శనివారం 06 మార్చి 2021
Sangareddy - Jan 27, 2021 , 00:48:48

సజ్జాపూర్‌లో.. వైకుంఠం

సజ్జాపూర్‌లో.. వైకుంఠం

ఆదర్శంగా వైకుంఠధామం నిర్మాణం

శివుడి విగ్రహం ఏర్పాటు

మనిషి మరణానంతరం దహన సంస్కరణలకు ఇబ్బందులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామంలో శ్మశాన వాటికలను నిర్మిస్తున్నది. ఆయా శ్మశాన వాటికలను చూస్తూ ఉంటే స్వర్గ సీమలను తలపిస్తున్నాయి. వైకుంఠధామాల నిర్మాణంలో కోహీర్‌ మండలం ప్రత్యేకతను చాటుకున్నది. మండలంలోని 24 గ్రామ పంచాయతీలకు వందశాతం పనులను పూర్తి చేసి రికార్డు సృష్టించారు. 

- కోహీర్‌ (జనవరి 26)

సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలంలోని సజ్జాపూర్‌లో నిర్మించిన వైకుంఠధామం జిల్లాలో అగ్రభాగాన నిలిచింది. ఆకర్శణీయంగా తయారు కావడంతో పేరు ప్రఖ్యాతలు నలుమూలలా వ్యాపించాయని చెప్పవచ్చు. ప్రజల అంత్యక్రియల అవసరార్థం అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలను నిర్మించాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. సజ్జాపూర్‌ మినహా అన్ని గ్రామాల్లో పనులు చకచకా జరిగిపోయాయి. ఇక్కడ మాత్రం ప్రభుత్వ స్థలం లేకపోవడంతో అటవీశాఖ నుంచి భూమిని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రభుత్వం కేటాయించిన నిధులతో పనులను ప్రారంభించారు. పనులను వేగంగా పూర్తి చేసి సుందరంగా తీర్చిదిద్దారు. అంత్యక్రియలకు హాజరయ్యే వారు తమ బాధలను మార్చిపోయేలా వైకుంఠధామం ఆవరణను రూపొందించారు. కంటికి ఆకర్షణీయంగా అగుపించేలా ఇక్కడి ఆవరణను అందంగా తీర్చిదిద్దారు.  

శివుడి విగ్రహం ప్రత్యేకం..

సజ్జాపూర్‌ గ్రామంలో వైకుంఠధామం ఆవరణలో రూ.80 వేల వ్యయంతో శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. చుట్టూ మూడు రకాల పూల మొక్కలను నాటారు. వాటికి చివరన మెహిందీ (గోరింటాకు) మొక్కలను నాటడంతో మరింత అందం వచ్చింది. అంత్యక్రియలకు హాజరై అలిసిపోయిన వారు సేదతీరేందుకు సిమెంటు బెంచ్‌లను ఏర్పాటు చేయించారు. స్నానపు గదులు, మూత్రశాలలను నిర్మించారు. వైకుంఠధామాన్ని సందర్శించిన కలెక్టర్‌ హనుమంతరావు గ్రామ ప్రజాప్రతినిధులను అభినందించారు. వైకుంఠధామాన్ని అందంగా తీర్చిదిద్దినందుకు గ్రామాభివృద్ధి కోసం రూ.10 లక్షలను ప్రత్యేకంగా మంజూరు చేసి, వెంటనే రూ.5 లక్షలను కేటాయించారు. గ్రామానికి ఆనుకొని ఉన్న కాల్వ మరమ్మతుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన నిధులను వినియోగించారు.

చాలా మంచి పేరు వచ్చింది..

మా గ్రామంలో నిర్మించిన వైకుంఠధామం చాలా అందంగా ఉన్నది. కలెక్టర్‌ సార్‌ గ్రామానికి వచ్చి వైకుంఠధామాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధి కోసం వెంటనే పది లక్షల రూపాయలను మంజూరు చేశారు. నిధులను మంజూరు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. వైకుంఠధామం నిర్మాణానికి అటవీశాఖ భూమిని ఇచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు.

- సుదర్శన్‌రెడ్డి, సజ్జాపూర్‌ ఉప సర్పంచ్‌


VIDEOS

logo