శనివారం 06 మార్చి 2021
Sangareddy - Jan 27, 2021 , 00:48:44

నిబంధనలు పాటిస్తే ప్రయాణం సురక్షితం

నిబంధనలు పాటిస్తే ప్రయాణం సురక్షితం

హైదరాబాద్‌-ముంబయి 65వ జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు 

ఆందోళన చెందుతున్న స్థానికులు 

ప్రమాదాలు నివారించేందుకు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించిన సంబంధిత అధికారులు

జహీరాబాద్‌, జనవరి 26 : నిత్యం ఎక్కడోచోట రోడ్డు ప్రమాదాలు జరిగి రక్తమోడుతూనే ఉన్నాయి. అనూహ్యంగా సంభవిస్తున్న రోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాల్లో చీకట్లు నింపుతున్నాయి. ఎందరో ప్రాణాలు అర్ధాంతరంగా గాల్లో కలిసిపోతున్నాయి. తోడూనీడగా ఉండాల్సిన వారు దుర్మరణాలతో మరెందరో దివ్యాంగులుగా మారుతున్నారు. రహదారులపై ప్రయాణం చేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చాలావరకు ప్రమాదాలను నియంత్రించుకునే అవకాశం ఉంది. సహజంగా ఎక్కువ సంఘటనలకు మానవ తప్పిదాలు వాహనాల ఫిట్‌నెస్‌, వాతావరణ పరిస్థితులు కారణంగా ఉంటాయి. జాతీయ రహదారిని 1956 సంవత్సరంలో 9వ నెంబర్‌ జాతీయ రహదారిగా కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జాతీయ రహదారిని 65 నెంబర్‌గా మార్చడం జరిగింది. హైదరాబాద్‌-ముంబయి జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు చోటుచేసుకోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.  హైదరాబాద్‌-ముంబయి జాతీయ రహదారిని నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా రోడ్డు విస్తరణ పనులు చేసింది. రెండు లైన్లుగా ఉన్న రోడ్డును నాలుగు లైన్లుగా నిర్మాణం చేసింది. తెలంగాణలో సంగారెడ్డి నుంచి కర్ణాటక సరిహద్దులో ఉన్న చెరాగ్‌పల్లి వరకు 70 కిల్లోమీటరు జాతీయ రహదారి విస్తరణకు రూ.12,66.6కోట్లు ఖర్చు చేసింది. మునిపల్లి మండలంలోని కంకోల్‌ శివారులో టోల్‌ గేటు ఏర్పాటు చేసి వాహనాల నుంచి పన్నులు వసూలు చేస్తుంది. హైదరాబాద్‌ నుంచి షోలాపూర్‌ వరకు జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా నిర్మాణం చేశారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు జహీరాబాద్‌, సదాశివపేట పట్టణ సమీపంలో బైపాస్‌ రోడ్లు నిర్మాణం చేసింది.  రోడ్డు నిర్మాణ పనులను ప్రభుత్వం ఎల్‌అండ్‌టీ కంపెనీకి అప్పగించింది. రోడ్డు నిర్మాణ పనులను నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా ఇంజినీరింగ్‌ అధికారులు పర్యవేక్షణ చేశారు. జాతీయ రహదారి నిర్మాణ సమయంలో ఇంజినీరింగ్‌ అధికారులు కొన్ని లోపలు చేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో 65వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు పలుమార్లు పోలీసు, రవాణా, నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా ఇంజినీరింగ్‌ అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. సర్వే చేసిన అధికారులు ప్రతిపాదనలు పంపించారు.

65వ జాతీయ రహదారి నాలుగులైన్లుగా నిర్మాణం

సంగారెడ్డి నుంచి  కర్ణాటక సరిహద్దు వరకు 70 కిల్లోమీటర్ల రోడ్డును నాలుగు లైన్లుగా నిర్మాణం చేశారు. సంగారెడ్డి నుంచి షోలాపూర్‌ వరకు 220 కిలోమీట్లరు రహదారిని  విస్తరించారు. జాతీయ రహదారిపై కంకోల్‌, కర్ణాటకలోని మంగళగిరి శివారులో టోల్‌ గేట్లు ఏర్పాటు చేశారు. జహీరాబాద్‌, సదాశివపేట కర్నాటకలోని మన్నేల్లి పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య నివారణకు బైపాస్‌ రోడ్లు నిర్మాణం చేశారు. జాతీయ రహదారిని నాలుగులైన్లుగా నిర్మాణం చేసి గ్రామాల్లో ఫ్లై ఓవర్లు, విశ్రాంతి భవనాలు, పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి విస్తరణతో రోడ్డు రూపురేఖలు మార్పు చేశారు. సంగారెడ్డి నుంచి షోలాపూర్‌ వరకు 220 కిలోమీట్లరు రహదారిని నాలుగు లైన్లుగా నిర్మాణం చేశారు. జాతీయ రహదారి మన రాష్ట్రంతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలోని షోలాపూర్‌ వరకు విస్తరించారు. 

కంకోల్‌ , మంగళగిరిలో టోల్‌ గేట్లు ..

జాతీయ రహదారిపై రెండుచోట్ల టోల్‌ గేట్లు ఏర్పాటు చేశారు. తెలంగాణలో మునిపల్లి మండలంలోని కంకోల్‌ శివారులో టోల్‌ గేటు ఏర్పాటు చేశారు. కర్ణాటకలోని మన్కెళ్లి సమీపంలో మంగళగిరి వద్ద టోల్‌ గేటు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిపై టోల్‌ గేట్‌ వారు 25 సంవత్సరాలపాటు వాహనాల నుంచి పన్నులు వసూలు చేస్తారు. జాతీయ రహదారి నిర్వహణ బాధ్యతలు సైతం టోల్‌గేట్‌ నిర్వాహకులు చేస్తారు.

ఫ్లై ఓవరు బ్రిడ్జిల నిర్మాణం..

జాతీయ రహదారి పై ఎలాంటి ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా నివారణ చేసేందుకు పలు గ్రామాల్లో ఫ్లై ఓవరు బ్రిడ్జిలు నిర్మాణం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సంగారెడ్డి చౌరస్తా, పెద్దాపూర్‌, బుధేరా, కంకోల్‌, కోహీర్‌ చౌరస్తా, చెరాగ్‌పల్లిలో ఫ్లై  ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించారు. ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిలతోపాటు వాహన డ్రైవర్లు విశ్రాంతి తీసుకునేందుకు గదులు నిర్మాణం చేయాలి. జాతీయ రహదారిపై వాహనాలు నిలిపేందుకు ప్రత్యేక రోడ్లు నిర్మించాలి. 

జాతీయ రహదారి పై బ్లాక్‌ స్పాట్‌లు గుర్తింపు 

65వ జాతీయ రహదారి విస్తరణ చేసే ముందు నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా ఇంజినీరింగ్‌ అధికారులు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్‌ స్పాట్‌లుగా గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. కొండాపూర్‌ మండలంలోని మల్కాపూర్‌, కోహీర్‌ మండలంలోని దిగ్వాల్‌, జహీరాబాద్‌ పట్టణ సమీపంలోని అల్గోల్‌ చౌరస్తా వద్ద ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మాణం చేయాలని అక్కడి ప్రజలు కోరారు. రోడ్డు నిర్మాణం చేస్తున్న సమయంలో ఎల్‌అండ్‌టీ ఇంజినీరింగ్‌ అధికారులు, నేషనల్‌ హైవే అథారిటీ ఇంజినీరింగ్‌ అధికారులు అక్కడ సైతం ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మాణం చేస్తామని తెలిపారు. తీరా రోడ్డు పనులు పూర్తి చేసి టోల్‌ గేట్లు ఏర్పాటు చేసి పన్నులు వసూలు చేస్తున్నా అక్కడ ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మాణం చేయలేదు. దీంతో ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు జరిగి అనేకమంది చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. దీంతోపాటు మునిపల్లి మండలంలోని లింగంపల్లి చౌరస్తా, కోహీర్‌ మండలంలోని కొత్తూర్‌ (డీ), చింతల్‌ఘాట్‌ చౌరస్తా, వెంకటపూర్‌ చౌరస్తా,  మద్రి చౌరస్తా, హుగ్గెల్లి చౌరస్తా, అల్గోల్‌ చౌరస్తా, బుర్థిపాడు, బుచినెల్లి, సత్వార్‌, మాడ్గి చౌరస్తాల వద్ద ఎలాంటి ప్రమాద నివారణ చర్యలు తీసుకోలేదు. కొన్ని గ్రామాల్లో జాతీయ రహదారి వెంట సర్వీస్‌ రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారిపై 80 కి.మీ, 60 రాష్ట్ర రహదారిపై  40 పంచాయతీ రహదారుల పై మించి వేగంతో వెళ్లకూడదు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

65వ జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించాం. బ్లాక్‌ స్పాట్‌ల వద్ద ప్రమాద కారకాలు తెలుసుకుని వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రమాదకర చౌరస్తాల వద్ద వేగం నియంత్రించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. 

- జి.శంకర్‌రాజు, డీఎస్‌పీ, జహీరాబాద్‌

వాహనదారుల్లో మార్పు రావాలి

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాలి. అతివేగం, నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరం. వాహనదారుల్లో మార్పు రాకుంటే కష్టం. రహదారి నిబంధనలపై అవగాహన కల్పిస్తాం. ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తాం.

- అశ్వంత్‌కుమార్‌, ఎంవీఐ, జహీరాబాద్‌ 


VIDEOS

logo