సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 12: దళితబంధు యూనిట్లను వేగంగా గ్రౌండింగ్ చేయాలని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నియోజకవర్గ ప్రత్యేకాధికారులు, ఆర్డీవోలు, ఎంపీడీవోలతో దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నియోజకవర్గాల వారీగా ఎప్పటికప్పు డు సమీక్షించి లబ్ధిదారులకు దిశా నిర్దేశం చేయాలన్నారు. డెయి రీ, పౌల్ట్రీ వంటి యూ నిట్ల గ్రౌండింగ్‌కు అవసరమైన అన్ని వసతుల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు. బోర్ వేయడానికి గ్రౌండ్ వాటర్ అధికారి నిర్దేశించిన ధరలు, మోటర్లకు సంబంధించి కంపెనీ వారీగా నిర్ధారించిన ధరలకు అందించాలని, లబ్ధిదారులకు నచ్చిన మోటర్లు తెచ్చుకునే విధంగా పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని సూచించారు.
గ్రౌండింగ్ అధికారులు ఆయా గ్రామాలకు వెళ్లి యూనిట్ల గ్రౌండింగ్‌కు అవసరమైన ఏర్పాట్లతో పాటు, యూనిట్‌కు అవసరమైన సౌకర్యాలను పరిశీలించాలన్నారు. గొర్రెలు, మేకలు, గేదెలకు సంబంధించిన యూనిట్లలో షెడ్లు పూర్తి కావాలని, జనరల్ స్టోర్, సూపర్ మార్కెట్, క్లాత్ ఎంపోరియం, బ్యూటీ పార్లర్, సిమెంట్ బ్రిక్స్, సెంట్రింగ్ వంటి యూనిట్లు వెంటనే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా దళితబంధు అమలు కావాలని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాజర్శి షా, జడ్పీ సీఈవో ఎల్లయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబురావు, డీఆర్డీవో శ్రీనివాసరావు, డీపీవో సురేశ్ మోహన్, డీసీవో తుమ్మ ప్రసాద్, వ్యవసాయ శాఖ జేడీ నర్సింహారావు, ఆయా శాఖల అధికారులు, ఆర్డీవోలు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.