ఆదివారం 07 మార్చి 2021
Sangareddy - Jan 24, 2021 , 00:16:04

నిర్లక్ష్యంపై కొరడా..

నిర్లక్ష్యంపై కొరడా..

జిల్లాలో ఆరుగురిపై చర్యలు

ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల తొలిగింపు

ముగ్గురు ఉప సర్పంచ్‌ల చెక్‌ పవర్‌ రద్దు చేసిన కలెక్టర్‌ 

సంగారెడ్డి చౌరస్తా, జనవరి 23: విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆరుగురు అధికారులు, ప్రజాప్రతినిధులపై కలెక్టర్‌ ఎం.హనుమంతరావు కొరడా ఝులిపించారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో అలసత్వం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. శనివారం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు జిల్లా పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఆయా అధికారులు, ప్రజాప్రతినిధులపై ఇప్పటికే ఫిర్యాదులు ఉన్నందున కలెక్టర్‌ వెంటనే చర్యలకు ఉపక్రమించారు. ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను విధుల నుంచి తొలిగించి, ముగ్గురు ఉప సర్పంచ్‌ల చెక్‌ పవర్‌ రద్దు చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కల్హేర్‌ మండలంలోని మార్డి గ్రామ పంచాయతీ కార్యదర్శి డి.రాధాకృష్ణ గత డిసెంబర్‌ 14 నుంచి విధులకు హాజరుకానందున ఆయన్ను విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా పటాన్‌చెరు మండలం నందిగామ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎస్‌.పద్మ గ్రామంలో తడి పొడి చెత్త సరిగ్గా వేరు చేయక, వర్మీ కంపోస్ట్‌ను సక్రమంగా చేయడంలో నిర్లక్ష్యం వహించినందుకు ఆమెను విధుల నుంచి తొలిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నారాయణఖేడ్‌ మండలం ఐక్లె తండా గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్‌ శ్యామల, సదాశివపేట మండలం బాబుల్‌గావ్‌ ఉపసర్పంచ్‌ పి.జి.సురేశ్‌ , మునిపల్లి మండలం మల్లికార్జునపల్లి ఉప సర్పంచ్‌ జి.విఠల్‌రెడ్డి వారి గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చేసిన బిల్లుల చెల్లింపు చేసే చెక్కులపై సంతకాలు చేయడానికి నిరాకరించినందున వారి చెక్‌ పవర్‌ను కూడా తొలిగిస్తూ, సంబంధిత మండల పంచాయతీ అధికారికి చెక్‌ పవర్‌ ఇస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పటాన్‌చెరు మండల పంచాయతీ అధికారి బి.సంతోశ్‌ మండలంలోని పంచాయతీ కార్యదర్శుల పనితీరు పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు.

VIDEOS

logo