శనివారం 29 ఫిబ్రవరి 2020
అందరికీ పరిశోధనల ఫలాలు!

అందరికీ పరిశోధనల ఫలాలు!

Feb 13, 2020 , 22:59:42
PRINT
అందరికీ పరిశోధనల ఫలాలు!

మన సమాచార ప్రపంచంలో రాజకీయాలు, వినోదం, క్రీడలు తప్ప సైన్సుకు సంబంధించిన విషయాలకు అంతగా చోటుండటం లేదు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. మన ఉనికికి కారణమైన సైన్సు గురించి తెలుసుకోకుండానే బతుకులు కొనసాగుతున్నాయి. కూడు, గుడ్డ, గూడు గురించి తెలుసుకుంటే సైన్స్‌లో మొదటి పాఠాలు తెలుసుకున్నట్టు లెక్క. ఈ మూడింటినికూడా అర్థం చేసుకోకుండానే మనమంతా బతుకుతున్నాం. కనుకనే మనిషికి, సైన్సుకు మధ్యన వార్‌ వస్తున్నది. అది వారధిగా మారాలి. అప్పుడే బతుకులు మరింత అర్థవంతంగా కొనసాగుతాయి.

పశ్చిమ ఆఫ్రికాలో ఎబోలా వైరస్‌ కారణంగా పెద్ద ఎత్తున వ్యాధి ప్రబలింది. 2014లో ఈ మహమ్మారి ఆఫ్రికాలో పెద్ద కలవరానికి కారణమైంది. అక్కడ వ్యాధికి గురైన ఒక ఆడమనిషి అమెరికాకు వెళ్ళింది. ఆమె శరీరంలోనుంచి ఈ వ్యాధికి కారణమైన ఎబోలా వైరస్‌ నమూనాలను అక్కడి పరిశోధకులు బయటకు తీసుకున్నారు. వాటి ఆధారంగా పరిశోధనలు జరిపారు. ‘రీజనరాన్‌' (Regeneron) మందుల కంపెనీవారు వ్యాధికి టీకా మందును తయారుచేశారు. అయితే వారు క్రిములకోసం ఆఫ్రికాను సాయం అడగలేదు. అసలు ఎవరి సాయమూ అడగలేదు. కనుక తయారుచేసిన మందును ఆఫ్రికా దేశానికి అందజేయవలసిన నైతిక బాధ్యత ఆ కంపెనీ వారిమీద లేదు. ‘అందరికీ పంచివ్వాలి’ అంటే ఆ కంపెనీ వారు బహుశా ఆ పరిశోధనమీద అంత మనసు పెట్టి ఉండేవారు కాదేమో. ఇది కేవలం మనసుకు సంబంధించిన విషయం కాదు. వ్యాపారానికి సంబంధించిన విషయం. పరిశోధనకు వారు పెద్ద ఎత్తున డబ్బుకూడా ఖర్చు పెట్టారు. కనుక ఆ డబ్బును తాము సంపాదించుకోవాలని అనుకోవడంలో మనలాంటి వాళ్లకు తప్పు కనిపించదు. కాంగో దేశంలో వ్యాధి మరొకసారి పెద్ద ఎత్తున వచ్చింది. అక్కడ కొత్త మందును వాడినట్టు కనబడుతున్నది. ఆ పని జరగకపోతే ఎన్నో ప్రాణాలు పోయే ఉండేవి. ఇక్కడ జరిగిన వ్యాపారం వివరాలు మాత్రం అంత సులభంగా అందుబాటులోకి రావడం లేదు.


ఈ పరిస్థితులలో అనుసరించవలసిన కొన్ని పద్ధతులు లేకపోలేదు. వాటిగురించి అందరికీ తెలిసే పద్ధతిలో విస్తృతంగా పరిశోధనలు జరగాలి. వచ్చిన ఫలితాలను ప్రపంచంలోని అందరితోనూ పంచుకోవడం ఒక నైతిక బాధ్యతగా పరిశోధకులు గుర్తించాలి. కంప్యూటర్‌లో దాగి ఉన్న జీవసంబంధ సమాచారం వాడుకునే వారందరూ కొన్ని కట్టుబాట్లకు లొంగి ఉంటామని స్వచ్ఛందంగా ఒప్పుకోవాలి. ఇక్కడ ‘స్వచ్ఛందంగా’ అన్న మాటకు ప్రాముఖ్యం ఉంది. ‘సమాచారం ఎవరి సొత్తు’ అన్న ప్రశ్న గురించి తీవ్రమైన అనుమానాలు తలెత్తుతాయి. ఆ పక్కకు పోకుండా పరిశోధకులు వచ్చిన ఫలితాలను అందరికీ ఉపకరించే విధంగా అవసరమైన వారు అందరితోనూ పంచుకుంటామన్న పెద్ద మనసును ప్రదర్శించాలి. అటువంటి సందర్భంలో పరిశోధనకు కావలసిన ఖర్చులనుకూడా కంపెనీల వారు మాత్రమేకాక వివిధ దేశాల ప్రభుత్వాలు సైతం భరించే వీలు ఉంటుంది. పరిశోధనా ఫలితాలు, వ్యాపార సరళికి చేరిన తరువాత పరిస్థితి మారుతుంది. 

అప్పటి వరకు పరిశోధన కేవలం మానవాళికి ఉపయోగపడుతుందన్న దృష్టితో మాత్రమే జరగాలి. 


ప్రైవేటు కంపెనీలు కూడా ఈ దృష్టితోనే పరిశోధనకు పూనుకోవాలి. అన్ని పరిశోధనలు ప్రభుత్వరంగ సంస్థలలో జరగాలంటే అందుకు తగిన వెసులుబాటు ఉండకపోవచ్చు. ఇటువంటి విషయాలను గురించి చర్చించవలసిన సమయం వచ్చింది. సైన్స్‌ అంటే ఏవో ఆసక్తికరమైన విషయాలు మాత్రమే అనుకునే వారికి పైన చెప్పిన సంగతులు లాగా కనిపించకపోవచ్చు. సైన్సు ఒక ఎత్తు అయితే, దాని విధానం మరొక ఎత్తుగా మానవాళి ముందు నిలుస్తున్నది. ‘సైన్సుకు విలువలు లేవు’ అని ఒకప్పుడు అనేవారు. అంటే, ‘అది మంచి చెడ్డలను గురించి ఆలోచించదు’ అని అర్థం. పరిశోధకులు విషరసాయనాల గురించి కూడా కృషి చేస్తారు. వాటిని తగిన పద్ధతిలో ఉపయోగించుకునే వీలు ఉంటుంది. కానీ, ఈ ప్రపంచంలోనే మనుషులందరూ ఒకే రకంగా ఆలోచించరు. కనుక ఆ విషయాన్ని మనుషులకు అపాయం కలిగించే పద్ధతిలోకూడా వాడుకోవచ్చు. 


వెనకట ‘ఏజెంట్‌ ఆరెంజ్‌' అనే రసాయనం గురించి ఒక చర్చ జరిగింది. మొక్కలమీద చీడపీడలను నివారించడానికి ఈ మందును వాడుతారు. అయితే, ఈ మందును వియత్నాం యుద్ధంలో విమానాలనుంచి అక్కడి అడవులమీద చల్లారు. కింద ఉన్న చెట్ల ఆకులు రాలిపోయాయి. ఆ తర్వాత జరిగిన ఫలితాలను ఎవరైనా ఊహించవచ్చు. ‘సైన్సుకు విలువలు లేవు’ అన్న పరిస్థితిలోనుంచి, విలువలను ఆపాదించిన వలసిన పరిస్థితిలోకి మనిషి చేరుకున్నాడు. సైన్స్‌కూడా చేరుకున్నది. సైన్స్‌వల్ల మంచి మాత్రమే జరగాలి. కత్తితో మంచి పనులు చేయవచ్చు. మరొకరిని పొడిచి చంపవచ్చు కూడా. అప్పుడు తప్పు కత్తిది కాదు. దాన్ని వాడుతున్న మనిషిది. సైన్స్‌ విషయంలోకూడా ఇదే పరిస్థితి ఉండాలి. ఉండి తీరాలి. సైన్స్‌లో రహస్యాలు ఉన్నంత కాలం ఇటువంటి పరిస్థితి అంత సులభంగా రావడానికి వెసులుబాటు కలుగదు. తమ మీద తమకు ధ్యాస ఉన్న వారంతా సైన్స్‌గురించి కూడా వీలైనంత తెలుసుకోవాలి. అప్పుడే ప్రపంచంలో జరుగుతున్న మార్పులు చేర్పులను సరైన దృష్టితో అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 
logo