e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home సంగారెడ్డి నకిలీలపై ఉక్కుపాదం

నకిలీలపై ఉక్కుపాదం

  • ముమ్మరంగా తనిఖీలు చేస్తున్న టాస్క్‌ఫోర్స్‌ బృందాలు
  • సంగారెడ్డిలో 200 దుకాణాల్లో తనిఖీలు పూర్తి
  • 3 దుకాణాల్లో విత్తనాల విక్రయాలు నిలిపివేత
  • మెదక్‌ జిల్లాలో ఐదుగురిపై కేసులు నమోదు
  • సిద్దిపేటలో 8 కేసులు
  • నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్టు
  • కొనుగోలు చేసిన వాటికి రసీదులు తప్పనిసరిగా తీసుకోవాలి : అధికారులు
నకిలీలపై ఉక్కుపాదం

సంగారెడ్డి, జూన్‌ 22 (నమస్తే తెలంగాణ)/మెదక్‌/గజ్వేల్‌ అర్బన్‌ : నకిలీ విత్తనాల బారినపడి రైతులు నష్టపోకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాల్లో వ్యవసాయ, ఉద్యాన, పోలీస్‌శాఖల సిబ్బందితో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ఎరువులు, విత్తనాల దుకాణాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. నకిలీ విత్తనాల తయారీ, విక్రయదారులను గుర్తించి వారిపై కొరడా ఝళిపిస్తున్నాయి. బాధ్యులపై పీడీ యాక్టు కేసులు పెడుతున్నాయి.

సంగారెడ్డి జిల్లాలో..
జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు యంత్రాం గం అన్ని చర్యలు తీసుకుంటున్నది. టాస్క్‌ఫోర్సు బృందాలు ఇప్పటి వరకు 187 డీలర్ల దుకాణాల్లో తనిఖీలు చేపట్టాయి. ఇప్పటి వరకు మూడు సీడ్‌ డీలర్‌ షాపుల్లో విత్తనాల అమ్మకాలను నిలిపివేస్తూ అధికారులు చర్యలు తీసుకున్నారు. టాస్క్‌ఫోర్సు బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ నకిలీ విత్తనాలు అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ సీజన్‌లో వరి, పత్తి, కంది, సోయాబీన్‌ పంటలు ఎక్కువగా సాగయ్యే అవకాశం ఉంది. ఈ విత్తనాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. దీనిని ఆసరాగా చేసుకుని నకిలీ విత్తనాలను విక్రయించేందుకు కొందరు దళారులు, వ్యాపారులు ప్రయత్నిస్తున్నారు. మహారాష్ట్ర, గుంటూరు ప్రాంతం నుంచి నకిలీ విత్తనాలను తీసుకొచ్చి గ్రామాల్లో రైతులకు విక్రయించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిని అడ్డుకునేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటున్నది. జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఇటీవల స్వయంగా సదాశివపేటలో విత్తనాల దుకాణాలను సందర్శించి రికార్డులను పరిశీలించారు.

- Advertisement -

పొంచి ఉన్న నాసిరకం విత్తనాల ముప్పు
సంగారెడ్డి జిల్లాలో ఈ సీజన్‌ 8,85,304 క్వింటాళ్ల పత్తి, 6,000 క్వింటాళ్ల సోయాబీన్‌, 18,448 క్వింటాళ్ల వరి, 7,249 క్వింటాళ్ల కంది, 2,312 క్వింటాళ్ల పెసర, 695 క్వింటాళ్ల మినుము విత్తనాలు అవసరం ఉంటుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. వ్యవసాయశాఖ జనుము, జీలుగు విత్తనాలను సబ్సిడీపై అందజేస్తున్నది. జాతీయ ఆహార భద్రత పథకం కింద ఎస్సీ,ఎస్టీ రైతులకు 554 క్వింటాళ్ల కంది, 300 క్వింటాళ్ల పెసర విత్తనాల సబ్సిడీపై అందజేయనున్నారు. మిగతా పత్తి, కంది, పెసర, మినుము తదితర విత్తనాలు ప్రైవేటు విత్తన డీలర్ల వద్ద అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లాలో 400 మంది అధీకృత విత్తనాలు విక్రయించే డీలర్లు ఉన్నారు. ఈ డీలర్ల వద్ద రైతులకు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉండేలా వ్యవసాయశాఖ చర్యలు తీసుకుంటున్నది. రైతులకు అవసరమైన విత్తనాలు డీలర్ల వద్ద అందుబాటులో ఉన్నప్పటికీ, దళారులు నకిలీ విత్తనాలను రైతులకు అంటగడ్డి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా బీటీ పత్తి పేరిట నాసిరకమైన విత్తనాలు విక్రయిస్తున్నారు. వీటితో పాటు కంది, మిరప, సోయాబీన్‌ నకిలీ విత్తనాలు అమ్ముతున్నారు. నకిలీ విత్తనాల గురించి అవగాహన లేక రైతులు నష్టపోతున్నారు.

మెదక్‌ జిల్లాలో…
మెదక్‌ జిల్లాలో తూప్రాన్‌, పెద్దశంకరంపేట, రామాయంపేటలలో ఐదుగురిపై పీడీ యాక్ట్‌ కింద అధికారులు కేసులు నమోదు చేశారు. జిల్లాలో 21 మండలాలు ఉన్నాయి. అన్ని మండలాల్లో టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి.నకిలీ విత్తనాల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ హెచ్చరిస్తూనే, విత్తనాల కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నది. గ్రామాల్లో నకిలీ విత్తనాలు అమ్మకుండా నిఘా ఏర్పాటు చేశారు. పోలీసుశాఖ అధికారులు సైతం నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పంటల సాగులో విత్తనాలదే కీలక భూమిక. నాణ్యమైన విత్తనాలను విత్తుకుంటేనే సరైన దిగుబడులు వస్తాయి. కాబట్టి రైతులు విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
మార్కెట్‌లో నకిలీ విత్తనాల బెడద పెరుగుతుండడంతో రైతులకు ఏవి నకిలీ విత్తనాలు, ఏవి నాణ్యమైన విత్తనాలు అనే తెలియని పరిస్థితి నెలకొంది. దీనిని ఆసరాగా చేసుకుని దళారులు నకిలీ విత్తనాల విక్రయాలకు తెగబడుతున్నారు.
అధీకృత లైసెన్స్‌ డీలర్‌ నుంచి మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి
కొనుగోలు అనంతరం డీలర్‌ సంతకంతో తప్పకుండా రసీదు తీసుకోవాలి.
విత్తనాల కొనుగోలు చేసిన రసీదులో లాట్‌ నెంబరు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
రసీదును, విత్తన ప్యాకెట్‌ను పంటచేతికి వచ్చే వరకు రైతులు భద్రపరచాలి
పాలిథిన్‌, ఇతర సంచుల్లో విక్రయించే విత్తనాలను కొనుగోలు చేయవద్దు

రైతులు అప్రమత్తంగా ఉండాలి
నకిలీ విత్తనాల అమ్మకాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాయి. రైతులు విత్తనాలను అధీకృత డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలి. తప్పకుండా రసీదు తీసుకోవాలి. సోయాబీన్‌ పంటకు సంబంధించిన నాణ్యమైన విత్తనాలు అందుబాటులో లేవు. ఇతర రాష్ర్టాల నుంచి తీసుకువచ్చే సోయాబీన్‌ విత్తనాలను కొనుగోలు చేయవద్దు. నకిలీ విత్తనాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వ్యవసాయశాఖ ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబరు 08455-276466కు ఫోన్‌ చేయాల్సిందిగా ప్రజలు, రైతులను కోరుతున్నా.
-నర్సింహారావు, సంగారెడ్డి జిల్లా వ్యవసాయశాఖ అధికారి

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు..
జిల్లాలో నకిలీ విత్తనాలు విక్రయించే దుకాణాదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. టాస్క్‌ఫోర్స్‌ బృందాల ఆధ్వర్యంలో తనిఖీలు చేసి తూప్రాన్‌లో ముగ్గురు, రామాయంపేటలో ఒకరు, పెద్దశంకరంపేటలో ఒకరిపై కేసులు నమోదు చేశాం. రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా రసీదు తీసుకోవాలి.
-పరశురాం నాయక్‌, మెదక్‌ జిల్లా వ్యవసాయశాఖ అధికారి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నకిలీలపై ఉక్కుపాదం
నకిలీలపై ఉక్కుపాదం
నకిలీలపై ఉక్కుపాదం

ట్రెండింగ్‌

Advertisement