e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home సంగారెడ్డి కల నెరవేరింది..

కల నెరవేరింది..

కల నెరవేరింది..
  • సంగారెడ్డికి మెడికల్‌ కళాశాల
  • అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీ
  • మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌
  • హామీ నిలబెట్టుకున్న ఉద్యమ నేత
  • జిల్లా ప్రజలకు మరింత మెరుగైన వైద్యం
  • పేద విద్యార్థులకు అందుబాటులోకి వైద్య విద్య
  • సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావుకు జిల్లా ప్రజాప్రతినిధుల కృతజ్ఞతలు

‘మీకందరికి ఓ కోరిక ఉంది. సంగారెడ్డిలో మెడికల్‌ కాలేజీ కావాలే. వంద శాతం వచ్చే టర్మ్‌లో మెడికల్‌ కాలేజీ పెట్టిస్తానని మీకు మాట ఇస్తున్నా’.. 2018 సంగారెడ్డి ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్‌ హామీ ఇది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు సీఎం కేసీఆర్‌ సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల చిరకాల కోరికను నెరవేరుస్తూ సోమవారం నిర్ణయం తీసుకున్నారు. సంగారెడ్డికి మెడికల్‌ కాలేజీని మంజూరు చేశారు. మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీని ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ ప్రకటన సంగారెడ్డి జిల్లా ప్రజల్లో ఆనందాన్ని నింపింది. జిల్లా ప్రజలంతా ముక్తకంఠంతో సీఎం కేసీఆర్‌కు ధన్యవాదలు తెలుపుతున్నారు. ప్రజాప్రతినిధులు సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. సంగారెడ్డిలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుతో జిల్లాలో వైద్యరంగానికి ఊతం లభించడంతో పాటు పేదలకు మెరుగైన వైద్యసేవలు, పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్య అందుబాటులోకి రానున్నది.

సంగారెడ్డి, మే 18 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి ప్రజలపై తనకు ఉన్న ప్రేమను సీఎం కేసీఆర్‌ మరోమారు చాటుకున్నారు. ఇటీవల సంగారెడ్డి జిల్లాకు బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలను ప్రకటించారు. తాజాగా మరోమారు జిల్లాపై వరాలు కురిపించారు. సంగారెడ్డి ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెడికల్‌ కళాశాలను సీఎం కేసీఆర్‌ నెరవేర్చారు. అంతటితో సరిపెట్టకుండా మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలను మంజూరు చేశారు. 2018 ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ సంగారెడ్డిలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తామని నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ మేరకు మెడికల్‌ కాలేజీని మంజూరు చేస్తూ సోమవారం నిర్ణయం తీసుకున్నారు. సీఎం నిర్ణయం తో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్‌, ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు జిల్లా ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు. సంగారెడ్డిలో వైద్య కళాశాల ఏర్పాటుతో వైద్యరంగానికి ఊతం లభించడంతో పాటు జిల్లా ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. పొరుగు జిల్లాలైన మెదక్‌, వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల ప్రజలకు ఉపయుక్తం కానున్నది. జిల్లాలోని పేద విద్యార్థులకు వైద్యవిద్య అందుబాటులోకి రానున్నది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో వైద్యవిద్య వైపు మరలేందుకు అవకాశం ఉం టుంది. వైద్య కళాశాల ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వైద్య కళాశాలలో పెద్దసంఖ్యలో సిబ్బంది నియామకాలు చేపడతారు. దీంతో యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

సంగారెడ్డి ప్రజల కలనెరవేర్చిన సీఎం కేసీఆర్‌..
సంగారెడ్డి ప్రాంత ప్రజలు ఎంతోకాలంగా మెడికల్‌ కాలేజీ ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలు మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పించడం మినహా ఏనాడూ ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. మెడికల్‌ కాలేజీ ఏర్పాటు హామీతో ఓట్లు దండుకుని, ఆ తర్వాత ప్రజల డిమాండ్‌ను అటకెక్కించారు. సంగారెడ్డిలో మెడికల్‌ కాలేజీ అంశాన్ని గతంలో మంత్రి హరీశ్‌రావు, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. 2018 ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డికి వచ్చిన టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే సంగారెడ్డికి మెడికల్‌ కాలేజీని మంజూరు చేశారు.

100 సీట్లతో 25 ఎకరాల్లో నిర్మాణం…
సంగారెడ్డిలో 100 సీట్లతో మెడికల్‌ కాలేజీ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. సంగారెడ్డి జిల్లాలో ఎంఎన్‌ఆర్‌, టీఆర్‌ఆర్‌, మహేశ్వర ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు ఉన్నాయి. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ లేదు. దీంతో ప్రభుత్వం సంగారెడ్డిలో ప్రభు త్వ మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నది. సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానకు అనుబంధంగా మెడికల్‌ కాలేజీ ఏర్పాటు కానున్నది. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) నిబంధనల మేరకు మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలంటే అనుబంధంగా 500 పడకల దవాఖాన ఉండాలి. ప్రస్తుతం సంగారెడ్డిలో 250 పడకల దవాఖాన ఉంది. మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు వీలుగా మరో 250 పడకలను పెంచనున్నారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలంటే పట్టణ ప్రాంతాల్లో 25 ఎకరాల స్థలం తప్పనిసరి. అధికారుల సమాచారం మేరకు సంగారెడ్డి ప్రభుత్వ దవాఖాన ప్రస్తుతం 35 ఎకరాల ఖాళీ స్థలం అందుబాటులో ఉంది. దీంతో ఇక్కడే మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి.

మెడికల్‌ కాలేజీ ఏర్పడితే వంద మెడికల్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయి. దీంతో సంగారెడ్డి జిల్లాకు చెందిన పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్య అందుబాటులోకి రానున్నది. మెడికల్‌ కాలేజీలో జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్‌, ఈఎన్‌టీ, ఆప్తామాలజీ, సైక్రియాటిక్‌, పీడీయాట్రిక్‌, అనస్తీషియాలజీ తదితర డిపార్టుమెంట్లు ఉంటాయి. వాటికి సంబంధించిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లతోపాటు వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది 100 మందికిపైగా అందుబాటులో ఉంటారు. మెడికల్‌ కాలేజీతో సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. స్థానిక ప్రజలతో పాటు పొరుగు జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందనుంది. మెడికల్‌ కాలేజీలో పారామెడికల్‌, ల్యాబ్‌ టెక్నాలజీ, డయాలసిస్‌ టెక్నీషియన్‌ కోర్సులకు అవకాశం ఉంటుంది.

ఎడ్యుకేషనల్‌ హబ్‌గా సంగారెడ్డి జిల్లా..
సంగారెడ్డిలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు నిర్ణయం జిల్లాకు ఎంతో ప్రయోజకరం కానున్నది. సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంతో జిల్లా ఎడ్యుకేషనల్‌ హబ్‌గా అవతరించనున్నది. సంగారెడ్డిలో ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు ఉన్నప్పటికీ, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ లేదన్న లోటు కనిపించేది. తాజాగా సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో అది కూడా సాకారం కానున్నది. సంగారెడ్డి జిల్లాలో ఇది వరకే పలు ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలు ఉన్నాయి. జిల్లాతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు జిల్లాలోని ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, బిజినెస్‌ స్కూళ్లలో విద్యను అభ్యసిస్తున్నారు. సంగారెడ్డి మండలం కందిలో ప్రతిష్టాత్మకమైన ఐఐటీ హైదరాబాద్‌, అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, సుల్తాన్‌పూర్‌లో జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల, సంగారెడ్డి, అందోలులో రెండు పాలిటెక్నిక్‌ కాలేజీలు ఉన్నాయి. వీటితోపాటు సంగారెడ్డి జిల్లాలో ఎంఎన్‌ఆర్‌ (ఫసల్‌వాది), టీఆర్‌ఆర్‌ (ఐనోలు-ఇంద్రేశం), మహేశ్వర (చిట్కుల్‌) మూడు ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు ఉన్నాయి. రుద్రారంలో గీతం ఇంజినీరింగ్‌ యూనివర్సిటీ, బుధేరాలో ఓగ్జెన్‌ బిజినెస్‌ యూనివర్సిటీ ఉన్నాయి. వీటితో పాటు జిల్లాలోని పలుప్రాంతాల్లో ప్రైవేటు ఇంటర్నేషనల్‌ స్కూళ్లు కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా హైదరాబాద్‌కు సమీపంగా ఉండడంతో పలు విద్యాసంస్థలు ఇక్కడ ఏర్పాటు అవుతున్నాయి.

సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం..
సీఎం కేసీఆర్‌ సంగారెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మెడికల్‌ కాలేజీ మంజూరు చేయడం ఆనందంగా ఉంది. ప్రజలు సీఎం నిర్ణయంపై సంతోషంగా ఉన్నారు. మెడికల్‌ కాలేజీ ఏర్పాటుతో సంగారెడ్డి ప్రాంతం వైద్య రంగంలో మరింత అభివృద్ధి చెందనున్నది. జిల్లాలోని అన్ని ప్రాంతాలు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. గతంలో ఏ సీఎం మెడికల్‌ కాలేజీ ఏర్పాటుపై నిర్ణ యం తీసుకోలేదు. జిల్లా ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా మెడికల్‌ కాలేజీ, నర్సింగ్‌ కాలేజీ మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు ఈ ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు. ఆయనకు రుణపడి ఉంటాం.

  • చింతా ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యే సంగారెడ్డి
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కల నెరవేరింది..

ట్రెండింగ్‌

Advertisement