e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home సంగారెడ్డి కరోనా బాధితుల పిల్లలకు హెల్ప్‌లైన్‌

కరోనా బాధితుల పిల్లలకు హెల్ప్‌లైన్‌

కరోనా బాధితుల పిల్లలకు హెల్ప్‌లైన్‌


సంగారెడ్డి, మే 13: జిల్లాలో కరోనా బారినపడి తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం హెల్ప్‌లైన్‌తో పాటు రెండు వసతి గృహాలను ఏర్పాటు చేశామని అదనపు కలెక్టర్‌ రాజర్షి షా తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని జిల్లా మహిళా శిశు, బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో సంక్షేమశాఖ కార్యాలయంలో బాలల సహాయ వాహనం, హెల్ప్‌లైన్‌ వాల్‌పోస్టర్‌ను అదనపు కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలకు సేవలు అందించడానికి ప్రత్యేక సహాయ వాహనం అందుబాటులో ఉంటుందన్నారు. చిన్నారుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌, బాలల సహాయ వాహనాన్ని, రెండు వసతి గృహాలను ఏర్పాటు చేసినట్లు అదనపు పేర్కొన్నారు. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన బాలబాలికలు, బాలల సంరక్షణ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న బాల బాలికలకు వసతి, రక్షణ, సంరక్షణ కల్పించేందుకు ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు హెల్ప్‌లైన్‌ పని చేస్తుందన్నారు. బాలబాలికలు 1098 టోల్‌ఫ్రీ నంబర్‌కు చేయాలన్నారు. ఈ నంబర్‌ 24 గంటలు పనిచేస్తుందన్నారు.

రెండు కేంద్రాలు ఏర్పాటు…
బాధిత తల్లిదండ్రుల పిల్లలకు జిల్లా కేంద్రంలో రెండు ప్రత్యేక సంరక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి వసతి కల్పిస్తున్నామని అదనపు కలెక్టర్‌ తెలిపారు. పట్టణంలోని బాలసదనంలో బాలికలకు, శాంతినగర్‌లోని మహిమా మినిస్ట్రీస్‌లో బాలురకు సంరక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నామన్నారు. కొవిడ్‌ బారినపడి తల్లిదండ్రులను కోల్పోయిన బాలలకు సేవలు అందించేందుకు ప్రత్యేక బాలల సహాయ వాహనాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ వాహనంతో పిల్లలను చేరదీసి సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన సంరక్షణ కేంద్రాల్లో ఆశ్రయం, రక్షణ కల్పిస్తామని వెల్లడించారు. జిల్లాలో బాల బాలికల కోసం నిర్వహిస్తున్న 10 సంరక్షణ కేంద్రాల్లో రక్షణ పొందుతున్న బాలలకు కొవిడ్‌ నియంత్రణలో భాగంగా ఐదు లీటర్ల చొప్పున శానిటైజర్‌, సోడియం హైపోక్లోరైట్‌, ఒక ఫల్స్‌ ఆక్సిజన్‌ మీటర్‌, తర్మల్‌ స్కానర్‌, వంద మాస్కులు ఇచ్చామన్నారు. కొవిడ్‌ బారిన పడి మరణించిన వారిని గుర్తించి వారి బాలలను వెంటనే ప్రత్యేక సంరక్షణ కేంద్రాలకు తరలించి సంరక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ రాజర్షి షా సూచించారు. కార్యక్రమంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమశాఖ అధికారి పద్మావతి, డిప్యూటీ డీఎంహెచ్‌వో శశాంక్‌, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జిల్లా సభ్యులు చక్రపాణి, బాలల సంక్షేమ సమితి సభ్యులు వేరోనికా, వెంకటేశం, డీసీపీవోఆర్‌ రత్నం, చైల్డ్‌లైన్‌ ప్రతినిధులు సమీర్‌, లింగం, సంరక్షణ కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా బాధితుల పిల్లలకు హెల్ప్‌లైన్‌

ట్రెండింగ్‌

Advertisement