e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home సంగారెడ్డి ఎస్సీల అభివృద్ధికి మరో రూ.వెయ్యి కోట్లు

ఎస్సీల అభివృద్ధికి మరో రూ.వెయ్యి కోట్లు

ఎస్సీల అభివృద్ధికి  మరో రూ.వెయ్యి కోట్లు

సంగారెడ్డి కలెక్టరేట్‌, మార్చి 27: ప్రభుత్వం ఎస్సీల అభివృద్ధికి సాధారణంగా కేటాయించిన రూ.2,899 కోట్లకు అదనంగా సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ పథకం కింద మరో రూ. వెయ్యి కోట్లను ప్రత్యేకంగా కేటాయించామని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం సంగారెడ్డిలోని కింగ్స్‌ ప్యాలెస్‌ ఫంక్షన్‌ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్సీ లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదుగా వివిధ ఆస్తులను పంపిణీ చేశారు. చిన్న తరహా వ్యాపార యూనిట్ల పథకం కింద మంజూరైన 62 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేయగా, 40 మంది లబ్ధిదారులకు టైలరింగ్‌ మిషన్లు, భూమి కొనుగోలు పథకం కింద మంజూరైన 20 బోరు మోటర్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మనూరు మండలం మైకోడ్‌ గ్రామంలో భూమి కొనుగోలు పథకం కింద కొనుగోలు చేసిన 2.27 ఎకరాల భూ పట్టాను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బ్యాంకుతో సంబంధం లేకుండా 100 శాతం సబ్సిడీతో 50 వేల లోపు రుణాలను అందిస్తున్నామన్నారు.

జిల్లాలో రూ.72.50 లక్షల ఆర్థిక సహాయం ఎస్సీ లబ్ధిదారులకు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి జిల్లాలో ఎస్సీలు అధికంగా ఉన్న జహీరాబాద్‌, అందోల్‌ నియోజకవర్గాల్లో 1000 డెయిరీలు, కుట్టు మిషన్లను అందిస్తామని హామీ ఇచ్చారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీల కోసం పెద్దఎత్తున నిధులు ఖర్చు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా జిల్లాలో 6 వేల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని తమ పిల్లలను బాగా చదివించాలని, వ్యవసాయం, కూలీ పనులకు పంపించవద్దని కోరారు. గతేడాది కరోనా నేపథ్యంలో ఇండ్లు కట్టుకోలేకపోయామని పేర్కొన్న మంత్రి ఈసారి రూ.11 వేల కోట్లు ఇండ్ల నిర్మాణం కోసం నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. సొంత జాగాలో ఇండ్లు కట్టించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు.

రాష్ట్రం సిద్ధించాకే అభివృద్ధి..
జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు, అందోల్‌ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రం సిద్ధించిన తర్వాతనే వేగంగా అభివృద్ధి జరుగుతుందని గుర్తు చేశారు. గతంలో ఎప్పుడూలేని విధంగా సీఎం కేసీఆర్‌ వివిధ సంక్షేమ పథకాలను పేద ప్రజల కోసం తీసుకొచ్చారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధి చేందాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ రూ.100 కోట్లను ప్రత్యేకంగా కేటాయించారని చెప్పారు. దళితులకు ముడెకరాల భూ పంపిణీ విషయంలో ప్రతి పక్షాల విమర్శలు సరికాదని హితవు చేశారు. తాను ఎన్నికైన కొత్తలో నాగులపల్లిని సందర్శించినప్పుడు అక్కడ అందరికీ మూడెకరాల భూమి వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారని క్రాంతి గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీలు బీబీ పాటిల్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, కలెక్టర్‌ హనుమంతరావు, అదనపు కలెక్టర్‌ రాజర్షి షా, ఆర్డీవో నగేశ్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ బాబూరావు, కార్పొరేషన్‌ జీఎం, జడ్పీటీసీ కొండల్‌రెడ్డి, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు వెంకటేశ్వర్లు, పెరుమాండ్ల నర్సింలు, రాంరెడ్డి, బుచ్చిరెడ్డి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.లబ్ధిదారులు పాల్గొన్నారు.

వీధి వర్తకుల సముదాయం ప్రారంభించిన మంత్రి
అంతకుముందు సంగారెడ్డి పట్టణంలోని 35, 37వ వార్డులలో ఏర్పాటు చేసిన వీధి వర్తకుల వ్యాపార సముదాయాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వీధి వర్తకుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. 25 మంది వీధి వర్తకులు వ్యాపారం చేసుకునేలా ఏర్పాటు చేశామన్నారు.

చిల్డ్రన్స్‌ పార్కును ప్రారంభించిన మంత్రి
కలెక్టరేట్‌ వెనుకాల నిర్మించిన చిల్డ్రన్స్‌ పార్కును మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. మంత్రికి పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. పార్కులో కలియ తిరిగిన మంత్రి మొక్కలు నాటి నీళ్లు పోశారు. పార్కులో ఏర్పాటు చేసిన గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ.15 లక్షల వ్యయంతో నిర్మించి, పార్కును అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు చెప్పారు. రాబోయే కాలంలో సింథెటిక్‌ వాకింగ్‌ ట్రాక్‌, ఓపెన్‌ జిమ్‌, తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఎస్సీల అభివృద్ధికి  మరో రూ.వెయ్యి కోట్లు

ట్రెండింగ్‌

Advertisement