల ఆధారంగా పనిచేసే ‘ఈ-టికెటింగ్‌' వ్యవస్థ (QR code-based ticketing) నుకూడా దేశంలోనే తొలిసారిగా మన మెట్రోలోనే ప్రవేశపెట్టడం విశేషం. ఈ విధానంలో ప్రయాణికులు ముందుగానే మూడు రకాల టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు. సింగిల్‌ (ఒకే దఫా), రిటర్న్‌ (తిరుగు రవాణా)కోసం ఒకటి, లేదా రెండు మార్గాలకు, ట్రిప్‌ పాస్‌, స్టోర్‌ వ్యాల్యూ పాస్‌లుగానూ దీనిని వినియోగించుకోవచ్చు. దీనివల్ల టికెట్‌ లేని ప్రయాణాలకు పూర్తిగా చెక్‌ పడినట్లే. ‘ఈ రకమైన టికెటింగ్‌ విధానానికి ప్రయాణికులనుండి అనూహ్య స్పందన లభిస్తున్నదని’ మెట్రో అధికారులు తాజాగా వెల్లడించారు. ఇటీవలి సోమవారం (10వ తేదిన) ఒక్క సాధారణ రోజులోనే మూడు కారిడార్‌లలో కలిపి మొత్తం 4,47,009 మంది మెట్రోరైళ్లలో ప్రయాణించినట్లు వారు తెలిపారు.


‘హైదరాబాద్‌ మెట్రో రైలు’ ప్రయాణం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎత్తయిన వంతెనల మీదుగా మనకిష్టమైన నగరంలోని ఉపరితలంపై ఆకాశంలో విహరిస్తున్నట్టుగా కారువంటి (చిన్న) రైలు (Railcar)లో, అలా దూసుకు వెళుతుంటే అరుదైన దృశ్యాలెన్నో కనువిందు చేస్తుంటాయి. అప్పట్లో (2017) టికెట్‌ ధర ఎక్కువనో, నివాసప్రాంతాలకు దగ్గరగా స్టేషన్లు లేవనో, మరేదో కారణంతోనో వెనుకా ముందైన ప్రయాణికులు సైతం ఇటీవలి కాలంలో ‘మెట్రో’కే పూర్తిగా తొలి ప్రాధాన్యమిస్తున్నారన్నది పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యే చెబుతున్నది. దీనికి ప్రధాన కారణం, కాల్యుష్యానికి అతీతంగా, రోడ్డుమార్గం కంటే వేగంగా, సురక్షితంగా వెళ్లగలుగుతుండడమే. ‘ఒక రవాణా వ్యవస్థ ఉత్తమమైందిగా ఎప్పుడు అవతరిస్తుంది?’ అంటే, కాలుష్యకారక ఉద్ఘారాల రహితంగా, వాతావరణ నియంత్రణ, అత్యధిక సాంకేతికతలతో కూడుకొని, సురక్షితం, సౌకర్యవంతం, సుఖవంతం, సమర్థవంతమైన ప్రయాణ విధానాలను కలిగి ఉన్నప్పుడే! ప్రపంచ మెట్రో రవాణా వ్యవస్థలోనే అత్యుత్తమమైన వ్యవస్థలుగా పేరెన్నికగన్న కొద్ది అంతర్జాతీయ మెట్రోల సరసన భవిష్యత్తులో మన హైదరాబాద్‌ మెట్రో కూడా చేరాలని అంద రం మనసారా కోరుకొందాం.


సమయం అంటే ఇదే మరి!

కాలం ఎవరికైనా విలువైందే. కానీ, భారతీయ రైళ్లకు ఎలాంటి టైమ్‌ టేబులూ వర్తించదేమో. ‘నిన్నటి రైలు ఇవాళ రావడం’ మనకేం కొత్త కాదు. అనేకమంది చాలా విషయాల్లో అసలు సమయం పాటించరు. కానీ, జపాన్‌కు చెందిన టోక్యోలోని భూగర్భ (మెట్రో) వ్యవస్థను చూసి మనం వాచీల్లో సమయం సరిదిద్దుకోవాల్సిందే. ఆ రైళ్లు అంత కచ్చితత్వాన్ని పాటిస్తాయన్న మాట. సుమారు 157 సంవత్సరాల కిందట (1863లో ప్రారంభం) ఏర్పడిన ప్రపంచ అతిపురాతనమైన, (మొట్టమొదటిది కూడా) లండన్‌ భూగర్భ (మెట్రో) వ్యవస్థ రోజుకు 1.35 బిలియన్‌ (135 కోట్లు) ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తుంది. 30 ఏళ్ల కిందటి హాంగ్‌కాంగ్‌ ఎంటీఆర్‌ వ్యవస్థలో ఇంటెలిజెంట్‌ సెన్సర్లు, ఆటోమేటిక్‌ టికెటింగ్‌ వ్యవస్థలు ఉన్నాయి. మాస్కో మహానగరంలో 14 లైన్లలో నడిచే మెట్రో స్టేషన్లు కళాత్మక మ్యూజియాలను తలపిస్తాయి. ఇలా రాస్తూ పోతే, ప్రపంచ మహానగరాలలోని అనేక మెట్రోలలో తమవైన ప్రత్యేకతలు ఎన్నో కనిపిస్తాయి. 


logo